పుతిన్, మోడీ భేటీ..

  బ్రిక్స్ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గోవా చేరుకున్నారు. గోవా చేరుకున్న ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్, మోడీ ఇద్దరూ భేటీ అయ్యారు. వీరిద్దరూ ర‌ష్యా, భార‌త్‌ ద్వైపాక్షిక అంశాల‌పై చర్చించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు స‌హా ప‌లు అంశాల‌పై చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు పాకిస్థాన్ ఉగ్రచర్యలపై కూడా మోడీ, పుతిన్ తో చర్చించనున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే అగ్రనేతలందరూ గోవా చేరుకున్నారు. కాసేపట్లో జరుగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నేతలు పాల్గొననున్నారు.

తమిళనాడు గవర్నర్ ఎవరు..?

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితి అనారోగ్యం కారణంగా గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో పరిపాలన స్తంభించిపోయింది. ఒక పక్క జయలలిత బాధ్యతలన్నీ ఆమెకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వం తీసుకున్నారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ నియామకం పై చర్చ మొదలైంది. తమిళనాడు గవర్నరుగా కొణిజేటి రోశయ్య పదవీకాలం ఆగస్టు 31తో ముగిసింది. అయితే ఆ తరువాత ఆయన పదవికాలాన్నే పొడిగించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. రోశయ్య స్థానంలో అప్పుడు నజ్మా హెప్తుల్లాని నియమించవచ్చని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనిశ్చితి నెలకొనడంతో ఆమెను మణిపూర్‌ గవర్నరుగా నియమించింది. ఆ తరువాత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ తెరపైకి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఆమె నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ నజ్మా హెప్తుల్లా పేరు వినిపిస్తోంది. ఆమెను మణిపూర్‌ నుంచి తమిళనాడుకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.   జయలలిత అనారోగ్యం కారణంగా తమిళనాడులో పూర్తిస్థాయిలో గవర్నరును నియమించాలనే డిమాండ్లు మెల్లగా తెరపైకి వచ్చాయి. పలువురు రాజకీయ పార్టీల నేతలు ఈ డిమాండ్లను వినిపిస్తుండటంతో కేంద్రప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. తమిళనాడుకు కొత్త గవర్నరు నియామకం గురించి గురు, శుక్రవారాల్లో సుదీర్ఘంగా ఆలోచించిందని ఈ నేపథ్యంలోనే ఆనందిబెన్‌ పటేల్‌ ను కానీ, నజ్మా హెప్తుల్లా ను కానీ నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఆలస్యంగా రష్యా అధ్యక్షుడు.. ముందు మోడీతో చర్చ..

  గోవా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) 8వ సదస్సు లో భాగంగా ఇప్పటికే అగ్రనేతలు గోవా చేరుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఆలస్యంగా గోవా చేరుకున్నారు. కొద్ది సేప‌టి క్రితం దాబోలిమ్ విమానాశ్రయం ప్రక్కన ఉన్న ఐఎన్ఎస్ హన్సా బేస్కు చేరుకున్నారు. నిజానికి నిన్న రాత్రే పుతిన్  ఐఎన్ఎస్ హన్సా బేస్కు చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలించడంతో ఆయన రాక ఆలస్యమైంది. ఇక ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు, గోవా అధికార ప్రతినిధులు పుతిన్ కు స్వాగ‌తం ప‌లికారు. కాసేపట్లో పుతిన్ గోవా చేరుకున్నారు. అయితే సదస్సులో పాల్గొనేముందు ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్  ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇంకా ఎస్-400 క్షిపణుల ఒప్పందంపై కూడా సంతకాలు జరగనున్నాయి.

మారిన పాస్ పోర్ట్ ఫొటో రూల్స్...

  అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ పాస్ పోర్ట్ ఫొటో పై కొన్ని ఆంక్షలు విధించింది. గతంలో ఉన్న నియమాలకు ఇప్పుడు తాజాగా కొన్ని నియమాలు జోడించింది. ఈ నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇంతకీ పాస్ పోర్టులో ఉండే ఫొటో ఎలా ఉండాలంటే.. సాధారణంగా ఫొటో అనగానే రకరకాల ఎక్స్ ప్రెషన్స్ వస్తుంటాయి.. కానీ పాస్ పోర్టు కోసం అప్లై చేసే సమయంలో జత చేసే ఫొటోల్లో ఎలాంటి విపరీత హావభావాలు ఉండరాదు. అంతేకాదు కళ్ల జోడు కూడా పెట్టుకోకూడదు. కళ్లజోడు పెట్టుకోవడం వల్ల నీడలు, గీతలు వంటి సమస్యలు వస్తున్నాయని... దాంతో, జెట్ సెట్టర్స్ ప్రాసెసింగ్ చాలా ఆలస్యమవుతోందని స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈ ఏడాది సుమారు 20 మిలియన్ల వరకు పాస్ పోర్ట్ లు జారీ చేయాల్సి రావచ్చని... ఈ క్రమంలో, అనవసర ఆలస్యాన్ని తప్పించుకోవాలంటే కొత్త విధానం చాలా అవసరమని వెల్లడించింది. వైద్యపరమైన సమస్యల వంటి అరుదైన పరిస్థితుల్లో మాత్రం కళ్లద్దాలను అనుమతిస్తామని... అయితే, దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.

పార్లమెంటరీ ఎంపీలకు సర్జికల్ దాడుల వివరాలు.. మరోసారి కూడా

  భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి సర్జికల్ దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల గురించి పాక్ స్పందిస్తూ అసలు మా దేశంలో అలాంటి దాడులే జరగలేదని చెప్పుకొచ్చింది. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాక్ తో పాటు మన దేశ నాయకులు కూడా ఈ దాడుల గురించి సాక్ష్యాలు బయటపెట్టమని చెప్పడం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు. వారితో పాటు ఇంకా పలువురు నేతలు కూడా సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని ఎంపీలకు.. తొలిసారిగా కమాండో ఆపరేషన్ వివరాలు తెలిపారు. ఆపరేషన్ జరిగిన తీరు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలకు జరిగిన నష్టం తదితర వివరాలను క్షుణ్ణంగా తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం దాడులకు దిగినట్టు వివరించారు. అవసరమైతే మరోసారి కూడా సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగుతామని భారత డీజీఎంవో పాకిస్థాన్ డీజీఎంవోకు స్పష్టం చేసినట్టు రావత్ తెలిపారు. కాగా రావత్ చెప్పిన విషయాలతో పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని చాలామంది సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

నేను కూడా ట్రంప్ బాధితురాలినే..

  అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల మధ్య మాటల యుద్దం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ట్రంప్ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకి వచ్చి దుమారం రేపుతుండగా.. ఆతరువాత పలువురు మహిళలు కూడా ట్రంప్ పై ఆరోపమలు గుప్పించారు. అయితే ఇప్పుడు తాజాగా హిల్లరీ క్లింటన్ కూడా ట్రంప్ పై ఆరోపణలు చేసి షాకిచ్చింది. తాను కూడా ట్రంప్ బాధితురాలినేనని.. ప్రేమోన్మాదిగా మారిన ట్రంప్ తన వెంట కూడా పడ్డారని, మీదిమీదికొచ్చారని చెప్పారు. ఇక హిల్లరీ చేసిన వ్యాఖ్యలకు ఎప్పటిలాగే ట్రంప్ ఖండించారు. ఆమె ఆరోపణలు నిరాధారమని, తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకే ఆమె ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా ఇంతకుముందు వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కే గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపించేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇప్పుడు హిల్లరీకి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. ట్రంప్ వ్యక్తిగతంపై వస్తున్న ఆరోపణలు.. మరోపక్క రెండు డిబేట్లలోనూ హిల్లరీదే పైచేయి కావడం. మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే మాత్రం నవంబర్ లో జరిగే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

బ్రిక్స్ సదస్సు.. గోవా చేరుకుంటున్న అగ్రనేతలు...

