సబితకు తెలంగాణ సర్కార్ షాక్.. భద్రత తొలగింపు..

  మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఆమెకు ఏర్పాటు చేసిన భద్రతను తొలగించింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది. మాజీ హోం మంత్రి హోదాలో ఏర్పాటు చేసిన భద్రతను కొనసాగించలేమని..  తక్షణమే గన్ మెన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం సబితకు వెల్లడించింది. దీంతో ఏ క్షణంలోనైనా గన్ మెన్లు భాద్యతలు ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే.. సబితా కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సబితా ఇంద్రారెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి హోం మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. తెలుగు నేలలో తొలి మహిళా హోంశాఖ మంత్రిగా రికార్డు పుటల్లోకి ఎక్కారు.

హార్దిక్ పటేల్ పై ఆరోపణలు.. బంగ్లాలో జల్సా చేస్తున్నాడు..

  హార్దిక్ పటేల్.. గుజరాత్ లోని పటేళ్లను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేసిన ఉద్యమం చేపట్టాడు. తన పదునైన వాయిస్ తో ఆకట్టుకన్న హార్దిక్ చేసిన డిమాండ్ కు ప్రభుత్వం సైతం కదిలివచ్చింది. ఈ క్రమంలో గుజరాత్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు.. ఆందోళనలే చెలరేగాయి. అయితే ఇప్పుడు తాజాగా హర్ధిక్ పై కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవేంటంటే.. ఉద్యమం పేరుతో సొంత కమ్యూనిటీ నుంచి సేకరించిన నిధులతో ఆయన హాయిగా జల్సా చేస్తున్నాడన్నది. బంధువుల సలహాలతో భారీ బంగ్లా, విలాసవంతమైన కారుతో గడుపుతున్నాడని.. ఇంతకు ముందులా ఉద్యమంపై ఆయన దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు స్వయంగా హార్దిక్ పటేల్ క్లోజ్ ఫ్రెండ్సే. అందుకే ఇంత ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఆరోపణలపై హార్ధిక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

చిదంబరం భార్యకు ఈడీ సమన్లు..

2013లో పశ్చిమ్‌బంగాలో వెలుగులోకి వచ్చిన శారద చిట్‌ఫండ్‌ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ స్కాం తెరపైకి వచ్చింది. ఈ స్కాంలో భాగంగా కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం భార్య నళినికి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో నళినికి కూడా సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తుండటంతో ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ ఆమెను ప్రశ్నించనుంది.  అయితే ఈ కేసులో నళినిని సాక్షి లేదా నిందితురాలిగా కాకుండా.. వివాదాస్పద ఛానల్‌ ఒప్పందం గురించి తెలిసిన రహస్య వ్యక్తిగా పేర్కొన్నారు.

వేముల రోహిత్ దళితుడే కాదు..

  హెచ్‌సీయూలో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో మరో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. గతంలో రోహిత్ దళితుడని కొందరు అంటే.. కాదు అని కొందరు అన్న వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. రోహిత్ వేముల దళితుడే కాదని మానవ వనరుల శాఖ న్యాయ విచారణ కమిటీని తెలిపింది. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మానవ వనరుల శాఖ న్యాయ విచారణ కమిటీని నియమించింది. సదరు కమిటీ దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ నివేదికలో రోహిత్ దళితుడు కాదనే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.

కాశ్మీర్ అల్లర్ల ఫలితం.. ఆరువేల కోట్ల నష్టం..

  హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన కాశ్మీర్ కాస్త హింసాత్మకంగా మారింది. ఇప్పటికే గత నెలరోజుల పైనుండి ఇక్కడ భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అయినా కానీ అప్పుడప్పుడు అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రామిక జీవులకు తిండి గగనమైంది. పస్తులతో వారు అలమటించిపోతున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది.   ఇదంతా ఒకటైతే.. ఇప్పుడు ఈ అల్లర్ల వల్ల కాశ్మీర్లో వ్యాపార రంగానికి భారీగానే గండిపడినట్టు తెలుస్తోంది. దాదాపు 45 రోజుల నుండి జరుగుతున్న ఈ అల్లర్ల వల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరువేల కోట్ల రూపాయలు నష్టం వాటినట్టు సమాచారం. రోజుకు దాదాపు రూ.135 కోట్ల చొప్పున నష్టపోతున్నట్టు కశ్మీర్ ట్రేడర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మొహ్మద్ యాసిన్ ఖాన్ తెలిపారు. ఇంతటి సంక్షోభాన్ని తామెప్పుడూ చూడలేదని పేర్కొన్న ఆయన కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి ఇప్పటికైనా కాశ్మీర్ వాసులు కళ్లు తెరుస్తారో లేదో చూడాలి.

