మాజీ న్యాయమూర్తి సంచలన కామెంట్స్... పాక్, బీహార్ రెండూ తీసుకోండి..
posted on Sep 27, 2016 @ 3:19PM
ఒక్కోసారి కొంతమంది తమకు ఏది మాట్లాడాలని అనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. ఆఖరికి అందరి చేత తిట్లు తిట్టించుకుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో భారత్-పాక్ లు కొట్టుకుచస్తుంటే.. ఇప్పుడు దానికి ఆజ్యం పోసినట్టు ఉన్నాయి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు. కాశ్మీర్ తో పాటు బీహార్ ను కూడా మీరే తీసుకోండి అంటూ.. ప్యాకేజ్ డీల్ అంటూ కాస్త వ్యంగ్యంగానే ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇంకెముంది కట్జూ చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక రాజకీయ నేతలైతే ఏకంగా ఆయనను శిక్షించాల్సిందేనని అంటున్నారు. ఇక బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ నారాయన్ ఆయన సంఘ విద్రోహశక్తులతో చేతులు కలిపి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారన్న దానిపై విచారణ జరపాలని.. కట్జూని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆఖరికి దిగొచ్చిన కట్జూ.. బీహారీలంటే తనకు గౌరవం ఉందని.. గౌతమ బుద్ధ, చంద్రగుప్త మౌర్య, అశోకలాంటి గొప్ప వ్యక్తులను బీహార్ అందించిందని అన్నారు. అక్కడితో ఆగకుండా తాను కేవలం జోక్ చేశానని.. ప్రజలు సెన్సాఫ్ హ్యూమర్‌ను పెంచుకోవాలని, తాను ఇలాగే అన్ని సామాజిక వర్గాలపై జోకులేస్తానని చెప్పుకొచ్చారు.