వేట మొదలైంది..
posted on Sep 29, 2016 @ 1:05PM
పాకిస్థాన్ ఉరీ దాడిపై ఆగ్రహంతో ఉన్న భారత్.. ఈరోజు క్యాబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భద్రతా అంశంపై క్యాబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో పాక్ చేస్తున్న కాల్పుల ఉల్లంఘనపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈసందర్భంగా డైరక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ ఆర్మీ బుధవారం రాత్రి నియంత్రణ రేఖ వద్ద సర్జికల్ దాడులు నిర్వహించిందని తెలిపారు. పాకిస్థాన్ నుండి ఉగ్రచొరబాట్లు పదే పదే జరుగుతున్నాయని... వారిని నియంత్రించేందుకు నియంత్రణ రేశ వద్ద ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించామని.. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ డైరక్టర్ జనరల్‌కు కూడా తెలియజేసినట్లు చెప్పారు. నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాదులు భారత్ లోకి రాకుండా అడ్డుకుంటాం...పాక్ వైపు నుండి 20 చొరబాట్లను అడ్డుకున్నాం..పాక్ కుట్రలను తిప్పికొడతాం అని అని వెల్లడించారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్, జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.