మోత్కుపల్లికి నిరాశే.. ఒకే ఒక్క ఛాన్స్

  మణిపూర్, పంజాబ్, అసోం రాష్ట్రాలకు గాను గవర్నర్లను నియమిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గవర్నర్ల నియామకంపై అందరి సంగతేమో కానీ.. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లికి మాత్రం నిరాశే మిగిలింది. ఎందుకంటే ఎప్పటినుండో మోత్కుపల్లి గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్నసంగతి తెలిసిందే. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మోత్కుపల్లికి ఆ పదవి విషయంపై బహిరంగంగానే తెలిపారు. దీంతో మోత్కుపల్లితో పాటు అందరూ గవర్నర్ పదవి మోత్కుపల్లికి ఖాయం అనుకున్నారు. కానీ సీన్ కాస్త రివర్స్ అయి మోత్కుపల్లి నియామకం కాలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడే మోత్కుపల్లి పేరును.. ప్రధాని ముందు ఉంచినా ఈసారి మాత్రం మోత్కుపల్లికి అవకాశం రాలేదు. ఇక మోత్కుపల్లి గవర్నర్ల నియామకంపై స్పందించి ‘‘నన్ను గవర్నర్‌ను చేస్తారన్న విషయం నాక్కూడా తెలియదు. నువ్వు ఏ క్షణాన్నయినా గవర్నర్ అయ్యే అవకాశం ఉందని గతేడాది మా బాస్ చెప్పినప్పుడు నాకు తెలిసింది. అయితే టీడీపీ నేతలకు ఎందుకు పదవులు రావడం లేదో మాత్రం నాకు తెలియడం లేదు’’ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. అయితే మోత్కుపల్లి ఇక మిగిలింది ఒకే ఒక్క ఛాన్స్. అది కూడా తమిళనాడు గవర్నర్ పదవి. వచ్చే ఏడాదితో రోశయ్య పదవికాలం ముగియనుండడంతో ఆస్థానం ఖాళీగా ఉంటుంది. అయితే అది కూడా చాలా కష్టమే అని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ రోశయ్యనే గవర్నర్ గా కొనసాగించాలని అనుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఈసారి కర్ణాటక సీనియర్ డీహెచ్ శంకరమూర్తిని గవర్నర్ గా నియమించాలని చూస్తుంది. మరి వీరిద్దరి కాదని ఆ పదవి మోత్కుపల్లి వరకూ రావడమంటే కష్టమైన విషయమే. మరి మోత్కుపల్లి అదృష్టం ఎంతవరకూ ఉందో చూడాలి...

వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే అంతే..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో గెలుస్తోమో లేదో అన్న భయం భాగానే పట్టుకున్నట్టు ఉంది. అందుకే ఆయన వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు కాస్త గట్టిగానే ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య.. సదరు ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మిమ్మల్ని అందరినీ గెలిపించాలన్నదే నా తాపత్రయం.. మీరంతా గెలిస్తేనే తాను నిలబడతానని.. రెండోసారి ఓడిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.. అందువల్లే ప్రజలతో ఉండండి. ప్రజలు మనలను విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. అధికారంలోకి వస్తే ప్రతి మాటనూ నిలబెట్టుకుంటా. మీ నియోజకవర్గాల్లో మీరిచ్చే హామీల అమలుకూ సహకరిస్తా’’ అని ఆయన పార్టీ నేతలతో అన్నారు. మొత్తానికి జగన్ కు ఇన్ని రోజులకు కాస్త జ్ఞానోదయం అయినట్టు ఉంది.

ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం..

ఎట్టకేలకు భారత క్రీడా అభిమానులను పట్టుకున్న బెంగ తీరింది. రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. నిన్న అర్థరాత్రి జరిగిన కాంస్య పతక పోరులో కర్గిజిస్థాన్‌కు చెందిన టినిబెకోవాపై 8-5 తేడాతో విజయం సాధించింది. అంతకుముందు ‘రెప్‌చేజ్’ బౌట్‌లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో  ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది.

దీపా కర్మాకర్ కు ఖేల్ రత్నా..!

దీపా కర్మాకర్.. రియో ఒలంపిక్స్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పేరు. గత కొన్ని సంవత్సరాలుగా జిమ్నాస్టిక్స్ రంగానికి చెందిన వారు  ఇప్పటివరకూ వెళ్లని నేపథ్యంలో.. దీపా ఒలింపిక్స్‌కి వెళ్లడమే కాకుండా.. ఫైనల్‌కి చేరి భారత దేశ ఖ్యాతిని పెంచింది.  మెడల్ సాధించకపోయినా ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించింది. అయితే ఇప్పుడు దేశానికి ఇంత కీర్తి తెచ్చిపెట్టిన దీపాకు క్రీడారంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం అయిన ఖేల్‌రత్నతో సత్కరించాలని క్రీడాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు దీపా కోచ్ అయిన బిశ్వేశ్వర్ పేరును ద్రోణాచార్య అవార్డుకు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అధికార ప్రకటన ఇంకా రాలేదు. మరోవైపు షూటర్ జీతూ రాయ్ పేరు కూడా ఖేల్ రత్నకు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ అవార్డ్ ఏడాదికి ఒకరికి మాత్రమే ఇస్తారు. మరి వీరిద్దరిలో ఈ అవార్డ్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

