జియో కి షాకిచ్చిన ట్రాయ్...
posted on Oct 14, 2016 @ 3:52PM
జియో ఇస్తున్న ఫ్రీ ఆఫర్లకి ఇతర నెట్ వర్కులన్నీ బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియోకే షాకిచ్చింది ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా). నిమిషానికి రూ. 1.20 వాయిస్ టారిఫ్ అమలులో ఉండగా, ఉచిత కాల్స్ ఆఫర్ ఎలా ఇస్తారంటూ షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన రిపోర్టుకు, ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లకు చాలా తేడా ఉన్న కారణంగా జియోను వివరణ కోరినట్టు ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ట్రాయ్ ఉన్నతాధికారులు రిలయన్స్ జియో ప్రతినిధులతో భేటీ అయి, టారిఫ్ ప్లాన్ వివరాలు, ప్రైసింగ్ మోడల్ తదితరాలపై వివరాలు తెలుసుకుంటున్నారని వివరించాయి. కాగా, కాల్ ప్లాన్ కింద సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపిన జియో, సిమ్ కార్డు బ్రోచర్లపైనా ఇదే విషయాన్ని ప్రచురించింది. ఇక ఉచిత కాల్స్ ఆఫర్ కు, ఈ టారిఫ్ ప్లాన్ కు మధ్య వ్యత్యాసంపై సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు.