కుక్కలను చంపి ఊరేగించిన కేరళ కాంగ్రెస్..

చెన్నైకి చెందిన కొందరు మెడికల్ విద్యార్థులు నోరు లేని జీవం అని కూడా లేకుండా కుక్కను నానా హింసలు పెట్టి దానిని వీడియోగా చిత్రీకరించిన వైనంపై దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. అలాంటిది ఏకంగా కుక్కులను చంపి వాటిని కర్రకు తలక్రిందులుగా వేలాడదీసి నిరసన ప్రదర్శన నిర్వహించింది కేరళ కాంగ్రెస్. అసలు మ్యాటరేంటంటే కేరళ రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేరళ యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇందుకు కొట్టాయం జిల్లాలో కొన్ని కుక్కలను చంపి..వాటి మృతదేహాలను కట్టెకు వేలాడదీసి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కనీసం ఖననం కూడా చేయకుండా అలాగే నడిరోడ్డు మీద వదిలేశారు. ఈ కుక్కలను మేమే చంపేశాం..కుక్కల బెడదను నివారించకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా కొనసాగుతాయంటూ హెచ్చరించారు. అయితే ఇంత జరిగినా అటు పోలీసులు కానీ, ఇటు ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ జంతు ప్రేమికులు మాత్రం ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిజ్జా బాక్స్‌లో 5 వేల డాలర్లు..!

డబ్బంటే ఎవరికి చేదు..మనలో చాలా మందికి ఎప్పు డో ఒకప్పుడు రోడ్డు మీద పర్సు కాని, చిల్లర కాని దొరికే ఉంటుంది. కాని ఎంతమంది వాటిని తిరిగి ఇచ్చుంటారు. కాని పరాయి సొమ్ము పాములాంటిదని నమ్మేవారు కూడా ఉంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సెలీనా ఇలాంటి కోవకే చెందుతారు. ఈవిడకు ఒక రోజు చికెన్ పిజ్జా తినాలనిపించింది...వెంటనే డొమినో పిజ్జాకు ఫోన్ చేసి ఆర్డర్ చేసింది. ఫోన్ పెట్టిన వెంటనే డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. డోర్ తీసి చూడగానే డెలివరీ బాయ్ కనిపించాడు. అతని వద్ద నుంచి పిజ్జా తీసుకుని..తిందామని బాక్స్ తెరిచి చూడగానే అవాక్కైంది. పిజ్జా ఉండాల్సిన ప్లేసులో నోట్ల కట్టలు కనిపించాయి. లెక్కించి చూడగా 5 వేల డాలర్లు ఉన్నట్లు తేలింది. అయితే అంత డబ్బు చూడగానే బీరువాలో దాచేయాలని అనుకోకుండా..వెంటనే పిజ్జా సెంటర్‌కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఆ షాపు యజమాని బ్యాంకు నుంచి డ్రా చేసుకుని పిజ్జా కేంద్రానికి వచ్చాడు. సరిగ్గా సెలీనాకు పిజ్జా పార్సెల్ చేస్తున్నపుడు పొరపాటున పిజ్జాకు బదులు డబ్బులు బాక్స్‌లో పెట్టేశాడు. ఈ విషయం తెలియక అలాగే డెలివరీ చేశారు. జరిగిన విషయం తెలుసుకున్న సెలీనా ఆ డబ్బును వారికి తిరిగి అప్పగించింది. ఆవిడ నిజాయితీకి ముగ్ధులైన పిజ్జా సెంటర్ యజమాని అందుకు బహుమానంగా ఏడాదిపాటు డొమినో పిజ్జా ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నారు.

ఉరీ దాడి.. సాక్ష్యాలను అందజేసిన విదేశాంగ శాఖ..

