కుక్కలను చంపి ఊరేగించిన కేరళ కాంగ్రెస్..
posted on Sep 27, 2016 @ 8:00PM
చెన్నైకి చెందిన కొందరు మెడికల్ విద్యార్థులు నోరు లేని జీవం అని కూడా లేకుండా కుక్కను నానా హింసలు పెట్టి దానిని వీడియోగా చిత్రీకరించిన వైనంపై దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. అలాంటిది ఏకంగా కుక్కులను చంపి వాటిని కర్రకు తలక్రిందులుగా వేలాడదీసి నిరసన ప్రదర్శన నిర్వహించింది కేరళ కాంగ్రెస్. అసలు మ్యాటరేంటంటే కేరళ రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు రోజు రోజుకీ పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేరళ యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇందుకు కొట్టాయం జిల్లాలో కొన్ని కుక్కలను చంపి..వాటి మృతదేహాలను కట్టెకు వేలాడదీసి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కనీసం ఖననం కూడా చేయకుండా అలాగే నడిరోడ్డు మీద వదిలేశారు. ఈ కుక్కలను మేమే చంపేశాం..కుక్కల బెడదను నివారించకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా కొనసాగుతాయంటూ హెచ్చరించారు. అయితే ఇంత జరిగినా అటు పోలీసులు కానీ, ఇటు ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ జంతు ప్రేమికులు మాత్రం ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.