జగన్ యువభేరి.. వెంకయ్యపై మండిపాటు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరులో యువభేరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన దుమ్మెత్తిపోశారు. హోదా విషయంలో బిజెపి, టిడిపిలు మోసాలు, అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం రెండేళ్లుగా పోరాటం సాగుతోందన్నారు. ప్రత్యేక హోదా సంజీవని అని ఆనాడు ఊదరగొట్టారు.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెబుతున్నారు.. వెంకయ్య ప్లేట్ ఫిరాయించారు.. అలాంటి హోదాకు పాతరేసిన వెంకయ్యకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు అంటూ మండిపడ్డారు. ఆనాడు హోదాపై ఎన్నో మాటలు మాట్లాడిన వెంకయ్యనాయుడు ఈరోజు మరోలా స్పందిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. మోదీ, వెంకయ్య అధికారం రాకముందుకు అలా ఎందుకు మాట్లాడారు? అధికారంలోకి వచ్చాక ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నామని.. అర్ధరాత్రి జైట్లీ ప్రకటనతో ఏపీకి ఒరిగేది లేదని అన్నారు.