పోలవరం ప్రాజెక్టుపై నాబార్డుతో ఒప్పందం..

  ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టుపై సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సుజనా చౌదరితో పాటు జలవనరుల, ఆర్ధిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై నాబార్డుతో ఒప్పందం కుదిరిందని... నాబార్డు రుణాన్ని కేంద్రమే చెల్లిస్తుందని.. నాబార్డు నేరుగా కేంద్రానికి నిధులు ఇస్తుందని అన్నారు.. అక్టోబర్ 15 నుండి నిధులు చెల్లించడానికి అంగీకారం తెలిపినట్టు చెప్పారు. మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు ఉన్నాయి.. ఇప్పుటి వరకూ ఖర్చు చేసిన నిధులను చెల్లించడానికి కేంద్రం సిద్దంగా ఉంది అని తెలిపారు.

పాక్ కు ధీటైన సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్న సుష్మ..

  ఐరాస సర్వసభ్య సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని భారత్ పై ప్రేలాపనలు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లో అల్లకల్లోలానికి భారత్ కారణమని ఆరోపిస్తూ, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వనీని పొగుడుతూ ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యాలు సైతం మండిపడ్డాయి. ఇప్పుడు దీనికి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధీటైన సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న ఆమె... ఆయన వాదనను ఖండిస్తూ, పాక్ చేస్తున్న కుట్రలను అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లి, పాక్ వైఖరిని ఎండగట్టేందుకు సుష్మా ప్రయత్నించనున్నారు. ఆమె ప్రసంగం నేటి రాత్రి 7:20 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొదలు కానుంది. దీనిలోభాగంగానే ఆమె ప్రసంగించాల్సిన అంశాలపై ఇప్పటికే మోదీతోను, రక్షణ, హోం శాఖల మంత్రులతోను ఆమె చర్చించారు. ముఖ్యంగా పాక్ ఎలా ఉగ్రవాదులకు సహకరిస్తున్నది, యుద్ధ నేరాలకు ఎలా పాల్పడుతున్నది అన్న దానిపై ప్రసంగించనున్నారు.

భారీ నష్టంలో స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో రిలయన్స్..

  ఓ వైపు సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతం కన్నా నష్టాల్లో సాగుతుంటే మరోవైపు రిలయన్స్ మాత్రం.. లాభల్లో సాగుతుంది. ప్రపంచంలోని టాప్ టెన్ చమురు కంపెనీల జాబితాలో భారత అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానంలో ఉండటం, రిలయన్స్ జియో లాంచింగ్ తరువాత ఇన్వెస్టర్లలో పెరిగిన సెంటిమెంట్ ఊతంగా ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతూ వస్తున్న సంస్థ ఈక్విటీ విలువ నేడు ఏకంగా ఏడేళ్ల గరిష్ఠానికి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 0.8 శాతం లాభం కాగా, ఒక దశలో ఈక్విటీ వాల్యూ రూ. 1,130 దాటింది. గడచిన 14 సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీల పయనంతో సంబంధం లేకుండా వరుసగా 10 సెషన్లలో రిలయన్స్ లాభాల్లో నడిచిన సంగతి తెలిసిందే.

భర్తను చంపి బైక్ పై 12 కిలోమీటర్లు రైడ్...

  సాధారణంగా భార్యలను భర్తలు హత్య చేసిన కేసుల గురించే వినుంటాం. కానీ ఇక్కడ ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఒకటికాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు బైక్ పై తీసుకెళ్లి ఆఖరికి పోలీసులకు చిక్కింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండెం ప్రవల్లిక (25) తన భర్త పుల్లయ్య తలను గోడకేసి బాది హత్య చేసి ఆపై తన మేనల్లుడు సాయంతో బైక్ పై పెట్టుకొని శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో బయలుదేరింది. అయితే ట్రిపుల్ డ్రైవింగ్ లో ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారు ఆపకుండా వెళ్లిపోయారు. ఇద్దరి మధ్య కూర్చున్న వ్యక్తి కాళ్లు నేలపై జారుతుండటం.. అతని తల యువకుడిపై వాలిపోయి ఉండటం గమనించిన పోలీసులు వారిని రెండుకిలోమీటర్లు పాటు వెంబడించి పట్టుకున్నారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. ప్రవల్లిక అసలు నిజం బయటపెట్టింది. అంతేకాదు ఆమెకు తన మేనల్లుడితో అక్రమ సంబంధముందని, అదే హత్యకు దారితీసిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఏకే 47 పేల్చి మోడీకి పాక్ చిన్నారి వార్నింగ్...