  కిస్థాన్ సరిహద్దులోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి చేసి 18 మంది భారత జవాన్లను అంతంచేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి భారత్-పాక్ ల మధ్య ఉన్న వైరం ఇంకా ముదిరింది. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థానే అని తెలిసినా.. దీనిపై పాకిస్థాన్ ను ప్రశ్నించినా మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తుంది. దాడికి పాల్పడిన ఆయుధాలు పాకిస్థాన్ నుండే వచ్చినవని ఆరోపించినా..దానికి పాక్ మాత్రం... ఆయుధాలు పాక్ నుండి వస్తే పాకిస్థానీయులే దాడి చేసినట్టా.. ఆయుధాలు పాకిస్థాన్ వైనంత మాత్రాన ఉగ్రవాదులు పాకిస్థాన్ వారనేందుకు సాక్ష్యాలేంటి? ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్.. పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ ను రాయబార కార్యాలయానికి పిలిపించుకుని, యూరీ ఘటనపై సాక్ష్యాలను అందజేశారు.  నలుగురు ఉగ్రవాదులు యూరీ సెక్టార్ పై దాడులు జరిపారని, వారికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన ఫైసల్ హుస్సేన్ అవాన్, యాసిర్ ఖుర్షీద్ లు గౌడ్లుగా వ్యవహరించారని, వారిద్దరూ తమ అదుపులో ఉన్నారని ఆయన తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉటుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

పడుకున్న సైనికులపై తోటి సైనికులే దాడి..

  సైనికులంటే ఒకరికొకరు తోడుగా ఉంటూ దేశంపై విరుచుకు పడే శత్రువులని మట్టుబెట్టడంలో ముందుంటారు. అలాంటిది ఆప్గనిస్థాన్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సైనికులపై తోటి సైనికులే దాడి చేసి చంపేనిస ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆఫ్గనిస్థాన్‌, కుందజ్ నగరంలో ఔట్‌పోస్ట్‌లోని ఇద్దరు సైనికులు పడుకుని ఉన్న 12 మంది సైనికులపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. అయితే వారికి తాలిబన్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. వారు ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయి తిరుగుబాటుదారులతో కలిసినట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. దీన్ని ‘ఇన్‌సైడర్‌ ఎటాక్‌’గా పేర్కొన్నారు.

సత్యేంద్ర జైన్ సమన్లపై కేజ్రీవాల్ ఆగ్రహం... కుట్రను బయటపెడతా

  సత్యేంద్ర జైన్ సమన్లపై కేజ్రీవాల్ ఆగ్రహం... కుట్రను బయటపెడతా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సత్యేంద్ర జైన్ అమాయకుడని.. ఆయనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు ఈరోజు ఉదయం తాను జైన్‌తో మాట్లాడానని, అన్ని పత్రాలు పరిశీలించానని, జైన్‌ అమాయకుడని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఒకవేళ జైన్‌ దోషి అయితే.. పదవి నుంచి తొలగించేవాళ్లమన్నారు. జైన్‌కు తమ మద్దతు ఉంటుందని.. ఆప్‌ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రను బయటపెడతానంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ‘పలువురు ఆప్‌ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతున్నారు, నాపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు, సీబీఐ దాడులు చేశారు.. ఎందుకిలా..’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఆప్‌ ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, అదేంటో శుక్రవారం దిల్లీ అసెంబ్లీలో వెల్లడిస్తానని ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు.

సింధు నదీ జలాల ఒప్పందంపై పాకిస్థాన్ లో అలజడి..

సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃస‌మీక్షించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పై పాకిస్థాన్ లో అలజడి రేగినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ అంశంపై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో తేల్చుకుంటామ‌ని పాక్ ప్ర‌ధానికి విదేశీ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు స‌ర్తాజ్ అజీజ్ మీడియాకు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. భార‌త్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అంత‌ర్జాతీయ చ‌ట్టం ప్ర‌కారం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని.. అందులోంచి భార‌త్ ఏక‌ప‌క్షంగా త‌ప్పుకునే అవ‌కాశం లేద‌ని అన్నారు. గ‌తంలో జ‌రిగిన కార్గిల్‌, సియాచిన్ యుద్ధాల స‌మ‌యాల్లోనూ ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉప‌సంహ‌రించుకోలేద‌ని ఆయ‌న అన్నారు.

కర్ణాటకకు సుప్రీం చీవాట్లు.. నీరు ఇవ్వాల్సిందే..

  కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి కర్ణాటకకు చీవాట్లు పెట్టింది. కావేరి నుండి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం నీటిని విడుదల చేయలేమని చెప్పింది. దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరుగగా.. నీటిని విడుదల చేయలేమని కర్ణాటక న్యాయవాది తమ వాదనను వినిపించారు. దీనికి గాను కోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? అని చీవాట్లు పెట్టింది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటకపై ఉందని, శాంతి భద్రతల అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ లోగా ఎంత నీరు తమిళనాడుకు చేరిందో తెలియజేయాలని సూచించింది. ఈలోగా రెండు రాష్ట్రాల మధ్యా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించాలని అటార్నీ జనరల్ కు సూచించింది. కాగా కావేరి నది జలాల విషయమై ఇరు రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మాజీ న్యాయమూర్తి సంచలన కామెంట్స్... పాక్, బీహార్ రెండూ తీసుకోండి..

