ప్రపంచంలోనే ఏపీ నెంబర్‌వన్ కావాలి-చంద్రబాబు
70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. అనంతరపురంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ..ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగాల వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. రాయలసీమలో పుట్టిన ఎందరో మహనీయులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారని వారందరినీ తెలుగుజాతి ఎన్నటికీ మర్చిపోదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలను అనంతపురంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తే..తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, చివరకు కుట్రలు, కుతంత్రాలతో తెలుగుజాతిని విడదీసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించి కట్టుబట్టలతో రోడ్డున పడేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా...నిధుల లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు. 2022 నాటికి ఏపీ మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి నంబర్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.