సింధుకు అభినందనల వెల్లువ..
ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన తెలుగుతేజం పీవీసింధుకు దేశం జేజేలు పలుకుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సింధు ప్రదర్శన అద్భుతం. ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిపెట్టిన సింధుకు హృదయపూర్వక అభినందనలు. నీ ప్రదర్శన భారత్‌కు గర్వకారణం.
-రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సింధుకు అభినందనలు,నువ్వు అద్భుతంగా పోరాడావ్, అలాంటి నీ చరిత్రాత్మక ప్రదర్శన కలకాలం నిలిచిపోతుంది.
-ప్రధాని నరేంద్రమోడీ
సింధు పోరాటం భారతీయులకు స్పూర్తి. స్వర్ణం కోసం పోరాడిన సింధు తెలుగుజాతికే గర్వకారణమన్నారు. సింధు ప్రదర్శన దేశానికి కొండంత బలాన్నిచ్చిందని, ఇలాంటి క్రీడారత్నాన్ని అందించిన కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నా.
- ఎన్.చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అద్భుతమైన ఆటను కనబరిచిన సింధుకు అభినందనలు. భారతదేశం తరపున ఒలింపిక్స్‌లో రజతం గెలిచి దేశానికే గర్వకారణంగా నిలిచిన సింధు..తెలంగాణకు గొప్ప ప్రతిష్టను తీసుకొచ్చారు.
-కే.చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి