అధికారులకు చంద్రబాబు వార్నింగ్.. అలక్ష్యం ఉండకూడదు

  కృష్ణ పుష్కరాలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన మొదటి రోజు భక్తులు తాకిడి కాస్త తక్కువగా ఉన్నా ఈరోజు మాత్రం పుష్కర స్నానాలతో ఘాట్లు కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా పుష్కరాల రెండో రోజు ఏర్పాట్లపై 1020 మంది అధికారులు, సిబ్బందితో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు.. కృష్ణా పుష్కరాల విధి నిర్వహణలో అలక్ష్యం ఉండకూడదని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని.. పవిత్ర భావనతో పుష్కరాల ఏర్పాట్లు చేస్తున్నందున, వచ్చిన యాత్రికులు అందరినీ సంతృప్తిగా పంపాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు హోంగార్డులు సాయపడాలని, గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది అంతా ఒక్కచోటే కాకుండా అన్ని ప్రాంతాలకు వెళ్లి అన్ని చోట్ల పారిశుద్ధ్యం మెరుగు పరచటంతో పాటు నీళ్లలో వ్యర్థాలు తొలగించేందుకు వలలు వినియోగించాలన్నారు. ప్రతిఘాట్‌ వద్ద వాటర్‌లెవల్‌ ఇండికేటర్లు ఉపయోగించాలి. నీటిమట్టం లోతు అందరికీ తెలిస్తేనే స్నానానికి ఘాట్‌లో దిగే యాత్రీకులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.

దుండగుల కాల్పుల్లో కాంగ్రెస్ నేత మృతి..

ఈ మధ్యకాలంలో నేతలను టార్గెట్ చేసి వారిపై దాడులు చేయడం కామన్ అయిపోయింది. నిన్నటికి నిన్న యూపీలో బీజేపీ నేతపై దుండగులు కాల్పులు జరిపిన సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతంలో కాల్పుల కలకలం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యాదగిరి అనే నాయకుడిపై బైక్ మీద వచ్చిన దుండగులు..ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో యాదగిరి తీవ్రంగా గాయపడగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు. పోలీసులు కూడా దీనిపై ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన దుండగులు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే భూతగాదాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ నేత దాడి వెనుక లేడీ కానిస్టేబుల్ హస్తం..

బీజేపీ సీనియర్ నాయకుడు బ్రిజ్‌పాల్ టియోటియాపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆయన కారును మార్గ మధ్యంలో ఆపి దుండగలు ఏకే 47 రైఫిళ్లతో దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ దాడిలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది ఓ మహిళా కానిస్టేబుల్ అని తేలింది. ఆమెను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళా కానిస్టేబుల్ సునీత భర్త.. రాకేష్ హసన్‌పూరియా. అతడు ఓ గ్యాంగ్‌స్టర్. 2003లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. తన భర్త మృతికి బ్రిజ్‌పాలే కారణమని సునీత అప్పట్లో ఆరోపించింది. బ్రిజ్‌పాల్ గతంలో ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆ కక్షతోనే ఇప్పుడు ఆయన మీద దాడి చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

రైల్వే బడ్జెట్ కు ఇక మంగళం..

  ప్రతి ఏటా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతుందన్నసంగతి తెలిసిందే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ సంపద్రాయానికి మోడీ ప్రభుత్వం మంగళం పాడనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అంతా ఒకే బడ్జెట్‌ (సాధారణ)గా ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు అప్పుడే మొదలుపెట్టారు కూడా. అంతేకాదు ప్రణాళిక సంఘం- నీతి ఆయోగ్ సభ్యులు బిబేక్ దేబరాయ్, కిషోర్ దేశాయ్ లు రైల్వే బడ్జెట్‌ను ఆర్థిక బడ్జెట్‌లో విలీనం చేసే విషయంలో అప్పుడే ఓ నివేదికను కూడా మోడీకి సమర్పించారట. ఇక అన్నీ కుదిరితే సాధారణ (ఆర్థిక) రైల్వే బడ్జెట్ అంటూ ప్రత్యేకించి ఉండదు.   కాగా ఈ విధానం ఎప్పటి నుండో అమలులో ఉన్న సంగతి విదితమే..అయితే ఈ విధానం వల్ల ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రులు తమ రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు, అధిక నిధులు కేటాయించుకోవడం, ఇతర రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం కనిపిస్తుండటంతో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

నేతల వింత ఫిర్యాదులు..