  బ్రిక్స్ సమావేశానికి సర్వం సిద్దమైంది. గోవాలో జరిగే 8వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు అగ్రనేతలు ఇప్పటికే గోవా చేరుకున్నారు. బ్రెజిల్ అధ్య‌క్షుడు మైఖేల్ టీమ‌ర్‌, ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు జాక‌బ్ జుమాలు గోవా చేరుకున్నారు. విదేశాంగ స‌హాయ మంత్రి జ‌న‌ర‌ల్ వీకే సింగ్ ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడికి విమానాశ్ర‌యంలో స్వాగ‌తం ప‌లికారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌, చైనా అధ్య‌క్షుడు జీ జింగ్‌పింగ్ కూడా కొద్దిసేపటిలో గోవా చేరుకున్నారు.  ఈ సమావేశంలో ముఖ్యంగా బ్రిక్స్ నేత‌లంతా అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదంపై ఓ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశాలున్నాయి. మరోవైపు గోవాలో అత్యాధునిక ఆయుధాలతో కూడిన పోలీసు బ‌ల‌గాలను మోహరించి భారీ భ‌ద్ర‌తను ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగ‌ణం, ప‌రిస‌ర ప్రాంతాలు, మార్గాల్లో పెద్ద‌ ఎత్తున త‌నిఖీలు చేస్తున్నారు.

రేపటి నుండి బ్రిక్స్ సమావేశాలు.. భారీ భద్రత

  బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) 8వ సదస్సుకు సర్వం సిద్దమైంది. గోవా వేదికగా రేపు, ఎల్లుండి  సదస్సు జరగనుంది. ఈ సమావేశాలకు ఐదు దేశాలు హాజరుకానున్నారు. మరోవైపు అసలే ప్రస్తుతానికి పరిస్థితి బాగుండక పోవడంతో  గోవాలో అత్యాధునిక ఆయుధాలతో కూడిన పోలీసు బ‌ల‌గాలను మోహరించి భారీ భ‌ద్ర‌తను ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగ‌ణం, ప‌రిస‌ర ప్రాంతాలు, మార్గాల్లో పెద్ద‌ ఎత్తున త‌నిఖీలు చేస్తున్నారు. ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు భారత్ వస్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త్, ర‌ష్యా మ‌ధ్య‌ ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.

జేఎన్యూ దసరా సంబరాలు... మోడీ దిష్టిబొమ్మ దహనం....

  గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న జేఎన్యూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ బొమ్మనే దహనం చేసి పెద్ద దుమారానికే తెర తీసింది. జేఎన్యూ లోని కొంత మంది విద్యార్ధులు దసరా ఉత్సవాల సందర్భంగా రావణ దహనం చేశారు. అయితే అసలు సమస్య ఏంటంటే.. దహనం కోసం సిద్ధం చేసిన దిష్టిబొమ్మకు మోదీ, అమిత్ షా ఫొటోలను అతికించి తగులబెట్టారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై వీసీ విచారణకు ఆదేశించారు. కొందరు విద్యార్థులు రావణ బొమ్మకు మోదీ, అమిత్ షాతోపాటు మోగా గురువు రాందేవ్ బాబా, సాధ్వి ప్రగ్యా, నాథురామ్ గాడ్సే, అసరాం బాపు, జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ ఫొటోలను అతికించి దహనం చేశారు. దీనిపై ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు సన్నీ దిమాన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను, దేశంలోని విద్యా సంస్థలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలోను కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని, అందుకే ఈ ఘటనకు పాల్పడ్డామని చెప్పారు. అంతేకాదు విద్యార్థులపై చర్యలు తీసుకుంటే దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

జియో కి షాకిచ్చిన ట్రాయ్...