చైనా వార్నింగ్ కు భారత్ సమాధానం.. మీ పని మీరు చూసుకోండి

  భారత్ కు చైనాకు ఈ మధ్య అన్ని విషయాల్లో విబేధాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంశాల్లో చైనా, భారత్ ల వ్యవహారం ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టు తయారైంది. ఇప్పుడు మరో విషయంలో భారత్ చైనాకు ధీటైన సమాధానం చెప్పింది. అది బ్రహ్మోస్ క్షిపణుల విషయంలో. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను భారత్ మోహరిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ వార్తలకు స్పందించిన చైనా.. అదే కనుక జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఇక చైనా హెచ్చరికలకు స్పందించిన భారత్ కూడా బాగానే ఘాటుగా సమాధానమిచ్చింది. ‘మా భూభాగం, మా భద్రతకు పొంచి ఉన్న ముప్పుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. క్షిపణులు, ఆయుధాలను మా భూభాగంలో ఎక్కడ మోహరించాలన్న విషయాన్ని చైనా ప్రభావితం చేయజాలదు’’ తామేం చేయాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదని, తమకు తెలుసని చెప్పింది.   కాగా భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులంటే చైనాకు మొదటి నుంచీ వణుకే. వీటిని జలాంతర్గాములు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, భూతలం నుంచి కూడా ప్రయోగించే వీలుండడమే ఇందుకు కారణం. 300 కిలోల అణువార్‌హెడ్లను మోసుకెళ్లగలిగే ఈ క్షిపణులు 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలవు.

సంపన్న దేశాల్లో భారత్ కు స్థానం.. టాప్ టెన్ లో

ప్రపంచంలోని సంపన్న దేశాల్లో భారత్ కు చోటు దక్కింది. టాప్ టెన్ దేశాల్లో మన ఇండియా ఏడో స్థానంలో ఉంది. వినడానికి కొంచెం అశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. న్యూ వరల్డ్ హెల్త్ అనే సంస్థ చేసిన సర్వేలో అగ్రరాజ్యమైన అమెరికా 48.90 లక్షల కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో మొదటి స్థానంలో ఉంది. ఇక 17.40 లక్షల కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉండగా, 15.10 లక్షల కోట్ల డాలర్లతో జపాన్ మూడో స్థానంలో ఉంది. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆతరువాతి స్థానంలో భారత్ చోటు సంపాదించుకుంది. పౌరుల వ్యక్తిగత ప్రైవేటు ఆస్తులను బట్టి వారి సంపదను అంచనా వేశారు.   అయితే ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే.. 130 కోట్ల జనాభా ఉన్న మన వద్ద 5.60 లక్షల కోట్ల డాలర్ల ఉమ్మడి సంపద ఉంటే.. ఆస్ట్రేలియాలో 2.2 కోట్ల మంది మాత్రమే ఉన్నప్పటికీ వారి వద్ద 4.4 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ఇక చైనా జనాభాకి మన జనాభాకి పెద్దగా తేడా లేకపోయినా.. చైనా మాత్రం మనకు అందనంత దూరంలో ఉంది. మరి ఈ లెక్కన చూస్తే ఎంత టెన్ సంపన్నదేశాల జాబితాలో భారత్‌కు స్థానం దక్కించుకున్నా.. తలసరి ఆదాయం పరంగా చూస్తే మనం పేదరికంలో ఉన్నట్లే భావించాలి.

పాస్‌పోర్ట్ లో తండ్రి పేరు అవసరం లేదు..

  పాస్‌పోర్ట్ లో తండ్రి పేరుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు నిచ్చింది. పాస్‌పోర్ట్ ధరఖాస్తు చేసుకునేప్పుడు తండ్రి పేరు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని నేడు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టుకు ఈరకమైన కేసు ఒకటి రాగా దానిపై న్యాయ‌మూర్తి సంజీవ్ స‌చ్‌దేవ్ ఇలాంటి తీర్పు నిచ్చారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు పాస్‌పోర్ట్ కు అప్లయ్ చేశాడు. అయితే తాను తన పాస్ పోర్ట్ పై తన తండ్రి పేరు నమోదు చేయలేదు. తన తల్లిదండ్రులు విడిపోవడంతో విద్యార్థి తన తండ్రి పేరు రాయలేదు. దీంతో అత‌నికి పోస్‌పోర్ట్ జారీ చేసేందుకు ప్రాంతీయ కార్యాల‌యం నిరాక‌రించింది. ఇక చేసేది లేక తాను కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన కోర్టు పాస్‌పోర్ట్‌పై తండ్రి పేరు అవ‌స‌రంలేద‌ని స్ప‌ష్టం చేసింది.