  మొన్నటి వరకూ కాశ్మీర్ అల్లర్లతో భారత్-పాకిస్థాన్ ల మధ్య గొడవ ముదరగా.. ఇప్పుడు ఉరీ పై ఉగ్రవాదులు దాడి నేపథ్యంలో ఆ గొడవ కాస్త ముదిరి పాకానా పడింది. రెండు దేశాల మధ్య మాటల యుద్దాలు మొదలయ్యాయి. ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. అయితే  ఇప్పుడు పాకిస్థాన్ ఓ అడుగు ముందుకేసినట్టు కనిపిస్తోంది. మామూలుగానే పాకిస్థాన్ చిన్నపిల్లల్లో కూడా భారత్ పై ద్వేషాన్ని పెంచుతుందన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అది నిజమే అన్న భావన కలుగుతుంది ఓ వీడియో చూస్తుంటే. ఆవీడియోలో ఓ చిన్నారి ఏకే-47 గన్ పట్టుకొని ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తుంది. అలా చెప్పిస్తున్నది కూడా తన తండ్రే. పట్టుమని ఐదేళ్లు కూడా లేని తన కూతురి చేత ఏకే-47 గన్ పట్టించి.. తుపాకీ పేలుస్తూ మోడీకి వార్నింగ్ ఇప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దగ్గరుండి కూతురికి గన్ ఎలా పేల్చాలో నేర్పిస్తున్న అతడెవరో తెలియరాలేదుగానీ, ఈ వీడియోను చూసిన భారతీయులు మాత్రం మండి పడుతున్నారు. మరి దీనిపై పాక్- భారత్ ల మధ్య వైరం ఇంకెంత పెరుగుతుందో చూడాలి.

ప్రతిష్టాత్మక 500 టెస్ట్ మ్యాచ్.. భారత్ విజయం..

ప్రతిష్టాత్మక 500 టెస్ట మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ పై 197 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. కాన్పూర్లోని గ్రీన్ పార్కులో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 87.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మైదానంలో కోహ్లీ సేన సంబరాలు చేసుకుంది. ఆటగాళ్లు ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. కాగా, ఇండియా ఆడిన 500 టెస్టుల్లో ఇది 130వ విజయం. భారత్ లో 88వ విజయం కాగా, న్యూజిలాండ్ పై 19వ విజయం.   కాగా మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 318 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 262 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్సింగ్స్ లో భారత్ 377 పరుగులు సాధించగా.. మొదటి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఓటమి పాలైంది. దీంతో 192 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

లెంపలేసుకున్న ఫేస్ బుక్.. పొరపాటున జరిగింది..

  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అప్పుడప్పుడు కొన్ని అకౌంట్లను డిజేబుల్ చేస్తుంటుంది. ఏదైనా అనైతిక చర్యలకు పాల్పడినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఇందుకు కాను ఫేస్ బుక్ లెంపలేసుకోవాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. పాలస్తీనాకు చెందిన పలువురు జర్నలిస్టులు, ఇతరుల అకౌంట్లను ఫేస్ బుక్ డిజేబుల్ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన పాలస్తీనా జర్నలిస్టులు తమ అకౌంట్లను డిలీట్ చేయడంతో ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ప్రచారం మొదలుపెట్టారు. ప్రతివారం తమ బృందం లక్షల కొద్దీ రిపోర్టులను ప్రతివారం ప్రాసెస్ చేస్తుందని, కొన్నిసార్లు పొరపాటు జరుగుతుందని.. ఈ తప్పునకు మాత్రం తాము చాలా బాధపడుతున్నామని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి అల్ అరబియా ఇంగ్లీష్ చానల్‌కు తెలిపారు. అసలు ఫేస్‌బుక్‌లో ఎవరూ ఏమీ పోస్ట్ చేయొద్దని కోరారు. ప్రభుత్వాలకు, ఫేస్‌బుక్ యంత్రాంగానికి మధ్య ఎలాంటి  ఒప్పందాలున్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక దిగొచ్చిన ఫేస్ బుక్ జరిగిన తప్పిదానిని లెంపలేసుకుంది. పొరపాటున ఆ పేజీలను తీసేశారని.. తమకు ఆ విషయం తెలియగానే వెంటనే వాటిని పునరుద్ధరించామని తెలిపింది.

డిసెంబర్ వరకూ నీరు పంపడం కుదరదు..

  కావేరి జల వివాదం రోజు రోజుకి ముదురుతుంది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో కర్ణాటక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు. ఈ నెల 27 నుండి కావేరి నది నుండి తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని చెప్పగా.. కావేరిలో తగినంత నీరు లేకపోవడం వల్ల నీటిని విడుదల చేసేది లేదని ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తేల్చి చెప్పేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. 6 వేల క్యూసెక్కుల నీటితో పాటు మరో 42 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించిన నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకు మరింత నీటిని విడుదల చేయడం కష్టమని.. ఈ వివాదంలో సుప్రీం కోర్టు తన తీర్పును మార్చుకోవాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. అదనంగా ఇవ్వాల్సిన 42వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు విడుదల చేయడం కుదరదని.. డిసెంబర్ వరకూ విడుదల చేయలేమని చెప్పారు. మరి దీనిపై ఎంత రచ్చ జరుగుతుంతో చూడాలి.

