మరోసారి మీడియాకు కేసీఆర్ వార్నింగ్..

అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మీడియాను అదుపులో పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియాను టార్గెట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలపై కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు ఒక్క వ్యక్తి కాని..ఒక్క జంతువు కాని మరణించలేదని..అయితే ఇక్కడి పరిస్థితిని ప్రసార మాధ్యమాలు అతిగా చూపి నగరానికి చెడ్డ పేరును తెస్తున్నాయన్నారు. రాజధానిలో అంతటి భయంకర పరిస్థితులేమీ లేవని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ..వాస్తవ పరిస్థితిని మాత్రమే మీడియా చూపాలని హితవు పలికారు. అతిగా చెప్పి, చూపి ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన కలిగించవద్దని సూచించారు.

బాణాసంచా కార్మాగారంలో పేలుడు..ఆరుగురు దుర్మరణం..

ఒడిశాలోని కటక్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి నగరంలోని బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.  ఒకరు ఘటనా స్థలిలోనే మరణించగా.. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఐదుగురు నిన్న మరణించారు. గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

పాక్, చైనాకు ధీటుగా.. యుద్ధ విమానాల ఒప్పందం..

  భారత్ కు పాకిస్థాన్, చైనా దేశాలు పక్కలో బల్లెంలా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాలను ధీటుగా ఎదుర్కోనేందుకు భారత్ సిద్దమైంది. ఫ్రాన్స్, భారత్ ల మధ్య గత కొన్నేళ్లుగా యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే అత్యాధునిక 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసింది. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి జీన్‌ వ్యేస్‌ లే డ్రియాన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మొత్తం రూ.59 వేల కోట్ల రూపాయలతో జరిగిన ఈ ఒప్పందలో ముందుగా భారత్ 15 శాతం మొత్తాన్ని ఫ్రాన్స్ కు చెల్లించనుంది. తుది ఒప్పందం జరిగిన తేది నుంచి 18 నెలల లోపు పూర్తిగా రాఫెల్‌ యుద్ధవిమానాలు భారత్‌కు అందనున్నాయి. 2019 నాటికి మొదటి రాఫెల్‌ విమానం భారత్‌ చేరుకోనున్నట్లు సమాచారం. కాగా రాఫెల్‌ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా సునాయసనంగా చేధించగలదు.

పాకిస్థాన్ కు యూరోపియన్ యూనియన్ వార్నింగ్..

  పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు పలు దేశాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక సార్లు పాకిస్థాన్ కు వార్నింగ్ లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ జాబితాలో యూరోపియన్ యూనియన్ కూడా చేరిపోయింది. బ‌లోచిస్తాన్‌లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ను నిలిపివేయ‌కుంటే పాక్‌పై ఆంక్ష‌లు విధించిన‌నున్న‌ట్లు యురోపియ‌న్ పార్ల‌మెంట్ ఉపాధ్య‌క్షుడు రిజ‌ర్డ్ జ‌ర్నెకి తెలిపారు.  జెనీవాలో పాక్ ఊత‌కోత చ‌ర్య‌ల వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన బ‌లోచిస్తాన్ స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధులకు ఆయ‌న నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో ఆర్థిక‌, రాజ‌కీయ‌ ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయ‌ని, ఒక వేళ ఆ దేశం బ‌లోచిస్తాన్ అంశంలో త‌న విధానాన్ని మార్చుకోకుంటే, అప్పుడు పాక్ ప‌ట్ల త‌మ విధానాన్ని మార్చుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. బ‌లూచీలో జ‌రుగుతున్న మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన పాక్ సైనిక అధికారుల‌ను అంత‌ర్జాతీయ కోర్టు ముందు దోషుల‌గా చేసి ఉరి తీయాల‌ని.. బ‌లోచిస్తాన్‌లో పాక్ చేస్తున్న అకృత్యాల‌ను ప్ర‌పంచం తెలుసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బుగ్తి అన్నారు.

వర్షాల వల్ల ఏపీ, తెలంగాణలో రైళ్లు రద్దు...

  తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల వల్ల ప్రజలు పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. మరోవైపు ఈ వర్షాల వల్ల ముఖ్యంగా ప్రయాణికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నడిచే 17 రైళ్లను రద్దు చేశారు. కాగా రద్దయిన, దారిమళ్లించిన వివరాలు ఇలా ఉన్నాయి. రద్దైన రైళ్ల వివరాలు * గుంటూరు -వికారాబాద్‌, వికారాబాద్‌-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ * గుంటూరు-మాచర్ల ప్యాసింజర్‌, మాచర్ల- భీమవరం ప్యాసింజర్‌, మాచర్ల-నడికుడి ప్యాసింజర్‌ * రేపల్లె-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- రేపల్లె డెల్టా పాస్ట్‌ ప్యాసింజర్‌ * నడికుడి-మాచర్ల ప్యాసింజర్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ * విజయవాడ-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ * పిడుగు రాళ్ల- మిర్యాలగూడ ప్యాసింజర్‌ దారిమళ్లించిన రైళ్లు * హైదరాబాద్‌-తిరువనంతపురం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి మీదుగా దారి మళ్లించారు. * కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌. * విజయవాడ-కాజిపేట మీదుగా గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ * విజయవాడ, కాజీపేట మీదుగా నర్సాపూర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ * తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రేణిగుంట, తెనాలి, విజయవాడ, కాజీపేట మీదుగా దారి మళ్లించారు. * విశాఖ-సికింద్రాబాద్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రాజమహేంద్రవరం, గుణదల, వరంగల్‌, కాజీపేట మీదుగా దారి మళ్లించారు. * హైదరాబాద్‌-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట, విజయవాడ,న్యూ గుంటూరు, తెనాలి మీదుగా దారి మళ్లించారు. * సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట, గుణదల మీదుగా దారి మళ్లించారు.