టాప్ 5 పోస్టుల్లో ప్రధాని పోస్ట్..

  ప్రధాని మోడీ సోషల్ మీడియాకు బాగానే టచ్ లో ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆయన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన పి.వి సింధూపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ, రాష్ట్రపతి, అమితాబ్, రజనీ కాంత్ అబ్బో ఇలాంటి దిగ్గజాలు ఎంతో మంది సింధూని ప్రశంసిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. అయితే ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే రియో ఒలింపిక్స్ సందర్భంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయిన టాప్ 5 పోస్టుల్లో సింధుని ప్రధాని ప్రశంసించిన పోస్టు ఒకటి కావడం గమనార్హం. కాగా ఒలింపిక్స్‌లో అద్భుతంగా పోరాడావని, రియోలో నువ్వు సాధించిన విజయం చారిత్రాత్మకమైందని.. ఏళ్లపాటు నీ విజయం గుర్తుండిపోతుందని మోడీ సింధును ప్రశంసించారు.  

సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య..

  గుజరాత్లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ జర్నలిస్ట్ ను దారణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం... గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో కిశోర్‌ దవే అనే వ్యక్తి గుజరాత్‌ వార్తాపత్రిక జైహింద్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్నరాత్రి తన ఆఫీసులో ఒంటరిగా స్టోరీ రాసుకుంటుండగా కొంతమంది దుండగలు ఆయనపై దాడి చేసి కత్తితో పొడిచి చంపేశారు. ఛాతీపై పలుమార్లు కత్తితో పొడవడంతో కిశోర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవైపు కిశోర్ హత్యకు స్థానిక రాజకీయనాయకుడి కుమారుడి హస్తం ఉన్నట్లు ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మహారాష్ట్రతో తెలంగాణ చారిత్రక ఒప్పందాలు..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, చనాకా-కొరాటా ఆనకట్టలపై ఇరు రాష్టాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలపై ఇరు రాష్ట్ర సీఎంలు సంతకాలు చేశారు.   * ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం.. తుమ్మిడిహట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు. తుమ్మిడిహట్టి ద్వారా ఆదిలాబాద్లో 2 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.   * కాళేశ్వరం దిగువన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం..  మేడిగడ్డ ఐదు పూర్తిస్థాయి నీటిమట్టం 100 మీటర్లు. కాగా ఐదు జిల్లాలకు మేడిగడ్డ బ్యారేజీ ద్వారా నీరు అందుతుంది.   * లోయర్ పెను గంగపై చనాకా-కొరాటా బ్యారేజీ నిర్మాణం. చనాకా-కొరాటా నీటి సామర్థ్యం 0.85   ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం.. మహారాష్ట్రతో ఎలాంటి విభేదాలు లేవు.. ఇలాగే సత్సంబంధాలు కొనసాగిస్తామని అన్నారు.   ఫడ్నవీస్ మాట్లాడుతూ.. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాం.. రెండు రాష్టాలకు నీళ్లు చాలా అవసరం.. రెండు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందాలు జరిగాయి.. నీటి వాటా విషయంలో తెలంగాణకు సహకరిస్తామని తెలిపారు. 

పుష్కరాల నుండి వెళుతూ కారు బోల్తా.. ఏడుగురు మృతి

  విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వివరాల ప్రకారం.. కృష్ణ పుష్కరాలు ముగించుకొని ఓ కుటుంబం కారులో తిరిగి తమ సొంతూరుకి పయనమయ్యారు. అయితే విజయవాడలోని బెంజి సర్కిల్ లో కారు ప్రమాదవశాత్తు కారు డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ మహిళతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా ఒకవైపు రేపటితో పుష్కరాలు ముగియనుండటం.. మరోపక్క రియో స్టార్ సింధూకు సన్మానం కార్యక్రమంతో విజయవాడలో పండగ వాతావరణం నెలకొనగా ఇలాంటి ఘటన జరగడం విషాదకరం..