ఒకపక్క దేశంలో జరుగుతున్న నేరాలను ఆపడానికే పోలీసులకి టైం సరిపోకుంటే.. మరోపక్క అధికారుల ఫిర్యాదులు మరో తలనొప్పిగా తయారయ్యాయి. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ పోలీసులు మంత్రి ఆజాంఖాన్ తప్పిపోయిన పశువులు వెతికి పట్టుకున్నారు. ఇప్పుడు మరో బాధ్యత వారి నెత్తిన పడింది. ఈసారి ఎంపీగారు వంతు వచ్చింది. తమ పెంపుడు కుక్క తప్పింపోయిందని బీజేపీ ఆగ్రా ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుక్కను గుర్తు తెలియని దుండగులు మూడు రోజుల క్రితం ఎత్తుకుపోయారని.. తమ పెంపుడు కుక్క నలుపు రంగులో ఉంటుందని, లాబ్రడర్ జాతికి చెందినదని హరి పర్వత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశారు. అంతేకాదు మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికిపట్టుకున్న పోలీసులు తమ కుక్కను ఎందుకు వెతికి పెట్టకూడదని ఆమె ప్రశ్నించారు. మొత్తానికి పోలీసులకి మరో పనిబడింది.

సీఎం కు బాలిక రక్తంతో లేఖ.. నా తల్లిని సజీవదహనం చేశారు

తన తల్లిని చంపిన హంతకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ బాలికి  సీఎం అఖిలేష్ యాదవ్ కు లేఖ రాసింది. అది కూడా తన రక్తంతో. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్ పట్టణానికి చెందిన ఒక వివాహితకు ఇద్దరు కుమార్తెలు. అయితే ఆమెకు మగసంతానం పుట్టలేదని చెప్పి హత్య చేశారు. ఈ విషయాన్ని ఆ బాలిక లేఖ ద్వారా సీఎంకు తెలియజేసింది. మగ సంతానానికి జన్మ నివ్వలేదనే కారణంగా తన తల్లిని తన తండ్రి మనోజ్ బన్సాల్, ఇతర కుటుంబసభ్యులు తమ కళ్లెదుటే సజీవదహనం చేశారని, తనను, తన చెల్లిని ఒక గదిలో బంధించి తమ తల్లికి నిప్పంటించారని పేర్కొంది. తనను, తన చెల్లిని కూడా చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని, ఈ విషయమై పోలీసులు తమకు ఎటువంటి సాయం చేయకపోగా, నిందితులకు వారు రక్షణగా నిలుస్తున్నారని ఆ లేఖలో పేర్కొంది. కాగా, ఈ జులైలో ఈ విషయమై సీఎం అఖిలేష్ కు ఈ బాలిక ఒక లేఖ రాసింది. అయితే, దీనిపై సీఎం స్పందించకపోవడంతో, తాజాగా మరోమారు ఈ లేఖను తన రక్తంతో రాసింది. ఈవిధంగా చేస్తే సీఎం స్పందిస్తారనే ఇలా లేఖ రాశానని ఆ బాలిక పేర్కొంది.

నయీం ఎన్‌కౌంటర్‌ పై కవిత.. రాజకీయం చేయవద్దు..

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌ తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన సంగతి తెలసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురి పేర్లు బయటపడ్డాయి. ఇంకా ఎంతమంది పేర్లు బయటపడతాయో తెలీదు. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై రాజకీయ నేతలు పెద్దగా మాట్లాడింది లేదు. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ పై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించి.. నయీం ఎన్‌కౌంటర్‌ను రాజకీయం చేయవద్దని అన్నారు. కొత్త జిల్లాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. కొత్త జిల్లాలపై కేబినెట్ కమిటి భేటీ పరిపాలన సౌలభ్యం కోసం చిన్న చిన్న జిల్లాలను ఏర్పాటు చేస్తున్నమని కవిత అన్నారు.

73 టీవీ ఛానళ్లపై నిషేధం..

