బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నీరుగారిపోయింది..
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మూడు పదవులు.. ఆరు ఫిరాయింపులుల్లాగా ఫుల్ జోష్ మీద నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ అక్కడ బాగానే వర్కవుట్ అయింది. చాలా మంది నేతలు పార్టీ ఫిరాయించి గులాబీ గూటికి చేరారు. ఇక అదే అడుగుజాడల్లో ఇక్కడ ఏపీలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దాని తాతలా తయారైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు.. ఇలా ఒక్కరేంటి చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంకా కప్పుకోవడానికి చాలా మంది రెడీగానే ఉన్నారనుకోండి. అయితే ఇదంతా నాణెనికి ఒకపక్క మాత్రమే. ఇంకో పక్క ఏంటంటే.. బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ చేయండ. విచిత్రంగా ఉంది.. ఇప్పటి వరకూ బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందంటే నమ్మడానికి కొంచం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే బీజేపీ చేపట్టిన విషయం ఇంతవరకూ ఎవరికీ తెలియక పోవడం. ఎందుకంటే కనీసం ఒక్క నేత అయిన బీజేపీలో చేరి ఉంటే ఆ విషయం బయటపడేది.
అసలు సంగతేంటంటే.. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ మాదిరి బీజేపీ కూడా అసంతృప్తి నేతలను ఆకర్షించడానికి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నే ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించమని రాష్ట్ర నేతలను ఆదేశించారు. అంతేకాదు దీనిలో భాగంగా ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించటానికి ఏకంగా ఒక కమిటీనే ఏర్పాటు చేసింది బీజేపీ. కమిటీలో సీనియర్ నేత, ఎంఎల్‌సి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, రాంభూపాల్ రెడ్డి, శాంతారెడ్డి ఉన్నారు. వీరి పని ఏంటంటే.. జిల్లాల వారీగా, పార్టీల వారీగా ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను గుర్తించటం, వారితో నేరుగా గానీ లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించడం.. వారిని పార్టీలోకి తీసుకురావడం. అయితే దౌర్భాగ్యం ఏంటంటే... ఈ కమిటీ ఏర్పాటు చేసి రెండు నెలలు అవుతున్నా ఒక్కరు కూడా బీజేపీ వైపు కన్నెత్తి చూడకపోవడం..
అందుకు కారణం లేకపోలేదు.. గడచిన రెండేళ్ళుగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేసిన సాయం ఏమీ ప్రజలకు కనబడటం లేదు. పైగా, విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, ఆర్ధికలోటు భర్తీ తదితరాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో నేతలు కూడా బీజీపీలోకి వెళ్లినా వర్కవుట్ కాదని ఆ వైపు కూడా చూడటంలేదు. రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణల్లో బీజేపీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేతలకు నిరాసనే మిగిల్చింది. ఆపరేషన్ ఆకర్ష్ నీరుగారిపోయింది.