బ్యాడ్మింటన్ ఆడిన చంద్రబాబు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియో ఒలింపిక్ విజేత పి.వి సింధూకి ఘన స్వాగతం పలికారు. అప్పటికే అరగంట ముందు స్టేడియం కు చేరకున్న చంద్రబాబు.. సింధు రాగానే... ఆమెకు ఎదురు వెళ్లి సాదరంగా వేదికపైకి తీసుకొచ్చారు. రజత పతకం సాధించినందుకు గాను ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు ఆమె కోచ్ గోపిచంద్ కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్టేజ్ ఎక్కిన తరువాత చంద్రబాబు పివి సింధూతో బ్యాడ్మింటన్ ఆడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీలు మాగంటి బాబు, మురళీమోహన్, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, దేవినేని ఉమ, బొండా ఉమా, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన మోహన్ రెడ్డి..

  గత కొద్దినెలల క్రిందట తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఉందతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే మోహన్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోటు తాజాగా గ్యాంగ్ స్టర్ నయీమ్ తో కూడా మోహన్ రెడ్దికి సంబంధాలు  ఉన్నాయని బయటపడింది. బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం.. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి తన స్థలాన్ని తిరిగి ఇవ్వడం లేదని ఆయన వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ లభించడంతో కరీంనగర్‌ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణరెడ్డి బంధువులు మోహన్ రెడ్డికి నయీంతో సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో అప్పటినుండి మోహన్ రెడ్డి కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న రాత్రి ఆయన ఓ న్యాయవాదితో పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. దీంతో మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు కరీంనగర్‌ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

మొన్న తమిళనాడు.. నేడు గుజరాత్..

మొన్నటికి మొన్న తమిళనాడు అసెంబ్లీ నుండి విపక్ష నేతలు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో జరిగిందే.. గుజరాత్ అసెంబ్లీలో కూడా చోటుచేసుకుంది. గుజరాత్ అసెంబ్లీ నుండి విపక్ష ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. గుజరాత్ అసెంబ్లీలో ఉనా దళితుల ఘటనను ఆ రాష్ట్ర విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ సభలో ప్రస్తావించి.. బాధితులకు న్యాయం చేయడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే సభలోనే ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ మొత్తం 44 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఈ మధ్యకాలంలో విపక్ష సభ్యులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుంది. తొలుత తెలంగాణ, ఆ తర్వాత ఏపీ, తమిళనాడు... తాజాగా గుజరాత్. మరి ఇంకెన్ని రాష్ట్రాల్లో జరుగుతందో చూద్దాం.

కన్య్ఫూజన్ లో కేసీఆర్...

  పి.వి సింధూ.. గత మూడు నాలుగు రోజుల నుండి వినిపిస్తున్న పేరు ఇదే. రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచి ఇండియా పేరు ప్రతిష్టలు నిలబెట్టి.. త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన సింధూపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు సింధూకు రివార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ఒక్క మన తెలుగు రాష్ట్రాలేనా.. పక్క రాష్ట్రాలు కూడా సింధూకు నజరానా ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం రూ.3కోట్ల రూపాయలు నజరానా.. రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలం.. ఓ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాయి. ఇక అన్నింటిలో పోటీ పడే కేసీఆర్.. ఈసారి కూడా తన మార్క్ చూపించారు. ఒక అడుగు ముందుకేసి.. సింధూకి రూ. 5కోట్ల నజరానా.. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం వేయి గజాల స్థలం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్న ఇప్పుడు కేసీఆర్ ఓ కన్య్ఫూజన్ లో పడ్డారు.   ఈ కన్ప్యూజన్ ఎందుకంటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గురించి. ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పి.వి సింధూను బ్రాండ్ అంబాసిడర్ గా ప్ర‌క‌టించాల‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుంది. దానికి తోడు ఏపీ క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ సైతం సింధూను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని అన్నారు. అంతేకాదు ‘బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒక్కరే ఉండాల‌ని ఏం లేదు కనుక.. ఇద్దరినైనా ప్రకటించవచ్చు’ .. సింధూ భవిష్యత్‌లో తప్పక స్వర్ణపతకాన్ని సాధిస్తుందనే నమ్మకం నాకుంది అని అన్నారు. మరోవైపు చాముండేశ్వరనాథ్ సానియా మీర్జాకు కూడా చాలా సన్నిహితులు. అలాంచిది ఆయనే ఇలాంటి ప్రతిపాదన తేవడంతో ఆస‌క్తిక‌రంగా మారింది. మరి చూద్దాం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..