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 73 టీవీ చానళ్లపై నిషేధం విధిస్తూ సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. ఐఅండ్ బీ శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అప్ లింకింగ్ గైడ్ లైన్స్ పాటించనందుకు.. నిబంధనలు ఉల్లంఘించి ప్రసారాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో  73 టీవీ చానళ్లు సహా 24 ఎఫ్ఎం ఛానళ్లు, 9 పత్రికలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ప్రింట్ మీడియాలో నిబంధనలకు కఠినతరం చేయనున్నామని, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్స్ చట్టం 1897ను సవరించనున్నామని రాజ్యవర్థన్ వివరించారు. కాగా, దేశంలో 42 ప్రైవేటు ఛానళ్లకు, 196 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

అనంతలో దారుణం.. మరో జంట హత్యలు

  అనంతలో మరోసారి పాత కక్ష్యలు బయటపడ్డాయి. గతంలోనే పాత కక్ష్యల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. అది మర్చిపోయేలోపే మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వివరాల ప్రకారం..జిల్లాలోని బుక్కచర్ల గ్రామానికి చెందిన జయచంద్రారెడ్డి తన సోదరి కుక్క కాటుకు గురవ్వడంతో అశోక్‌రెడ్డి సహాయంతో అటోలో అనంతపురం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే జయచంద్రారెడ్డి, అశోక్‌రెడ్డిలు తిరిగి బుక్కచర్లకు వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేసి గొంతుకు తాడుతో బిగించి హతమార్చారు. దీంతో అనంతలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గవర్నర్ గా రోశయ్యకు ఉద్వాసన.. బీజేపీ ఎత్తు..

సీనియర్ రాజకీయ నేత రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనను పదవి నుండి తొలగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత డీహెచ్ శంకరమూర్తికి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. అయితే తమిళనాడు ఎన్నికలు జరగక ముందే రోశయ్యను పదవి నుండి తొలగిస్తారు అన్నా వార్తలు వినిపించాయి. కానీ అప్పుడు బీజేపీ అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే ఎన్నికల తర్వాత మాత్రం తమిళనాట పుంజుకునేందుకు సిద్దమై ఈ ఎత్తు వేశారని తెలుస్తోంది. దీనిలో భాగంగా... శంకరమూర్తి స్థాయికి తగ్గట్టు తమిళనాడుకు పంపాలని మోదీ భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ఫైర్... ఇక్కడేమైనా పంచాయతీ నడుస్తోందా..

  కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల గురించిన విషయంలో అఫిడ్ విడ్ దాఖలు చేయమని ఏడాది గడిచినా ఇంతవరకూ ఎలాంటి సమాధానం లేదని.. ప్రభుత్వమే అతిపెద్ద లిటిగెంట్ అని, కానీ కోర్టులు సరిగా పనిచేయలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. ''ఇక్కడేమైనా పంచాయతీ నడుస్తోందని అనుకుంటున్నారా'' అంటూ రవాణా మంత్రిత్వశాఖకు రూ. 25వేల జరిమానా విధించింది.  దాంతో.. మూడు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తుందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమాధానమిచ్చారు.

ఎట్టకేలకు ప్రసూతి బిల్లుకు ఆమోదం..

ఎట్టకేలకు ప్రసూతి బిల్లుకు ఆమోదం లభించింది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించిన రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక లోక్ సభలో ఆమోదం పొందడం ఒక్కటే మిగిలింది. అయితే వచ్చే శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఎలాగూ ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది కనుక లోక్ సభలో కూడా ఆమోదం పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బిల్లు వల్ల కలిగే లాభాలు   * ఇప్పటి వరకూ 12 వారాలు సెలవు పరిమితి ఉండగా..ఇప్పుడు అది 26 వరకూ పెరుగుతుంది * ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న మహిళలకూ ఈబిల్లు వర్తిస్తుంది. * ఇంటి నుండి పనిచేసే మహిళలకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది. * అయితే ఇద్దురూ లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు మాత్రం ఈ సెలవు దినాలు వర్తించవు.

బీజేపీ నేత కాన్వాయ్ పై కాల్పులు.. ఏకే-47తో వంద రౌండ్లు

  భాజపా సీనియర్‌ నేత సీనియర్ నేత కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్లో బీజేపీ నేత బ్రిజ్‌పాల్‌ టియోటియా కాన్వాయ్ పై దుండగులు దాడి చేసి  ఏకే-47తో దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో  బ్రిజ్‌పాల్‌ తీవ్రంగా గాయపడగా ఆయనను నోయిడాలోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలుపుతున్నారు. ఇంకా ఈ దాడిలో బ్రిజ్‌పాల్‌ తో పాటు మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు.   ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సుర్జీప్‌ పాండే మాట్లాడుతూ.. టొయోటా ఫార్చ్యునర్‌ ఎస్‌యూవీలో వచ్చిన దుండగులు బ్రిజ్‌పాల్‌ ఉన్న స్కార్పియో వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని.. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని.. కాల్పులకు ఏకే-47లను ఉపయోగించారని.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఒంటరైన ఇరోమ్ షర్మిల.. మొన్న జేజేలు... నేడు తిట్లు..