తొలి ఇన్నింగ్స్ కైవసం చేసుకున్న భారత్..

కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానంలో భారత్-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. న్యూజిలాండ్ జట్టు 95.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ అయింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 318 పరుగులు చేసింది అనంతరం నిన్న బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 152 పరుగుల చేసింది. అయితే ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ వరుసగా వికెట్లు సమర్పించి కేవలం 262 పరుగులకే ఔటయ్యారు. భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, జడేజాల దెబ్బకు న్యూజిలాండ్ ఆటగాళ్లు బేర్ మన్నారు. దీంతో భారత్ కు 56 పరుగుల లీడ్ లభించింది. మరికాసేపట్లో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుండగా, వరుణుడు అడ్డుకోకుంటే, ఈ మ్యాచ్ లో కూడా భారత్ విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

పోలీసుల అత్యుత్సాహం... చంద్రబాబు ఆగ్రహం..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న వేళ, జరుగుతున్న ర్యాలీలో పోలీసుల అత్యుత్సాహం చూపించి జర్నలిస్టులపై దౌర్జన్యం చేయడంతో పలు టీవీ చానళ్ల కెమెరామెన్లు కింద పడ్డారు. దీంతో జర్నలిస్టులు ఆగ్రహించి, చంద్రబాబు ర్యాలీని అడ్డుకుని ధర్నా నిర్వహించారు. టూర్ ను కవర్ చేసేది లేదని నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు అసలు విషయం తెలుసుకొని పోలీసులపై మండిపడ్డారు. అంతేకాదు చంద్రబాబే స్వయంగా జర్నలిస్టుల దగ్గరకు వెళ్లి..  మరోసారి ఇలా జరగకుండా చూస్తానని క్షమాపణలు చెప్పడంతో జర్నలిస్టులు శాంతించారు.

అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురు మృతి

  ఇటీవల అమెరికాలో తరచూ కాల్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. అమెరికా.. వాషింగ్టన్ సియాటిల్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న కాస్కేడ్‌ షాపింగ్‌మాల్‌లో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపునే దుండగుడు పారిపోయాడు. కాగా ఓ హిస్పానిక్ (ద‌క్షిణ అమెరికాకు చెందిన‌) వ్య‌క్తి కాల్పులు జ‌రిపి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు జయలలిత..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమెను మెరుగైన చికిత్స కోసం సింగ‌పూర్ త‌ర‌లించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. జ‌య‌ల‌లిత‌కు మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో మ‌రింత మెరుగైన చికిత్స అందించ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం. మరోవైపు జ‌య‌ల‌లిత అభిమానులు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు ఆమె తొందరగా కోలుకోవాలని కోరుతూ త‌మిళ‌నాడులోని పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా జయలలిత త్వ‌ర‌గా కోలుకోవాలని ఆమెకు బొకే పంపించారు.   అయితే ఈ వార్తలను ఆమె పార్టీ ఏఐఏడీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. ఏఐఏడీఎంకే నేత సీఆర్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రస్తుతం జయలలిత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆమె మెరుగైన చికిత్స కోసం సింగపూర్ వెళ్తోన్నారని వస్తోన్న వార్తలన్ని రూమర్లని కొట్టిపడేశారు.

ఇస్రో భారీ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం..

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించనున్నారు. 8 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లడానికి పీఎస్‌ఎల్‌వీ-సి35 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది. ఈరోజు 9:12గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ఎల్లుండి ఉద‌యం 9:12గంటలకు పూర్తవుతుంది. అంటే సెప్టెంబర్ 26న సోమవారం ఉదయం 9:12 నిమిషాలకు.. పీఎస్ఎల్‌వీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎనిమిది శాటిలైట్లను ప్రయోగించనున్నారు. ఈ ఎనిమిది శాటిలైట్లలో వాతావరణ అధ్యయన శాటిలైట్ ఎస్‌సీఏటీఎస్ఏటీ-1 తో పాటు రెండు దేశీయ శాటిలైట్లు, మరో ఐదు విదేశీ శాటిలైట్లు ప్రవేశపెట్టనున్నారు. అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు తయారు చేసిన 2 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి35 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

414 రోజులు ఐఎస్ఐఎస్‌ చెర‌లో ఉన్నాం...