తెలుగు రైతులతో మోడీ కాన్ఫరెన్స్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రైతులతో మాట్లాడారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌లోని రైతులతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల ద్వారా పొందుతున్న లబ్ధి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము ఎదుర్కొంటున్న క‌ష్టాలు, వారు అవ‌లంబించాల‌నుకుంటున్న నూత‌న ప‌ద్ధ‌తుల‌పై మోదీకి వివ‌రిస్తున్నారు. తాము గతంలో పత్తి, జొన్న, మొక్కజొన్న సాగుచేసి నష్టపోయామని.. శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రస్తుతం అశ్వగంధ ఔషధ పంటను సాగుచేస్తున్నట్లు ఓ రైతు ప్రధానికి తెలిపారు. అశ్వగంధ పంటను మధ్యప్రదేశ్‌లో మార్కెట్‌ చేస్తూ హెక్టారుకు రూ.10-15వేల వరకు లాభాలు ఆర్జిస్తున్నట్లు చెప్పాడు. కొత్త వంగడాలు అందిస్తే అధిక దిగుబడులు సాధిస్తామని పాడేరుకు చెందిన రైతు ప్రధానికి వివరించాడు. అంతేకాదు త‌మ‌కు సాంకేతిక ప‌రిజ్ఞానం అందించాల‌ని కోరారు.

చంద్రబాబు జగన్ సవాల్.. దానికి సిద్దమా...?

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం కామనే. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా చంద్రబాబుపై పడిపోతుంటారు. ఇప్పుడు మరోసారి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావించి జగన్ చంద్రబాబుకు ఓ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్దామని, ఆ ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా? అని చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నది చంద్రబాబే.. పోలీసులు, డబ్బు వారి దగ్గరుందని, అయినా ప్రజల మద్దతు ఎవరికో తేల్చుకుందామని అన్నారు. ప్రశ్నించే విపక్షం లేకుండా చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని, విలువలతో కూడిన రాజకీయాలను ఆయన ఎన్నడో వదిలేశారని నిప్పులు చెరిగారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న చంద్రబాబుకు, ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరి జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారో లేదో చూడాలి.

విజయం ట్రంప్ దే.. బల్లగుద్ది చెబుతున్న ప్రొఫెసర్

  అప్పుడెప్పుడో సాకర్ ఆట గురించి ఓ ఆక్టోపస్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఏ జట్టు గెలుస్తందో అది ఆ దేశపు బాల్ పట్టుకుంటే.. ఆదేశం నిజంగానే విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కూడా ఓ ప్రొఫెసర్ జోస్యం చెబుతున్నాడు. యూఎస్ ప్రొఫెసర్ అల్లాన్ లిచ్ మ్యాన్ మాత్రం ఈ ఎన్నికల్లో విజయం మాత్రం డొనాల్డ్ ట్రంప్ దే అని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఈయన చెప్పింది నమ్మకపోవడానికి కూడా లేదు. ఎందుకంటే.. గత కొన్ని సంవత్సరాలుగా అల్లాన్ లిచ్ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తనదైన సర్వే చేసి ఫలితాలను వెల్లడిస్తున్నాడు. అయితే ఆశ్చర్యమేంటంటే.. ఇప్పటి వరకూ ఆయన చెప్పింది నిజమే అయింది. అంతేకాదు ఆయన గెలవడానికి గల అవకాశాలు గురించి ఆయన వెల్లడించాడు. హిల్లరీ క్లింటన్ తో పోలిస్తే, ట్రంప్ తన అభ్యర్థిత్వానికి గట్టి పోటీ లేకుండానే బరిలోకి దిగడం, ప్రతినిధుల సభ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ మరిన్ని సీట్లు గెలవడం, ట్రంప్ దూకుడు, అమెరికన్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల పెరుగుతున్న భయం, వలసవాదుల నుంచి వస్తున్న ప్రమాదాలు... తదితరాలు ప్రజలు ఆయన్ను ఎంచుకునేందుకు సహకరిస్తున్నాయని తెలిపారు.

న్యూజిలాండ్ కు కష్టతరంగా మారిన టెస్ట్ మ్యాచ్...

