కష్టాల్లో టీమిండియా... వరుసగా వికెట్లు

  భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే కష్టాలు మెుదలయ్యాయి. కివీస్ బౌలింగ్ ను అంచనా వేయలేక టీమిండియా వికెట్లు సమర్పించుకుంటుంది. జట్టు స్కోరు ఒక పరుగు వద్దే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (1) హెన్రీ విసిరిన బంతిని వికెట్లపైకి ఆడుకుని క్లీన్‌ బౌల్డవగా.. అతని బౌలింగ్‌లోనే మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ (9) కూడా కీపర్‌ వాట్లింగ్‌కు సునాయాస క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లి కూడా మరోసారి విఫలమయ్యాడు. లంచ్ సమయానికి టీమ్ మిస్టర్ డిపెండబుల్స్ పుజారా (31), రహానే (2) క్రీజులో ఉన్నారు. కాగా లంచ్ సమయానికి 3 వికెట్లకు 57 పరుగులు చేసింది.

మోడీ స్వచ్ఛ భారత్ పురస్కారాల ప్రధానం..

  స్వచ్ఛ భారత్ వార్షికోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ పురస్కారాలు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మోడీతోపాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ ను ప్రజలే విజయవంతం చేశారు..ఎన్నికల గురించి ఆలోచించే పార్టీలు.. స్వచ్ఛ భారత్ ను చేపట్టడం నామోషీగా భావిస్తున్నారు అని అన్నారు. స్వచ్ఛభారత్ ఉపయోగాలు మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది.. బంధువులు ఇంటికి వస్తే ముస్తాబు చేసే మన ప్రజలు.. ఊరిలోని పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.. తమ వస్తువులను శ్రద్దగా చూసుకునే జనం.. పదిమంది ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచడంలేదు అని ఆరోపించారు.

వెయ్యి గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు..

  భారత్-పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దుల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ నుండి ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని.. సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. అయితే ఈరోజు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం వెయ్యి గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించింది. పంజాబ్‌లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఖాళీ చేయించిన‌ట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తోన్న‌ భార‌త సైనికులు అక్క‌డి పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో సైనిక‌ శిబిరాల ఏర్పాటు చేసుకుంటున్నారు. పంజాబ్ లో గురుద్వార‌లోనూ సైనికులు శిబిరాలు ఏర్పాటయ్యాయి. స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ప్ర‌క‌టించిన హై అల‌ర్ట్ కొన‌సాగుతోంది.

భారత్-న్యూజిలాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం..

  భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. కోల్ కతాలోని ప్రారంభమైన ఈమ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందు బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియానే గెలుపు సాధించే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కోల్కతాలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్కు న‍్యూజిలాండ్ కెప్టెన్, టాప్ బ్యాట్స్మన్ విలియమ్సన్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయిన కివీస్కు.. విలియమ్సన్ కూడా దూరమవడం పెద్ద సమస్యే. మ్యాచ్ సమయానికి విలియమ్సన్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశించినా నిరాశే ఎదురైంది. కోల్కతా టెస్టుకు న్యూజిలాండ్ కెప్టెన్గా రాస్ టేలర్ను నియమించారు. కాగా కాన్పూర్లో జరిగిన భారత్-న్యూడిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియానే విజయం సాధించింది. 1-0తో ఇండియా ముందంజలో నిలిచింది.