తమిళనాడు అసెంబ్లీలో రసాభాస.. 89 డీఎంకే ఎమ్మెల్యేలు సస్పెండ్

  తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సభా సమావేశాల్లో అధికార పక్ష, విపక్ష నేతల మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. అధికార ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపక్షనేత స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. డీఎంకే ఎమ్మెల్యేలు సభలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ సభను అడ్డుకున్నారు. దీంతో సభ మొత్తం రసాభాసగా తయారైంది. స్పీకర్ ధనపాల్ ఎంత చెప్పినా వినకపోవడంతో 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వీరిపై వారం రోజులపాటు వేటు వేశారు. ప్రతిపక్షనేత స్టాలిన్ను మార్షల్లు హౌస్ నుంచి బయటకు ఎత్తుకొచ్చారు.

కేంద్రమంత్రిగారి భార్యకు బెదిరింపులు..కుటుంబపరువు తీస్తా

సామాన్య ప్రజలకే కాదు ఈమధ్య రాజకీయ నేతలకు కూడా బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ భార్యకు కూడా ఈ బెదిరింపులు ఎదురయ్యాయి. వీకే సింగ్ సతీమణి భారతీ సింగ్ కు ఫోన్ చేసి ఓ వ్యక్తి ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేశాడు. వివరాల ప్రకారం.. ప్రదీప్ చౌహాన్ అనే వ్యక్తి వీకే సింగ్ ఇంటికి ఫోన్ చేసి తాను భారతీ సింగ్ భార్య స్నేహితురాలి బంధువుగా పరిచయం చేసుకొని ఆమెతో మాట్లాడాతు. అయితే అలా మాట్లాడుతూ..ఆ తర్వత తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అంతేకాదు తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే కుటుంబపరువు తీస్తానని.. కుటుంబం పరువుకు భంగం కలిగించే ఆడియో, వీడియో టేపులను సోషల్ మీడియాలో పెడతానంటూ అతడు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడట. దీంతో వీకే సింగ్ భార్య ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం కేంద్ర మంత్రి కుటుంబానికి చెందిన వ్యవహారం కావడంతో పోలీసులు సమాచారం బయటపెట్టడానికి నిరాకరిస్తున్నారు.

టీమిండియా రికార్డ్.. టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటిస్థానం..

టీమిండియా మరో రికార్డ్ సొంతచేసుకుంది. టెస్ట్ ర్యాంకింగ్స్ కు సంబంధించి ఐసీసీ తాజాగా ర్యాంకిగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాకింగ్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. దీంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. మొదటి ర్యాంకును టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-2తో డ్రాగా ముగిసించిన పాకిస్థాన్ రెండో ర్యాంకులో నిలిచింది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్.. 4,5 స్థానాలు దక్కించుకున్నాయి. శ్రీలంక(6), దక్షిణాఫ్రికా(7), వెస్టిండీస్(8), బంగ్లాదేశ్(9), జింబాబ్వే(10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రవిశంకర్ గురూజీ కి ఎదురు దెబ్బ.. నాశనం చేశారు..

  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ కి ఎదురు దెబ్బ తగిలింది. గత కొద్దిరోజుల క్రితం ఆయన యమునా నదీ తీరాన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యమునా నదీ తీర ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన కమిటీ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదించింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ అక్కడి వాతావరణాన్ని పరిశీలించి.. దాదాపు 47 పేజీల నివేదికను అందించింది. అక్కడి పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని నివేదికలో పాల్గొన్నారు. కాగా రవిశంకర్ గురూజీ ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి ఇచ్చేది లేదని తెలిపినా రవిశంకర్ గురూజీ మాత్రం వినలేదు. అంతేకాదు దానికి ఆయన జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఏం చర్యలు తీసకుంటారో చూడాలి.

కుక్క మాంసం తినమంటున్న ఉత్తర కొరియా నియంత...

  కుక్క మాసం తింటే మంచిదట. కుక్కమాంసం ఎంతో బలానిస్తుందట.. అందులో చాలా విటమిన్స్ ఉన్నాయట. ఇంతకీ కుక్క మాంసం గురించి ఇంతలా చెబుతున్నది ఎవరునుకుంటున్నారా. అతనెవరో కాదు ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. ప్రియమైన నా దేశ ప్రజలారా, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కుక్క మాంసాన్ని కడుపునిండా తినండి..  చికెన్, బీఫ్, పోర్క్, బాతు మాంసాల కంటే కుక్క మాంసం ఎంతో బలవర్దకమైనదని.. కుక్కమాంసంలో అద్బుత పోషక విలువలు ఉన్నాయని, అందులోని విటమిన్స్ మనిషికి శక్తివంతమైన బలాన్ని ఇస్తాయని కిమ్ జాంగ్ ఉన్ జాతికి పిలుపునిచ్చారు. దీనికి తగ్గట్టే ఆ దేశ వార్త సంస్థలు కుక్క మాంసంపై తెగ కథనాలు రాసేస్తున్నారు. ఇక ప్రజలైతే మరో అడుగుముందుకేసి.. మామూలు కుక్కమాంసాన్ని తింటే ఏముంటుంది.. కుక్కని దారుణంగా చంపి.. తరువాత ఆ మాంసం తింటే చాలా రుచిగా ఉంటుందంటూ తమ పైశాచికాన్ని చూపిస్తున్నారు.