గత ఏడాది క్రితం లిబియాలో ఉగ్రవాదులు తెలుగు ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల‌ను కొద్దిరోజుల క్రితం ఉగ్రవాదులు విడుదల చేయగా.. ఈరోజు భార‌త విదేశాంగ శాఖ అధికారులు ఇద్దరిని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ.. త‌న‌ కుటుంబాన్ని తిరిగి క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉందని.. తమకు సహాయం చేసినందుకు.. తమను ఉగ్రవాదుల చెరనుండి విడిపించినందకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. దాదాపు 414 రోజులు ఐఎస్ఐఎస్‌ చెర‌లో ఉన్నామ‌ని.. త‌మ‌ను కిడ్నాప్ చేసినప్ప‌టి నుంచి విడుద‌ల చేసే వ‌ర‌కు జ‌రిగిన పరిణామాల‌పై, అక్క‌డి ప‌రిస్థితుల‌పై స‌మాచారాన్నంతా భార‌త విదేశాంగ శాఖ‌కు తాము ఇచ్చామ‌ని తెలిపారు.

తమిళనాట 'అమ్మ ఉచిత వైఫై' సేవలు..

  బస్టాండుల్లో, మాల్స్ లో ఉచిత వైఫైలు అందించడం చూస్తూనే ఉన్నాం. పలు రాష్ట్రాలు యువతను ఆకర్షించేందుకు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయం తమిళనాడుకు కూడా చేరింది. ఇప్పటివరకూ ఎన్నో పథకాలు అందించిన తమిళ సర్కారు ఇప్పుడు యువతకు దగ్గరయ్యేందుకు మరో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే 'అమ్మ ఉచిత వైఫై' సేవలను అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పెద్ద బస్టాండ్లు, మాల్స్ లో 'అమ్మ ఉచిత వైఫై' సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది. మొదటి దశలో 50 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హైయ్యర్ సెకండరీ, కాలేజ్ విద్యాభ్యాసం చేస్తున్న వారికి కూడా ఉచిత ఇంటర్నెట్ ను అందించనున్నామని తెలిపింది. తొలిదశలో 50 పాఠశాలల్లో రూ. 10 కోట్ల వ్యయంతో వైఫై టవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది.

మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్..

  భారత్- న్యూజిలాండ్ ల మధ్య 500 వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడవ రోజు ప్రారంభమైన ఆటలో బ్యాటింగ్ లో ఉన్న న్యూజిలాండ్ మొదట కాస్త కట్టుదిట్టంగానే ఆడినా ప్రస్తుతం పేలవంగానే ఆడుతున్నట్టు కనిపిస్తోంది. రెండో రోజున ఒక వికెట్ నష్టానికి 152 పరుగులతో న్యూజిలాండ్ ఆట మొదలు పెట్టగా, స్కోర్ బోర్డుపై 20 పరుగులు చేరకుండానే మూడు వికెట్లను భారత బౌలర్లు తీశారు. 159 పరుగుల వద్ద లాథమ్ (58), 160 పరుగుల వద్ద టేలర్, 170 పరుగుల వద్ద విలియన్ సన్ అవుట్ అయ్యారు.ఈరోజు ప్రారంభమైన మ్యాచ్లో మొదటి నుండి భారత్ పట్టు బిగించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 172 పరుగులు కాగా, భారత తొలి ఇన్నింగ్స్ తో పోలిస్తే, ఆ జట్టు 146 పరుగులు వెనుకబడివుంది. కాగా తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 318 పరుగులు తీసిన సంగతి తెలిసిందే.

ఉరీ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం..

  పాకిస్థాన్ ఉరీ పై చేసిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ బాగానే ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఉరీ దాడి తరువాత భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్లిమరీ ఉగ్రవాదులను మట్టుబెడుతోంది. ఇప్పటి వరకూ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో అడుగుపెట్టిన బలగాలు కనీసం 20 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సైనికులతో కూడిన పారాచూట్ రెజిమెంట్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొని.. మూడు ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిలో 20 మంది ముష్కురులు ప్రాణాలు కోల్పోగా 180 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే కచ్చితంగా ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందారన్నది మాత్రం తెలియరాలేదు.   ఇదిలా ఉండగా మరోవైపు భారత్ కు పాక్ హెచ్చరికలు జారీ చేస్తుంది. భార‌త్‌లో ల‌క్ష్యాల‌ను ఎంచుకున్నామ‌ని, అటు నుంచి ఏ చిన్న దాడి జ‌రిగినా బ‌లంగా తిప్పికొడ‌తామ‌ని పాకిస్థాన్ హెచ్చ‌రించింది. ఇప్పటికే బ‌ల‌గాల‌ను మోహ‌రించామ‌ని, స‌మీప భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా పాకిస్థాన్ సైన్యం మాత్రం ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగానే ఉంటుంద‌ని ర‌క్ష‌ణ‌శాఖ వ‌ర్గాలు స్ప‌ష్టంచేశాయి. త‌మ సత్తా ఏంటో భార‌త్‌కు తెలుస‌ని కూడా పాక్ హెచ్చ‌రించింది. మరి ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.