ఒక్కోసారి కొంతమంది తమకు ఏది మాట్లాడాలని అనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. ఆఖరికి అందరి చేత తిట్లు తిట్టించుకుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో భారత్-పాక్ లు కొట్టుకుచస్తుంటే.. ఇప్పుడు దానికి ఆజ్యం పోసినట్టు ఉన్నాయి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు. కాశ్మీర్ తో పాటు బీహార్ ను కూడా మీరే తీసుకోండి అంటూ.. ప్యాకేజ్ డీల్ అంటూ కాస్త వ్యంగ్యంగానే ఫేస్ బుక్  లో పోస్ట్ చేశాడు.  ఇంకెముంది కట్జూ చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక రాజకీయ నేతలైతే ఏకంగా ఆయనను శిక్షించాల్సిందేన‌ని అంటున్నారు. ఇక బీహార్ బీజేపీ అధికార ప్ర‌తినిధి వినోద్ నారాయ‌న్ ఆయ‌న సంఘ విద్రోహ‌శ‌క్తుల‌తో చేతులు క‌లిపి దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని దెబ్బ‌తీస్తున్నార‌న్న దానిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని.. క‌ట్జూని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆఖరికి దిగొచ్చిన కట్జూ.. బీహారీలంటే తనకు గౌరవం ఉందని.. గౌత‌మ బుద్ధ‌, చంద్ర‌గుప్త మౌర్య‌, అశోక‌లాంటి గొప్ప వ్య‌క్తుల‌ను బీహార్ అందించింద‌ని అన్నారు. అక్కడితో ఆగకుండా తాను కేవలం జోక్ చేశానని.. ప్ర‌జ‌లు సెన్సాఫ్ హ్యూమ‌ర్‌ను పెంచుకోవాల‌ని, తాను ఇలాగే అన్ని సామాజిక వ‌ర్గాలపై జోకులేస్తాన‌ని చెప్పుకొచ్చారు.  

పాకిస్థాన్ ఉగ్రదేశం?.. ఒబామా ఆన్సర్ చేయాల్సిందే..

  పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అగ్ర రాజ్యాలు సైతం ఈ విషయంలో పాక్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఉగ్రదేశం అంటూ ప్రకటించాలని ఇప్పటికే హౌస్ సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్, మరో సభ్యుడు డానా రోహ్రాబకర్ లు అమెరికాలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియన్-అమెరికన్ సంఘం ఒకటి  వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా పాకిస్థాన్ ను ప్రకటించాలా? వద్దా? అన్న పిటిషన్ ఒకటి ఉంచింది. దీనిపై అమెరికా సర్కార్ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనల ప్రకారం 60 రోజుల్లోగా అమెరికా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకూ 1.10 లక్షల సంతకాలు వచ్చాయి.

పాక్ పై మరో ఎత్తు వేసిన మోడీ...

  యూరీ దాడి తరువాత భారత్ పాక్ ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది. ఇప్పటికే యూరీ దాడి తరువాత పాక్ పై అగ్ర దేశాలు అభ్యంతర వ్యాఖ్యలు చేయగా.. అంత‌ర్జాతీయ స‌మాజంలో పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యల వల్ల ఏకాకి అయింది. భార‌త్‌.. తాజాగా మరో ఎత్తు వేసింది. ఇప్పుడు సింధూ జలాన్ని ప్రయోగించనున్నారు ప్రధాని మోడీ. సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃస‌మీక్షించింది. అయితే నీటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా మ‌రిన్ని నీళ్లు వాడుకొని పాక్‌పై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తాజాగా గ‌తంలో పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ (అత్యంత అనుకూల దేశం) హోదాను పునఃస‌మీక్షించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు గురువారం సీనియ‌ర్ అధికారుల‌తో అత్యున్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాటుచేశారు. పాకిస్థాన్‌కు ఆ హోదా ఉంచాలా తీసేయాలా అన్న‌దానిపై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

కొడుకుతో సహా బీకే బన్సాల్ ఆత్మహత్య..

  కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సాల్, తన కుమారుడు సహా ఆత్మహత్య చేసుకున్నారు. బీకే బన్సాల్ ఓ ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో సోదాలు జరుపగా.. ఆయన ఇంట్లో రూ. 20 లక్షలు, 60 బ్యాంకు ఖాతాల్లో పెద్దమొత్తంలో నగదు, 20కి పైగా ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. దీనిలో భాగంగా.. ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే ఆయన జైలుకు వెళ్లిన రెండు రోజులకి ఆయన భార్య.. కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చిన ఆయన కూడా పరువు పోయిందన్న అవమానంతో సొంత ఇంట్లోనే ఆత్మహత్యచేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇది పెద్ద కలకలంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

600 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది..

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీని చేధించారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలోని డార్లింగ్‌నది తీరం వద్ద 2014లో ఓ ఆదిమవాసి అస్థిపంజరం లభించింది. అప్పటి నుండి దానిపై పరిశోధనలు చేసిన గ్రిఫ్‌ఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు.. ఆ అస్థిపంజరం 600 ఏండ్లకిందటిదని ప్రకటించారు. అంతేకాదు ఇంకా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. అస్థిపంజరంపై పరిశోధన చేసిన యూనివర్సిటీ వైద్యులు.. ఎత్తు 1.7 మీటర్లు, వయస్సు 25-35మధ్య ఉంటుందని..  మృతికి పదునైన ఆయుధంతో పొడవడమే కారణమని గుర్తించారు. అది కూడా లిల్-లిల్ వంటి పదునైన కర్ర ఆయుధమై ఉంటుందని అంచనాకు వచ్చారు. కాగా దానికి పరిశోధకులు కాకుట్జా అని పేరు పెట్టారు.

నయీంతో లింకులు.. టీఆర్ఎస్ నేత అరెస్ట్..

  గ్యాంగస్టర్ నయీం ఎన్ కౌంటర్ తరువాత.. నయీంతో పులు రాజకీయ నేతలకు పోలీసు అధికారులకు లింకులు ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క రాజకీయ నేత పేరు ప్రత్యక్షంగా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు తాజాగా నయీంతో లింకులు ఉన్న ఓ నేతను అరెస్ట్ చేశారు. తెలంగాణలో అధికార పార్టీలో ఉన్న తెరాస నేత బల్లె ఈశ్వరయ్య అరెస్ట్ అయ్యారు. బల్లె ఈశ్వరయ్య మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం తెరాస అధ్యక్షుడు. ఆయన నయీంకు అత్యంత సన్నిహితుడని, మహబూబ్ ‌నగర్ జిల్లాకు చెందిన నయీం వ్యవహారాలను అతనే చక్కబెట్టేవాడని.. నయీం చేసిన అక్రమ భూకబ్జాల్లోనూ బలవంతం వసూళ్లలోనూ అతను పాలు పంచుకునే వాడని (సిట్)  ప్రత్యేక దర్యాప్తు బృందం చెబుతుంది. ఈశ్వరయ్యను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించినట్లు, వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఇప్పటికి ఒక వికెట్ పడింది..మరి ఇంకా ఎంత మంది నేతలు అరెస్ట్ అవుతారో చూద్దాం..

ల్యాండ్ కబ్జాలో ఎంపీ గీతకు ఎదురుదెబ్బ..

  విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ గీతా తెలంగాణ ప్రభుత్వం తన భూమిని లాక్కున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో గీతకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ భూమిపై సర్వ హక్కులు భావన సహకార గృహ నిర్మాణ సొసైటీకే ఉన్నాయని సొసైటీ అధ్యక్షుడు పివిసి దాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మిప్రసాద్, సభ్యులు జె. శ్రీనివాస్‌లు అన్నారు. ఈ భూమిపై ఎంపి కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఎలాంటి హక్కులు లేవని.. ఎంపి గీత భర్త నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్ర చేశారని..  గీత భర్త ఎనిమిది కొత్త ప్రైవేటు లిమిటేడ్ సొసైటీలను సృష్టించి ఆ సొసైటీల్లో ఆయనే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 2008-9లో 64 ఎకరాల భూమిని ఎనిమిది సొసైటీలకు బదిలీ అయినట్లుగా నకిలీపత్రాలు సృష్టించారని అన్నారు. ఆ నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో ఈ భూమిని తాకట్టు పెట్టి రూ.42.72కోట్లు రుణంగా తీసుకున్నారని కూడా చెప్పారు. బ్యాంకు అధికారుల తనిఖీలలో ఆ పత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో సిఐడి పోలీసులు 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు గుర్తు చేశారు.