యుద్ధం వస్తే భారత్ దే గెలుపు... తెల్చి చెప్పిన అమెరికా

  ప్రస్తుతం భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ చేసిన ఉరి దాడికి ప్రతీకారంగా మన దేశం పాక్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు జరిపి నలభైమంది ముష్కరులను మట్టుబెట్టింది. దీంతో పాక్ కూడా భారత్ పై దాడులకి దిగడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ కూడా యుద్దానికి సై అంటుంది. అయితే ఇప్పుడు అది మరింత ఉద్రిక్తంగా మారితే గెలుపెవరిది... ఈప్రశ్నకు అమెరికా వర్గాలు సమాధానం చెబుతున్నాయి. ఒకవేళ యుద్దం తీవ్రతరంగా మారితే రెండు దేశాల మధ్య ఉన్న సైన్యం, ఆయుధాలు బట్టి చూస్తే భారత్ దే గెలుపు అని చెబుతున్నారు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ అధికారులు. వారి తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరెవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.. * భారత్ వద్ద 13,25,000 మందితో బలమైన సైన్యం ఉండగా, దాయాది పాకిస్థాన్ సైన్యం 6.20 లక్షలు మాత్రమే ఉంది. * భారత్ రిజర్వ్ సైన్యం 21.43లక్షలు కాగా పాకిస్థాన్‌ది 5.15 లక్షలు. * యుద్ధ విమానాలు భారత్ వద్ద 2,086 ఉండగా పాకిస్థాన్ వద్ద అవి 923 మాత్రమే ఉన్నాయి. * హెలికాప్టర్లు భారత్ వద్ద 646 ఉండగా పాక్ వద్ద కేవలం 306 మాత్రమే ఉన్నాయి. * అటాక్ హెలికాప్టర్ల విషయంలో మాత్రం మనకంటే పాకిస్థాన్ మరింత మెరుగ్గా ఉంది. ఇవి భారత్ వద్ద 19 మాత్రమే ఉండగా దాయాది వద్ద 52 ఉన్నాయి. * అటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌ల విషయంలో మాత్రం మనదే పైచేయి. మన వద్ద 809 ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద 394 మాత్రమే ఉన్నాయి. * ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు భారత్ వద్ద 679, పాక్ వద్ద 304 ఉన్నాయి. * ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లు మనవద్ద 857 ఉండగా శత్రుదేశం వద్ద 261 ఉన్నాయి. * యుద్ధ ట్యాంకుల విషయంలోనూ దాయాది కంటే మనదే పైచేయి. మనవద్ద అవి 6,464 ఉండగా పాక్ వద్ద 2,924 మాత్రమే ఉన్నాయి. * ఆర్మ్‌డ్ ఫైటింగ్ వాహనాలు భారత్ వద్ద 6,704, పాక్ వద్ద 2,828 ఉన్నాయి. * విమాన వాహక నౌకలు మనవద్ద రెండు ఉండగా పాక్ వద్ద అసలు లేవు. * మన వద్ద యుద్ధనౌకలు 295 ఉన్నాయి. పాక్ వద్ద 197 ఉన్నాయి. * జలాంతర్గాములు భారత్ వద్ద 14 ఉండగా పాకిస్థాన్ వద్ద 5 ఉన్నట్టు సీఐఏ గణాంకాలు చెబుతున్నాయి.

భారత్ దాడికి ఫ్యూజులు పోయిన పాక్.. తప్పుడు వార్తలతో కుట్ర..

  భారత్ సైన్యం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే భారత్ చేసిన ఈ చర్యకు ఏం చేయాలో తెలియని పాకిస్థాన్ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టింది. ఈ దాడిపైన స్పందించిన పాకిస్థాన్ అసలు భారత సైన్యం ఎలాంటి దాడి చేయాలేదని చెప్పుకొచ్చింది.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పనిలో పడింది. నియంత్రణ రేఖ వద్ద తాము 14 మంది భారత సైనికులను మట్టుబెట్టినట్టు పాక్ మీడియా గురువారం తప్పుడు వార్తలు ప్రచురించింది. అంతేకాదు చందుబాబులాల్ చౌహాన్(22) అనే భారతీయ సైనికుడిని దళాలు అదుపులోకి తీసుకున్నాయని రాశాయి. ఇక పాక్ తప్పుడు వార్తలపై స్పందించిన భారత్ వాటిని తీవ్రంగా ఖండించింది. అవి నిరాధార, అవాస్తవ కథనాలని పేర్కొంది. అయితే చందుబాబులాల్ నిర్బంధంపై పాక్ చేసిన ప్రకటనపై భారత ఆర్మీ స్పందించింది. బాబులాల్ పొరపాటున ఎల్‌వోసీ దాటి పాక్ భూభాగంలో ప్రవేశించారని, ఈ విషయాన్ని డీజీఎంవో పాకిస్థాన్‌కు తెలియజేశారని.. సంప్రదింపుల ద్వారా తిరిగి ఆయనను భారత్ రప్పిస్తామని తెలిపింది. మరి భారత్ దాడికి ప్యూజులు ఎగిరిపోయిన పాక్ ఇంకెన్ని తప్పుడు వార్తలు సృష్టిస్తుందో చూడాలి.