  జియో ఇస్తున్న ఫ్రీ ఆఫర్లకి ఇతర నెట్ వర్కులన్నీ బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియోకే షాకిచ్చింది ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా). నిమిషానికి రూ. 1.20 వాయిస్ టారిఫ్ అమలులో ఉండగా, ఉచిత కాల్స్ ఆఫర్ ఎలా ఇస్తారంటూ షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన రిపోర్టుకు, ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లకు చాలా తేడా ఉన్న కారణంగా జియోను వివరణ కోరినట్టు ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ట్రాయ్ ఉన్నతాధికారులు రిలయన్స్ జియో ప్రతినిధులతో భేటీ అయి, టారిఫ్ ప్లాన్ వివరాలు, ప్రైసింగ్ మోడల్ తదితరాలపై వివరాలు తెలుసుకుంటున్నారని వివరించాయి. కాగా, కాల్ ప్లాన్ కింద సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపిన జియో, సిమ్ కార్డు బ్రోచర్లపైనా ఇదే విషయాన్ని ప్రచురించింది. ఇక ఉచిత కాల్స్ ఆఫర్ కు, ఈ టారిఫ్ ప్లాన్ కు మధ్య వ్యత్యాసంపై సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు.

తలాక్ వ్యవస్థను రూపుమాపాలి..

  తలాక్ వ్యవస్థపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది కాలంగా దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవస్థపై స్పందించిన వెంకయ్యనాయుడు.. ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యాఖ్యలను ఖండించారు. తలాక్ చెప్పే వ్యవస్థ మంచిది కాదని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. తలాక్ చెప్పే వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఉందని.. మూడు సార్లు తలాక్ చెప్పే వ్యవస్థపై ప్రజల్లో తీవ్రంగా చర్చ జరగాలని అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదని.. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ఉమ్మడి పౌర స్మృతి అని.. ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం మంచిదికాదన్నారు.

ట్రంప్ వ్యక్తిత్వానికి తప్పదు భారీ మూల్యం..

కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది అంటే ఇంకెవరూ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసే డొనాల్డ్ ట్రంప్ ది అని అనేవారు. అప్పటివరకూ తనకు అభ్యర్ధిగా ఉన్నా హిల్లరీ క్లింటన్ కాస్త వెనుకబడే ఉండేది. అయితే రాను రాను ట్రంప్ కు వ్యతిరేకత పెరగడంతో కాస్త వెనక్కి తగ్గారు. ఇక ఎప్పుడైతే మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగిందో అప్పుటితో ట్రంప్ సత్తా తెలిసిపోయింది. ఈ డిబేట్ లో హిల్లరీ మంచి మార్కులు సంపాదించారు. అప్పుడు కూడా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ పై ఆరోపణలు చేస్తూ.. తన కూతురు చూస్తుందని ఆయన రాచకార్యాలు చెప్పలేదు.. కానీ రెండో డిబేట్లో నా తడాఖా చూపిస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఇంకే ముంది అప్పుడే ట్రంప్ గారి వీడియోలు బయటకు వచ్చాయి. ఒక మహిళతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇదే హిల్లరీకి ప్లస్ పాయింట్ అయింది. రెండో డిబేట్ లో ఆమె వీటిపైనే ట్రంప్ పై వివర్శలు చేసింది. ఇక రెండో డిబేట్ లో కూడా హిల్లరీ దే పైచేయి అయింది. అనంతరం చేసిన సర్వేల్లో కూడా ట్రంప్, హిల్లరీ కంటే కాస్త వెనుకబడే ఉన్నాడు.   ఇక ఇప్పుడు తాజాగా చూస్తే ఒకరు తరువాత ఒకరు మహిళలు వరుసపెట్టి ట్రంప్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగం కోసం వచ్చే అప్రెంటిస్‌లతో, ఒంటరిగా లిఫ్టులో దొరికే మహిళలతో, విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళలతో ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించినట్టు మీడియా కథనాలు వివరిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు మరో నెలరోజుల్లో జరుగునున్న తరుణంలో ట్రంప్ వ్యక్తిత్వంపై వస్తున్న ఆరోపణలో నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఎన్నికల్లో గెలవడం కష్టమే అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి తోడు సొంత పార్టీ నేతలతోనే ఆయనకు వైరం. ఇవన్నీ కలిసి.. ట్రంప్ గెలవడం కష్టమే అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

మరో ఉద్యమానికి రెడీ అవుతున్న ముద్రగడ...

  కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గతంలో కాపు ఐక గర్జన పేరిట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ముద్రగడ మరోసారి ఉద్యమానికి ప్రణాళిక సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాపులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తవడంతో మరోసారి ఉద్యమానికి తెర తీశారు. వ‌చ్చేనెల 16 నుంచి కాపు స‌త్యాగ్ర‌హం పేరిట యాత్రను చేపట్టనున్నారు. ఈ యాత్ర తూర్పు గోవాద‌రి జిల్లా రావులపాలెంలో ప్రారంభమై అక్కడి నుంచి అమ‌లాపురం మీదుగా అంత‌ర్వేది వర‌కు ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత త‌మ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇండియా - బంగ్లాదేశ్ మధ్య దూరడానికి చైనా ప్లాన్

  బంగ్లాదేశ్ కు తన ధన బలంతో చెక్ పెట్టాలని చైనా బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ కు సహాయం చేసే నేపథ్యంలో రెండు దేశాల మధ్య రావడానికి చైనా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో ఉన్న స్నేహబంధాన్ని కొనసాగిస్తూ, పలు ప్రాజెక్టులకు 2 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 13 వేల కోట్లు) భారత్ బంగ్లాదేశ్ కు ఇవ్వగా.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి చైనా కూడా ముందుకు వస్తుంది. దాదాపు 30 సంవత్సరాల తరువాత చైనా ప్రధాని క్సీ జిన్ పింగ్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా  పలు ఒప్పందాలపై సంతకాలు జరగనున్నట్టు తెలుస్తోంది. మౌలిక వసతులు, పవర్ ప్లాంట్ల నిర్మాణం కోసం 24 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.60 లక్షల కోట్లు) రుణంగా ఇవ్వనుంది. 1,320 మెగావాట్ పవర్ ప్లాంట్ సహా మొత్తం 25 ప్రాజెక్టులకు చైనా నిధులను అందిస్తోందని తెలుస్తోంది. దీంతో పాటు నౌకాశ్రయం నిర్మాణానికీ దీర్ఘకాల రుణమివ్వనుందని బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి ఎంఏ మన్నామ్ తెలిపారు. అంతేకాదు జియాంగ్రూ ఎటెర్న్ కంపెనీ లిమిటెడ్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో బంగ్లాలో పవర్ గ్రిడ్ నెట్ వర్క్ ను విస్తరించేందుకు డీల్ కుదుర్చుకుందని.. ఇంకా ఎన్నో దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన సొనాడియా నౌకాశ్రయం నిర్మాణం నిమిత్తం త్వరలో కార్యరూపం దాల్చనుందని మన్నామ్ తెలిపారు. మొత్తానికి ఇండియా - బంగ్లాదేశ్ మధ్య దూరడానికి చైనా పెద్ద ప్లానే వేసింది.

కళ్లు తెరిచిన జయలలిత.. పూజలు, సంబరాలు..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత 24 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సలో పొందుతున్న సంగతి తెలిసిందే. ఎయిమ్స్ వైద్య బృందం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ఒకవైపు జయలలితకు వెంటిలేటర్ తీసేశామని.. ఇంకా జయలలిత వార్త పత్రికలు చదువుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈరోజు ఆమె కళ్లు తెరిచారు అన్న వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు ఆమె కళ్లు తెరచి చూసిందని వైద్యులు కూడా ధృవీకరించారు. మరోసారి లండన్ వైద్యుడు అపోలో ఆస్పత్రి చేరుకున్నాడు. దీంతో ఆమె కోసం ఆస్పత్రి ముందు వేచి చూస్తున్న అభిమానులు, కార్యకర్తలు ఆనందలో మునిగితేలుతున్నారు. ఇంకా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. కాగా నేడు నేడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, జయలలితను పరామర్శించేందుకు రానున్నారు. మరి నిన్న జయలలిత వార్త పత్రికలు చదవడమేంటో... ఈరోజు కళ్లు తెరవడమేంటో.. ఎందులో నిజముందో డాక్టర్లకే తెలియాలి..