ట్రంప్, హిల్లరీ మధ్య తొలి డిబేట్.. వాడివేడి చర్చ

  డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లు అమెరికా అధ్యక్షబరిలో ఉన్న సంగతి తెలిసిందే. మామూలుగానే.. వీరిద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. అలాంటిది ఏకంగా ఒకే వేదికపై.. ఇద్దరికీ డిబెట్ పెడితే ఇంకెలా ఉంటుంది. న్యూయార్క్ లోని  హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో ఇద్దరి మధ్య మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రారంభమైంది. ఈ డిబేట్ లో ఒకరిమీద ఒకరు విమర్శనాస్త్రాలు విసురుకుంటున్నారు. ఈ సందర్భంగా హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ..  ఉద్యోగాల కల్పనకు దేశంలో ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. దృఢమైన, స్థిరమైన అభివృద్ధే తన లక్ష్యమని.. నిర్మాణరంగం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ఉద్యోగ వృద్ధి సాధించామన్నారు. తాను అధికారంలోకి వస్తే కార్పొరెట్ లొసుగులు తొలగిస్తానని హామీ ఇచ్చారు. సంపన్నులకు పన్ను తగ్గింపులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఐసిస్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు వివరించారు. సామాన్యులు, మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు.   ఇక డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఇతర దేశాలపైనా.. హిల్లరీపైన విరుచుకుపడ్డాడు. మెక్సికో, ఇండియా వంటి దేశాలు అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నాయన్నారు. కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాల్సిన అవసరముందని, అప్పుడే కొత్త సంస్థలు వస్తాయని అభిప్రాయపడ్డారు. హిల్లరీకి ఎలాంటి ప్రణాళిక లేదని తూర్పారబట్టారు. గత 30 ఏళ్లలో హిల్లరీ ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్‌పైనా పోరాటం చేయలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాలు ఉద్యోగాలను వెనక్కి తీసుకురాగలిగే సామర్థ్యం తనకు ఉందని, హిల్లరీకి లేదని తేల్చి చెప్పారు.

పాక్ పై మళ్లీ మాట మార్చిన చైనా..

  పాకిస్థాన్ పై అగ్రదేశాలు సైతం వ్యతిరేక భావం చూపించినా చైనా మాత్రం ఎప్పుడూ తన సపోర్టును ఇస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం పాకిస్థాన్ విషయంలో చైనా మాట మార్చింది. ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి గాను పాక్ లో చైనా రాయబారి యు బోరెన్ స్పందించి భారతదేశంతో కనుక యుద్దం వస్తే పాక్ కు చైనా అండగా ఉంటుందని చెప్పారు. అయితే బోరెన్ చేసిన  వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. యు బోరెన్ వ్యాఖ్యలపై తమకు సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. రెండు దేశాలు మాకు మిత్రదేశాలేనని..ఈ దేశాల విషయంలో తమ విధానం అత్యంత స్పష్టమని, విభేదాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని చెప్పారు. కశ్మీర్ సమస్య నేటిది కాదని గుర్తు చేసిన ఆయన, ఇరు దేశాలూ చర్చల ద్వారా, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చైనా, భారత దేశాల మధ్య కూడా సరిహద్దుల సమస్య ఉందని, ఈ విషయంలో తాము చర్చలకే ప్రాధాన్యతను ఇస్తున్నామని షువాంగ్ చెప్పారు. మరి చైనా మాట మార్పుపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

28 ఉద్యోగాలకు..13,535 దరఖాస్తులు

ఐదెంకెల జీతాలు వచ్చే ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నా..గవర్నమెంట్ జాబ్‌కు ఉన్న క్రేజే వేరు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్సై, వేలిముద్రల విభాగం ఎఎస్సై పోస్టులకు వచ్చిన దరఖాస్తులే ఈ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో చెబుతోంది. ఈ రెండు డిపార్ట్‌మెంటుల్లో ఖాళీగా ఉన్న 28 పోస్టులకు ఆగస్టు 24వ తేదీని ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అభ్యర్ధుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నిన్న సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆ సమయానికి మొత్తం 13,535 దరఖాస్తులందాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 483 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. దరఖాస్తు దారుల్లో 12,357 మంది పురుషులు కాగా, 1178 మంది మహిళలు.