  సాయుధ బలగాల అధికారాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇరోమ్ షర్మిలా 16 ఏళ్లు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె తన దీక్షను విరమించారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఎవరైతే ఆమెను పొగిడారో.. ఇప్పుడు వారో తనను విమర్శించే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 16 ఏళ్లుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదని.. తాను దీక్ష చేసినా లాభం లేదని భావించి ఆమె దీక్ష విరమించారు. దీక్ష విరమించి తాను రాజకీయాల్లోకి రావాలని.. తద్వారా తాను అనుకున్నది సాధించాలని ఆమె ప్రకటించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   ఆమెపై తాము గంపెడాశలు పెట్టుకుంటే నిలువునా ముంచిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏపై గతంలో ఎందరో రాజకీయ నాయకులు పోరాడి ఓడిపోయారని, ఇప్పుడు షర్మిల విషయంలోనూ అదే జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నా. అంతేకాదు అఖరికి ఆమె ఉంటున్న ప్రాంతాన్ని కూడా చేయమని.. ఇక్కడ ఉండద్దు అని మరీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. దీంతో ఇరోమ్ ఒంటరైపోయింది. అయితే ఆమెకు షెల్టర్ ఇవ్వడానికి రెడ్‌క్రాస్(మణిపూర్) ముందుకొచ్చింది.   అయితే షర్మిల దీక్ష విరమించడానికి గల కారణం వేరే ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. తాను కనుక ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లి చేసుకుంటానని షర్మిల చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి ఎవరంటే.. భారత్‌లో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు దేశ్‌మండ్ కౌటినో. ఈయనే ఒక విధంగా ఆమె దీక్షను భగ్నం చేయడానకి కారణమని అంటున్నారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకూ జేజేలు కొట్టిన ప్రజలే.. ఇప్పుడు తిడుతుండటం ఆశ్చర్యకరమైన విషయం..

ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబే..

  గత నాలగు రోజుల క్రితం మంత్రుల ఆస్తుల వివరాల గురించిన నివేదిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ఏపీ మంత్రి నారాయణ మొదటి స్థానంలో నిలిచిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రుల ఛాన్స్ వచ్చింది. ఈ నివేదికలో కూడా ఏపీకే మొదటిస్థానం దక్కడం విశేషం. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఇడబ్ల్యు) దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల గురించి జరిపిన అధ్యయనంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికన్నా ధనవంతుడని తేలింది. ఆ తరువాత స్థానాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆక్రమించారు. ఇక మూడో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సొంత చేసుకున్నారు.   కాగా తాజాగా గత ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఆ ప్రకారం చంద్రబాబునాయుడుకు 134 కోట్ల 80 లక్షల 11 వేల 728 రూపాయల చరాస్తులు, 42 కోట్ల 68 లక్షల 83 వేల 883 రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. సిఎం పెమా ఖండుకు 129 కోట్ల 57 లక్షల 56 వేల 014 రూపాయల ఆస్తులున్నాయి. జయలలితకు 113 కోట్ల 73 లక్షల 38 వేల 586 రూపాయల ఆస్తులున్నాయని నివేదిక తేల్చింది.

ఇద్దరు చంద్రుల పుష్కర స్నానం..

పవిత్ర కృష్ణాపుష్కరాలు ఇవాళ్టీ నుంచి ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఆయా ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని దుర్గాఘాట్లో పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. వేకుమ జామునే కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన సీఎం..పుష్కరుడికి హారతి ఇచ్చి పుష్కర స్నానమాచరించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు పుష్కర స్నానం చేశారు. తెలంగాణలో పుష్కరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని గొందిమిళ్ల పుష్కర ఘాట్‌కు కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానం ఆచరించారు. ముఖ్యమంత్రి వెంట శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.