భారత్, రాష్యా ఒప్పందం.. పాకిస్థాన్, చైనాలకు చెక్

  ప్రధాని నరేంద్ర మోడీ రష్యాతో ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. రేపు ప్రారంభ‌మ‌య్యే బ్రిక్స్ స‌మావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు రూ.34 వేల కోట్ల విలువైన క్షిప‌ణుల‌ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్ ఈ చారిత్రక ఒప్పందంపై సంత‌కాలు చేయ‌నున్న‌ట్లు ర‌ష్యా ప్ర‌తినిధి యూరీ ఉష‌కోవ్ వెల్ల‌డించారు. ఈ ఒప్పందంలో భాగంగా ర‌ష్యా భార‌త్‌కు అత్యాధునిక  ఐదు ఎస్‌-400 అనే ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌యోగించ‌గ‌లిగే క్షిప‌ణుల‌ను అందించ‌నుంది. ప్ర‌పంచంలోనే అత్యాధునిక ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న‌త‌లానికి ప్ర‌యోగించే క్షిప‌ణిగా భావించే వీటికి.. దేశంపై దాడికి వ‌చ్చే ఎయిర్‌క్రాఫ్ట్స్‌, మిస్సైల్స్‌ను  400 కిలోమీట‌ర్ల దూరం నుంచే ప‌సిగ‌ట్ట‌గ‌ల‌వు. అత్యాధునిక రాడార్ వ్య‌వ‌స్థ కలిగిన ఈ క్షిపణులు నిఘా విమానాల‌ను కూడా ఇవి గుర్తించ‌గ‌ల‌వు. కాగా ఈ క్షిప‌ణులు దేశంలోని కీల‌క‌మైన ప్ర‌భుత్వ కేంద్రాలు, న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్‌ప్లాంట్స్ ర‌క్ష‌ణ కోసం వినియోగించ‌నున్నారు. మొత్తానికి భారత్ ఈ క్షిపణుల ద్వారా తన ప్రత్యర్థదేశాలైన పాకిస్థాన్, చైనాలకు చెక్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ కు సమాచారం అందించిన డీఎస్పీ సస్పెండ్..

  పాకిస్థాన్ కు సమాచారం అందజేస్తున్నారన్న కారణంగా ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు. తన్వీర్ అహ్మద్ అనే డీఎస్‌పీ తన వాట్సప్ ద్వారా పాకిస్థాన్ ఇంటలిజెన్స్‌కు భద్రతా సమాచారం చేరవేస్తున్నాడన్న కారణంతో  డీఎస్‌పీని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇక దీనిపై తన్వీర్ అహ్మద్ స్పందిస్తూ.. నెలక్రితం కంట్రోల్ రూం ఫోన్ నుంచి ఆర్మీ కమాండర్‌గా చెబుతూ తనకు ఓ కాల్ వచ్చిందని.. ఫోన్‌చేసిన వ్యక్తి కశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసు, పారా మిలటరీ సిబ్బంది వివరాలను తెలపాల్సిందిగా ఆదేశించాడు. అందుకే సమాచారం చెప్పానని.. ఈ వివరాలు అతనితో చెప్పేముందు ఎస్పీ అనుమతి సైతం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలకు ఇంటలిజెన్సీ అధికారులు స్పందిస్తూ.. తిరుగుబాటు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులకు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తులు సాధారణంగా ఇతర సెక్యూరీటీ ఏజెన్సీకి చెందిన అధికారులుగా పేర్కొంటూ భద్రతా సమాచారం అడుగుతుంటారు. ఏదేమైనప్పటికీ విధుల్లో ఉన్న అధికారులు అటువంటి సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. కానీ అహ్మద్ మాత్రం సమాచారం అందించారు అని తెలిపారు. అందుకే ఆయన్ని విధుల నుండి సస్పెండ్ చేశాం.. ఇకముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపారు.