కర్ణాటకకు సుప్రీం చీవాట్లు.. నీరు ఇవ్వాల్సిందే..
posted on Sep 27, 2016 @ 4:05PM
కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి కర్ణాటకకు చీవాట్లు పెట్టింది. కావేరి నుండి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం నీటిని విడుదల చేయలేమని చెప్పింది. దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరుగగా.. నీటిని విడుదల చేయలేమని కర్ణాటక న్యాయవాది తమ వాదనను వినిపించారు. దీనికి గాను కోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? అని చీవాట్లు పెట్టింది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటకపై ఉందని, శాంతి భద్రతల అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ లోగా ఎంత నీరు తమిళనాడుకు చేరిందో తెలియజేయాలని సూచించింది. ఈలోగా రెండు రాష్ట్రాల మధ్యా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించాలని అటార్నీ జనరల్ కు సూచించింది. కాగా కావేరి నది జలాల విషయమై ఇరు రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.