సీన్ రివర్స్.. టీడీపీనేత వైసీపీలోకి

  ఒకపక్క ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వలుసలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీకి చెందిన ఓ నేత వైసీపీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీపై ఉన్న అసంతృప్తి.. పార్టీలో ఉన్న వారికి కాకుండా బయట నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న నేపథ్యంలో ఈయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాగా 2014లో టీడీపీ చేరిన ఆయన తాడేపల్లిగూడెం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి కేటాయించారు.

రాజ్‌భవన్ కింద పురాతన సొరంగం...

  మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ కింద సొరంగాన్ని గుర్తించారు. రాజ్‌భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని కొందరు పెద్ద వారు ఇచ్చిన సమాచారం మేరకు గవర్నర్ విద్యాసాగర్‌రావు దీనిని గుర్తించారు. ఈ క్రమంలో ఆయన కాసేపు పురాతత్వ శాస్త్రవేత్త అవతారమెత్తారు. రాజ్‌భవన్‌లో బంకర్ ఉన్న చోటుకి స్వయంగా వెళ్లి..సిబ్బందితో దాన్ని వెలికి తీయించారు. లోపలికి వెళ్లకుండా గోడ అడ్డువుండటంతో ..దానిని పగలకొట్టించారు. 150 మీటర్ల పొడవు..3 మీటర్ల వెడల్పుతో బ్రిటీష్ కాలం నాటి బంకర్ బయటపడింది. దీనికి రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి. దీంతోపాటు దీనికి ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ, లోపలికి వెళుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి తూర్పువైపు ఉన్న ద్వారాన్ని మూసి పశ్చిమ ద్వారం తెరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని మూసివేసినప్పటికి దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యం. దీనిలో షెల్ స్టోర్, గన్ షెల్, క్యాట్రిడ్జ్ షోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్‌షాప్ మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గవర్నర్ విద్యాసాగర్‌రావు బంకర్‌ను సందర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రత్యేక పురావస్తు అధికారులకు చెప్పి దాని సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. 

ఎస్ఐ ఆత్మహత్య.. వేధింపులు భరించలేకే..

ఈమధ్య కాలంలో పోలీసు ఉన్నతాధికారులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎక్కువగా వింటున్నాం. మరి పై అధికారుల ఒత్తిడి వల్లనో.. లేక వ్యక్తిగత కారణాలవల్లనో తెలీదు కానీ ఇప్పటివరకూ చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ రామకృష్ణా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా, కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి నిన్న రాత్రి పోలీస్ క్వార్టర్స్ లోనే తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అక్కడ పోలీసులకి ఓ సూసైడ్ నోట్ లభించినట్టు తెలుస్తోంది. అందులో ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఓ సీఐ, ఓ డీఎస్పీ తనని వసూళ్ల కోసం వేధించారని తెలిపారు.   మరోవైపు ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. రామకృష్ణకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతని స్వగ్రామం నల్లగొండ జిల్లాలోని మఠంపల్లిలోని బక్కమంత్రగూడెం. ఎస్ ఐ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారుల వేధింపులపై దర్యాప్తు సాగుతోంది.

డిప్యూటీ కలెక్టర్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ప్రజాప్రతినిధులకు ఒక విలువ ఉంది. ప్రజలు వాళ్లకెంత గౌరవాన్ని ఇస్తారో ప్రభుత్వాధికారులకు అంతే గౌరవాన్ని ఇస్తారు. అయితే చాలామంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులపై చేయి చేసుకున్న ఘటనలు భారత రాజకీయ చరిత్రలో కోకొల్లలు. తాజాగా మహారాష్ట్రలో ఓ ప్రజాప్రతినిధి డిప్యూటీ కలెక్టర్‌పై చేయిచేసుకున్నాడు. ఓ ఆయిల్ పైప్‌లైన్ వేయడంతో భూమిని కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయమై డిప్యూటీ కలెక్టర్ అభయ్ కల్ గుద్కర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సురేశ్‌లాడ్ హాజరయ్యారు. అయితే భూమికి నష్టంగా భూమే కావాలంటూ రైతులు పట్టుబట్టడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే సురేశ్ లాడ్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు మరో అధికారిని చొక్కాలు పట్టుకుని చెంపలు వాయించాడు. అయితే ఈ ఘటనపై అధికారులిద్దరూ కిక్కురుమనలేదు..అంతేకాకుండా ఫిర్యాదు కూడా చేయలేదు.