సర్జికల్ దాడులు ఎలా జరిగాయంటే..?
posted on Sep 29, 2016 @ 4:23PM
భారత్ ఆర్మీ పాక్ సరిహద్దుల్లో సర్జికల్ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత రాత్రి పాకిస్థాన్ భూభాగంలోకి దాదాపు 3 కిలోమీటర్లు చొచ్చుకొని వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ప్రకటనతో అసలు విషయం తెలిసింది. అంతేకాదు ఈ దాడుల గురించి పాక్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ కు కూడా తెలుసని ప్రకటించారు. అయితే ఇంత జాగ్రత్తగా దాడులు ఎలా నిర్వహించారంటే..
ఉరీ దాడి జరిగిన తరువాత సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసిన సైన్యం సరిహద్దుల్లోని తీవ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పేందుకు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సన్నాహాలు చేసుకుంటున్నాయని సమాచారం అందగానే వెంటనే అప్రమత్తమైన భారత్ ఆర్మీ దళం.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పాక్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లారు. వివిధ సెక్టార్లలోని 6 నుంచి 8 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పారా కమాండోస్ ను వినియోగించారు. ఆయా ప్రదేశాల్లోకి వీరిని హెలికాప్టర్ల ద్వారా దించారు. మొత్తం 7 ఉగ్రవాద క్యాంపుల్లో చేసిన దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు హతమవ్వగా.. 9మంది పాక్ జవాన్లు మృతి చెందారు. కేవలం 48 నిమిషాల్లో మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టి.. అంతే వేగంగా వెనక్కి వచ్చేశారు. ఏం జరుగుతోందని పాక్ తెలుసుకునేలోపు భారత సేనలు ఆపరేషన్ ముగించి స్వదేశం చేరడం విశేషం. దీంతో భారత్ లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, పాక్ లో మాత్రం తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు మా దేశంపై సర్జికల్ దాడులు జరగలేదని కూడా బొంకుతుంది. మరి దీనికి భారత్ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.