ల్యాండ్ కబ్జాలో ఎంపీ గీతకు ఎదురుదెబ్బ..
posted on Sep 27, 2016 @ 11:11AM
విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ గీతా తెలంగాణ ప్రభుత్వం తన భూమిని లాక్కున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో గీతకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ భూమిపై సర్వ హక్కులు భావన సహకార గృహ నిర్మాణ సొసైటీకే ఉన్నాయని సొసైటీ అధ్యక్షుడు పివిసి దాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మిప్రసాద్, సభ్యులు జె. శ్రీనివాస్‌లు అన్నారు. ఈ భూమిపై ఎంపి కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఎలాంటి హక్కులు లేవని.. ఎంపి గీత భర్త నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్ర చేశారని.. గీత భర్త ఎనిమిది కొత్త ప్రైవేటు లిమిటేడ్ సొసైటీలను సృష్టించి ఆ సొసైటీల్లో ఆయనే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 2008-9లో 64 ఎకరాల భూమిని ఎనిమిది సొసైటీలకు బదిలీ అయినట్లుగా నకిలీపత్రాలు సృష్టించారని అన్నారు. ఆ నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో ఈ భూమిని తాకట్టు పెట్టి రూ.42.72కోట్లు రుణంగా తీసుకున్నారని కూడా చెప్పారు. బ్యాంకు అధికారుల తనిఖీలలో ఆ పత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో సిఐడి పోలీసులు 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు గుర్తు చేశారు.