భారత్ న్యూజిలాండ్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన 500 వ టెస్ట్ మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 377/5 వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. అయితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు కనీసం డ్రా అయినా చేసి గట్టేక్కాలని చూస్తుంది. అయితే దానికి కూడా బ్రేకులు వేసింది టీమిండియా. 120 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 80 పరుగులు చేసి భారత బౌలర్లకు సవాల్ గా నిలిచిన రోంచీని పెవీలియన్ దారి పట్టించారు. జడేజా విసిరిన బంతిని సరిగ్గా ఆడలేని రాంచీ దానిని గాల్లోకి పంపగా.. అశ్విన్ దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 5వ వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 60 ఓవర్లలో 170 పరుగులు కాగా, ఆ జట్టు చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 264 పరుగులు చేయాల్సి వుంది.

8ఉప గ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ35..

ఏపీ, శ్రీహరి కోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌ వీ - సీ 35 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 9.12 గంటలకు మొదలైన కౌంట్ డాన్ ఈరోజు 9.12 గంటలకు పూర్తవడంతో.. ఈరోజు దానిని నింగిలోకి ప్రవేశపెట్టారు. ఎనిమిది ఉపగ్రహాలను ఒక్కసారే కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇలాంటి ప్రయోగం ఇస్రో నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఎనిమిది శాటిలైట్లలో వాతావరణ అధ్యయన శాటిలైట్ ఎస్‌సీఏటీఎస్ఏటీ-1 తో పాటు రెండు దేశీయ శాటిలైట్లు, మరో ఐదు విదేశీ శాటిలైట్లు ప్రవేశపెట్టనున్నారు. అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు తయారు చేసిన 2 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి35 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. వీటి మొత్తం బరువు 675 కిలోలు. భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో వీటిని ప్రవేశపెడతారు. ప్రయోగం మొత్తం పూర్తికావడానికి 2.15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

భారత్ దగ్గర పాక్ నోరు మూయించే ఆధారాలు..

18 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న యూరీ ఘటన సూత్రధారి పాకిస్థానే అని భారత్‌ వాదిస్తూ వస్తోంది. అయితే దానితో తమకు సంబంధం లేదని పాక్ గట్టిగా చెబుతోంది. ఈ నేపథ్యంలో దాయాది నోరు మూయించే గట్టి ఆధారాన్ని భారత్ సంపాదించింది. యూరి ఘటనపై దర్యాప్తు జరుపుతోన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వద్ద కీలక ఆధారాలున్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వాడిన వైర్‌లెస్ సెట్స్ ఇప్పుడు పాక్‌ను ఇరుకునపెట్టునున్నాయి. జపాన్‌లో తయారైన ఈ వైర్‌లెస్ సెట్స్‌పై బిల్‌కుల్ నయా అని ఉర్దూలో రాసి ఉంది. వీటిని తయారు చేసిన ఐకామ్ కంపెనీ నుంచి కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే తీసుకున్నారు. సాధారణంగా దేశాల భద్రతా సంస్థలకు మాత్రమే అమ్మే ఈ పరికరాలు ఉగ్రవాదుల దగ్గరకు ఎలా వచ్చాయన్న సందేహం కలుగుతోంది. వీటితో పాటు మరణించిన ఉగ్రవాదుల నుంచి రెండు మ్యాపులు, ఆహార పదార్థాలు, జీపీఎస్ పరికరాలు, మొబైల్స్ ఫోన్స్ ఉన్నాయి. వారు వాడిన ఆహార పదార్థాలు, జ్యూస్‌లు కరాచీలో తయారైనట్లు స్పష్టంగా ఉంది. వీటి ద్వారా ఉగ్రవాదులు ఎక్కడి వారో సులువుగా అర్థమవుతోంది. ఈ ఆధారాల సాయంతో అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టవచ్చు.

యూరీ కారకులను వదిలిపెట్టేది లేదు-ప్రధాని మోడీ

యూరీలో 18 మంది వీర సైనికులను పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు. వీర మరణం పొందిన సైనికులకు వందనం చేస్తున్నా అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. యూరీ ఘటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. యూరీ ఘటన బాధిత కుటుంబాలకే కాదు..దేశ ప్రజల మనుసులను గాయపరిచిందన్నారు. ఈ వెన్నుపోటు ఘటనతో భరతజాతి అగ్గిమీద గుగ్గిలమైందన్నారు. భారత సైన్యం మాట్లాడదు, తానేం చేయగలదో చేసి చూపుతుంది. కశ్మీర్ లోయలోని ప్రజలకు ఎవరు జాతి వ్యతిరేకులన్న సంగతి తెలుస్తోంది. శాంతి, ఐకమత్యమే భారత విజయానికి కారణం. మన సమస్యలకు పరిష్కారం కూడా అదొక్కటే.