టీఆర్ఎస్ లోకి పొన్నం.. కండీషన్స్ అప్లయ్..
posted on Aug 19, 2016 @ 4:56PM
తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి పలు పార్టీ నేతలు జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా.. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పొన్నం సోదరుడి కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి పొన్నం కూడా పాల్గొన్నారు. ఇంకేముంది పొన్నం పార్టీ మార్పుపై గుసగుసలు జోరందుకున్నాయి. అయితే వాస్తవానికి ఎంపీ సుఖేందర్‌రెడ్డితో పాటే పొన్నం పార్టీ మారతారని అందరూ అనుకున్నారు. అయితే అయితే ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బి.వినోద్‌కుమార్ అభిప్రాయం తీసుకున్నాకే పొన్నం చేరికకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని భావించడంతో పొన్నం టీఆర్ఎస్ ఎంట్రీ కాస్త లేట్ అయ్యింది.
అంతేకాదు ఇప్పటికే పొన్నం టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపారట. అయితే తాను పార్టీలోకి చేరడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తనకు కేటాయించాలని ఆయన కోరుతున్నారట. అయితే పొన్నం షరతుకు టీఆర్ఎస్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు పొన్నంను టీఆర్ఎస్ లోకి రప్పించడానికి.. కాంగ్రెస్ వీడి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన వివేక్ చాలా ప్రయత్నిస్తున్నాడట. మరి అన్నీ కుదిరితే పొన్నం ఎంట్రీ ఖాయం అయినట్టే.