కావేరి జల వివాదంపై ఉమాభారతి...సరిహద్దుల్లో నిరాహారదీక్ష చేస్తా..
posted on Sep 29, 2016 @ 6:25PM
కావేరి జల వివాదంవల్ల అటు కర్ణాటకలోనూ.. ఇటు తమిళనాడులోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి ఈ వివాదం ముదురుతుందే తప్ప.. పరిష్కారం మాత్రం దొరకట్లేదు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కావేరి జల వివాదంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమైన ఆమె కావేరి జలాల సమస్య పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంకా కావేరి నదీ జలాల లభ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కర్ణాటకను తమ మంత్రిత్వశాఖ కోరిందని.. సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చొరవ చూపుతున్నాయని, ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఆమె తెలిపారు. అంతేకాదు కావేరి జలాల విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే.. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో తాను నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు. కాగా తమిళనాడుకు తాజాగా కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం.. ఆ తీర్పును ధిక్కరిస్తూ కర్ణాటక జలాలు విడుదల చేయకపోవడం తెలిసిందే.