భారత కుబేరుడు.. మళ్లీ ముఖేశ్ అంబానీనే
భారత వ్యాపారవేత్త, రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఈసారి కూడా భారతదేశ అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని అలాగే నిలుపుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇది తొమ్మిదో సారి కూడా ఆయనే ఫోర్బ్స్ జాబితాలో భారతదేశ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రూ.1,52,145 కోట్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు ముఖేశ్ అంబానీ. ఈయన తరువాత రెండో స్థానంలో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ.1,13,291 కోట్లతో నిలిచారు. హిందూజా ఫ్యామిలీ 1.01,877 కోట్లతో మూడోస్థానానికి ఎగబాకింది. రూ.లక్ష కోట్ల సంపదతో విప్రో అజీమ్ ప్రేమ్‌జీ నాలుగోస్థానానికి దిగజారారు. ఇవన్నీ ఒకెత్తు అయితే టాప్ 100 జాబితాలో పతంజలి ఆయుర్వేద అధినేత ఆచార్య బాలకృష్ణ చోటు సంపాదించడం ఆశ్చర్యం కలిగించింది. యోగా గురు రాందేవ్ బాబాకు సన్నిహితుడైన ఆయన.. రూ.16756 కోట్ల సంపదతో 48వ స్థానంలో నిలిచారు.