తమిళనాడు గవర్నర్ ఎవరు..?
posted on Oct 15, 2016 @ 12:49PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితి అనారోగ్యం కారణంగా గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో పరిపాలన స్తంభించిపోయింది. ఒక పక్క జయలలిత బాధ్యతలన్నీ ఆమెకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వం తీసుకున్నారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ నియామకం పై చర్చ మొదలైంది. తమిళనాడు గవర్నరుగా కొణిజేటి రోశయ్య పదవీకాలం ఆగస్టు 31తో ముగిసింది. అయితే ఆ తరువాత ఆయన పదవికాలాన్నే పొడిగించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. రోశయ్య స్థానంలో అప్పుడు నజ్మా హెప్తుల్లాని నియమించవచ్చని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనిశ్చితి నెలకొనడంతో ఆమెను మణిపూర్ గవర్నరుగా నియమించింది. ఆ తరువాత గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తెరపైకి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం ఆమె నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ నజ్మా హెప్తుల్లా పేరు వినిపిస్తోంది. ఆమెను మణిపూర్ నుంచి తమిళనాడుకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
జయలలిత అనారోగ్యం కారణంగా తమిళనాడులో పూర్తిస్థాయిలో గవర్నరును నియమించాలనే డిమాండ్లు మెల్లగా తెరపైకి వచ్చాయి. పలువురు రాజకీయ పార్టీల నేతలు ఈ డిమాండ్లను వినిపిస్తుండటంతో కేంద్రప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. తమిళనాడుకు కొత్త గవర్నరు నియామకం గురించి గురు, శుక్రవారాల్లో సుదీర్ఘంగా ఆలోచించిందని ఈ నేపథ్యంలోనే ఆనందిబెన్ పటేల్ ను కానీ, నజ్మా హెప్తుల్లా ను కానీ నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.