రియల్ ఎస్టేట్‌కు దిక్సూచి "విజయవాడ రియల్ ఎస్టేట్.నెట్"

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడంతో విజయవాడ,గుంటూరు ప్రాంతాల్లో భూముల క్రయ, విక్రయాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఎంతోమంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూములపై పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఎక్కడి నుంచో వచ్చే వారితో పాటు స్థానికులకు సమస్త సమాచారాన్ని అందించేందుకు ఎలాంటి సౌకర్యం లేదు. దీనిని గుర్తించిన "ప్రోపర్టీ సెంట్రల్" సంస్థ  "విజయవాడ రియల్ ఎస్టేట్.నెట్" పేరిట వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు వీరభద్రమ్ వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ పోర్టల్‌లో రిజస్టరైన వారందరి ప్రాపర్టీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అందువల్ల మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆ వివరాల ఆధారంగా నేరుగా ఖాతాదారులను సంప్రదించి కొనుగోలు/అమ్మకాలు చేయడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందం 24 గంటలు అమ్మకం దారులకు. కొనుగోలుదారులకు తమ సహాయ, సహకారాలు అందిస్తుంది. అంతేకాదు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన వారందరి ప్రాపర్టీని ఒక వారం రోజుల పాటు ఉచితంగా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇంకేందుకు ఆలస్యం బెజవాడ పరిసర ప్రాంతాల్లో భూమలు అమ్మాలన్నా, కొనాలన్నా వెంటనే విజయవాడ రియల్ ఎస్టేట్.నెట్‌లో లాగిన్ అయిపోండి.

కావేరి జల వివాదంపై ఉమాభారతి...సరిహద్దుల్లో నిరాహారదీక్ష చేస్తా..

కావేరి జల వివాదంవల్ల అటు కర్ణాటకలోనూ.. ఇటు తమిళనాడులోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి ఈ వివాదం ముదురుతుందే తప్ప.. పరిష్కారం మాత్రం దొరకట్లేదు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కావేరి జల వివాదంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమైన ఆమె కావేరి జలాల సమస్య పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంకా కావేరి నదీ జలాల లభ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కర్ణాటకను తమ మంత్రిత్వశాఖ కోరిందని.. సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చొరవ చూపుతున్నాయని, ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఆమె తెలిపారు. అంతేకాదు కావేరి జలాల విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే.. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో తాను నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు. కాగా తమిళనాడుకు తాజాగా కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం.. ఆ తీర్పును ధిక్కరిస్తూ కర్ణాటక జలాలు విడుదల చేయకపోవడం తెలిసిందే.

సర్జికల్ దాడులకు అఖిలపక్షం మద్దతు..

  సర్జికల్ దాడుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అఖిపక్ష సమావేశం ముగిసింది. భారత్ ఆర్మీ పాక్ పై చేసిన దాడుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పక్షాల మద్దతు లభించింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు ఆర్మీకి అభినందనలు తెలిపారు. ఈ చర్చలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అమిషా, సీతారాం ఏచూరి, శరద్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పలువరు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇంకా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి మద్దతు తెలిపాయి.. ఉగ్రవాదులు కుప్వారా నుండి ఐదుచోట్ల దాడులకు పాల్పడ్డారు.. ఆర్మీ మెరుపు దాడులు జరిపిందని తెలిపారు. ఉగ్రవాదుల దాడులను భారత్ సహించదు అని అన్నారు.

సర్జికల్ దాడులు ఎలా జరిగాయంటే..?

  భారత్ ఆర్మీ పాక్ సరిహద్దుల్లో సర్జికల్ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత రాత్రి పాకిస్థాన్ భూభాగంలోకి దాదాపు 3 కిలోమీటర్లు చొచ్చుకొని వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ప్రకటనతో అసలు విషయం తెలిసింది. అంతేకాదు ఈ దాడుల గురించి పాక్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ కు కూడా తెలుసని ప్రకటించారు. అయితే ఇంత జాగ్రత్తగా దాడులు ఎలా నిర్వహించారంటే..   ఉరీ దాడి జరిగిన తరువాత సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసిన సైన్యం సరిహద్దుల్లోని తీవ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పేందుకు  ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సన్నాహాలు చేసుకుంటున్నాయని సమాచారం అందగానే వెంటనే అప్రమత్తమైన భారత్ ఆర్మీ దళం.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పాక్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లారు. వివిధ సెక్టార్లలోని 6 నుంచి 8 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పారా కమాండోస్ ను వినియోగించారు.  ఆయా ప్రదేశాల్లోకి వీరిని హెలికాప్టర్ల ద్వారా దించారు. మొత్తం 7 ఉగ్రవాద క్యాంపుల్లో చేసిన దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. 9మంది పాక్ జవాన్లు మృతి చెందారు. కేవలం 48 నిమిషాల్లో మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టి.. అంతే వేగంగా వెనక్కి వచ్చేశారు. ఏం జరుగుతోందని పాక్ తెలుసుకునేలోపు భారత సేనలు ఆపరేషన్ ముగించి స్వదేశం చేరడం విశేషం. దీంతో భారత్ లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, పాక్ లో మాత్రం తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు మా దేశంపై సర్జికల్ దాడులు జరగలేదని కూడా బొంకుతుంది. మరి దీనికి భారత్ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

కేసీఆర్ కు రాజ్ నాథ్ సింగ్ ఫోన్.. పాక్ దాడులపై మాట్లాడటానికి..

  కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు ప్రారంభించిన నేపథ్యంలో  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.  ఈ సమావేశంలో పాల్గొనాలని ఆయ‌న ముఖ్య‌మంత్రుల‌కు సూచిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా రాజ్‌నాథ్ సింగ్ కొద్ది సేప‌టి క్రితం ఫోన్‌ చేశారు. ఇంకా అఖిలపక్ష భేటీకి రావాలని సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్‌ సహా విపక్ష నాయకులందరికీ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమాచారం ఇచ్చారు. భారత సైనిక చర్యపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

భారత సైన్యం దాడులు.. కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్

  పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత రాత్రి నుండి పాక్ సరిహద్దుల్లో సర్జికల్ దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని..కశ్మీర్ లోని ఎయిర్ పోర్టులు, వైమానిక స్థావరాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రత పెంచారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేసి భారీగా రక్షణ బలగాలను మొహరించారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ గ్రామాలను బీఎస్ఎఫ్ ఖాళీ చేయిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

పాక్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. 500 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

  పాకిస్థాన్ వైపు నుంచి నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఉగ్ర‌వాదులు ప‌దేప‌దే చొర‌బాట్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఇటీవ‌లే సుమారు 20 చొర‌బాట్ల‌ను అడ్డుకున్న‌ట్లు డైరక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రణ్‌వీర్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. చొర‌బాట్లు పెద్ద స‌మ‌స్య‌గా మార‌య‌న్నారు. పీవోకే ప్రాంతంలో ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను అడ్డుకోవాల‌ని పాకిస్థాన్‌కు ఎన్ని సార్లు విన్న‌వించుకున్నా, ఆ దేశం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలిపారు. పీవోకే ప్రాంతంలో ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను అడ్డుకోవాల‌ని పాకిస్థాన్‌కు ఎన్ని సార్లు విన్న‌వించుకున్నా, ఆ దేశం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. టెర్ర‌ర్ స్థావ‌రాల‌పై జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడుల వ‌ల్ల ఉగ్ర‌వాదుల‌కు న‌ష్టం జ‌రిగింద‌న్నారు. భార‌త్ భూభాగంలోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నించిన ఉగ్ర‌వాదుల‌ను అడ్డుకునేందుకే స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేసిన‌ట్లు ఆర్మీ డీజీఎంవో తెలిపారు. కాగా స‌ర్జిక‌ల్ దాడుల‌పై ఆర్మీ డీజీఎంవో ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని క్ష‌ణాల‌కే సెన్సెక్స్ సుమారు 500 పాయింట్లు కోల్పోయింది.

వేట మొదలైంది..

పాకిస్థాన్ ఉరీ దాడిపై ఆగ్రహంతో ఉన్న భారత్.. ఈరోజు క్యాబినెట్ క‌మిటీ స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భ‌ద్ర‌తా అంశంపై క్యాబినెట్ క‌మిటీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆ సమావేశంలో పాక్ చేస్తున్న కాల్పుల ఉల్లంఘ‌న‌పై చర్చించినట్టు తెలుస్తోంది. ఈసందర్భంగా డైరక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ ఆర్మీ బుధవారం రాత్రి నియంత్రణ రేఖ వద్ద సర్జికల్ దాడులు నిర్వహించిందని తెలిపారు. పాకిస్థాన్ నుండి ఉగ్రచొరబాట్లు పదే పదే జరుగుతున్నాయని... వారిని నియంత్రించేందుకు నియంత్రణ రేశ వద్ద ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించామని.. ఈ విష‌యాన్ని పాకిస్థాన్ ఆర్మీ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌కు కూడా తెలియ‌జేసిన‌ట్లు చెప్పారు. నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాదులు భారత్ లోకి రాకుండా అడ్డుకుంటాం...పాక్ వైపు నుండి 20 చొరబాట్లను అడ్డుకున్నాం..పాక్ కుట్రలను తిప్పికొడతాం అని అని వెల్లడించారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వ‌రాజ్‌, మ‌నోహ‌ర్ పారిక‌ర్‌, జాతీయ భ‌ద్ర‌త స‌ల‌హాదారుడు అజిత్ ధోవ‌ల్ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

పాక్ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందంపై సమావేశం..

  పాకిస్థాన్ త‌న దుస్సాహ‌స‌ చ‌ర్య‌ల‌ను ఆప‌కుండా మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన అంశంపై భార‌త్ సీరియ‌స్‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ ఉప‌సంఘంతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీజీఎంవో మాట్లాడుతూ.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.. నిన్న రాత్రి కూడా ఉగ్రదాడులను తిప్పికొట్టాం.. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యల్ని అడ్డుకుంటున్నామని అన్నారు. పాక్ వైపు నుండి 20 చొరబాట్లను అడ్డుకున్నాం.. ఈ అంశాలన్నీ పాక్ సైనిక దళాల డైరెక్టర్ జనరల్ కు వివరించాం.. పాక్ ఆర్మీ మాతో సహకరిస్తుందని ఆశించాం అని తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ, రక్షణ హోంశాఖ శాఖలు మంత్రులు పాల్గొన్నారు.

కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ.. కేసులకు భయపడేది లేదు

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆయన ఈరోజు కోర్టులో హాజరయ్యారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కిసాన్‌ యాత్రలో ఉన్న రాహుల్‌.. పరువునష్టం కేసు విచారణలో భాగంగా గువాహటి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ కేసులకు భయపడేది లేదు.. సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ ను తాను ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటానని అన్నారు. కాగా మహాత్మాగాంధీని చంపింది ఆర్ఎస్ఎస్సే నంటూ గతంలో రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మండిపడ్డ సదరు సంస్థ గోహటి కోర్టులో పరువు నష్టం దావా వేసింది.

కేజ్రీవాల్ పై నెటిజన్ల సెటైర్లు.. అసలు బుర్ర ఉందా..?

  సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉండే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే ఉరీ దాడిపై ఒకపక్క భారత్-పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇక పాక్ చేసిన పనికి భారత్ ఆగ్రహంతో ఊగిపోతుంది. ఇక పాక్ పై అగ్రదేశాలు సైతం మండిపడుతుండటంతో ఏకాకి అయిపోయింది. అయితే దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. యూరీ దాడి విషయంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ కాకుండా ఇండియానే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తోందంటూ ఆయన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అంతే కేజ్రీవాల్ చేసిన ట్వీట్లపై స్పందించిన నెజిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై కామెంట్లు విసురుతున్నారు. సార్క్ సదస్సుకు ప్ర‌ధాని మోదీ హాజ‌రుకాక‌పోతే.. ఆయనకు బదులుగా కేజ్రీవాల్‌ని పాకిస్థాన్ ఆహ్వానించ‌వ‌చ్చు అని ఒకరు అంటే..  కేజ్రీవాల్‌కు అస‌లు బుర్ర ఉందా? అని ఒకరు..ఢిల్లీ అసలు సీఎంకి సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరు? అని ఇంకొకరు ఎవరికి తోచిన విధంగా వారు సెటైర్లు విసురుతున్నారు. మరి ఈ సెటైర్లకు కేజ్రీవాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.