మహిళలను నాలా ఎవరూ గౌరవించరు.. పగలబడి నవ్విన ఆడియన్స్

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్..డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ మధ్య చివరి డిబేట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిబేట్ లో ట్రంప్ వ్యాఖ్యలకు ఆడియన్స్ తెగ నవ్వుకున్నారట. అయితే ట్రంప్ వేసిన జోక్ ఏంటి... ట్రంప్ ఏం అన్నాడు.. దానికి ఆడియన్స్ ఎందుకు అంతలా నవ్వారు అనే కదా డౌట్.. అసలు సంగతేంటంటే... ఈ మధ్య ట్రంప్ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  అంతేకాదు ఆ వీడియో తరువాత పలువురు మహిళలు కూడా ట్రంప్ పై ఆరోపణలు చేశారు. ఇది వ్యవహారం అయితే పెద్ద దుమారమే రేపింది. అయితే మూడో డిబేట్ లో ట్రంప్ మాట్లాడుతూ...'నేను గౌరవించినంతగా మహిళలను మరెవరూ గౌరవించరు అని వ్యాఖ్యానించగానే.. ఆడియన్స్ పగలబడి నవ్వారట. దీంతో, ఈ డిబేట్ కు సమన్వయకర్తగా వ్యవహరించిన ఫాక్స్ న్యూస్ యాంకర్ క్రిస్ వాలస్ కల్పించుకుని ‘ప్లీజ్, ఎవిరిబడీ’ అంటూ నిశ్శబ్దంగా ఉండాలంటూ ఆడియన్స్ ని కోరారట.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

  గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతోనే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 145.47 పాయింట్లు పెరిగి 0.52 శాతం లాభంతో 28,129.84 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 40.30 పాయింట్లు పెరిగి 0.47 శాతం లాభంతో 8,699.40 పాయింట్ల వద్దకు చేరాయి. బ్యాంకులు లాభాల్లో పయనించగా, ఐటీ కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.   ఇంకా అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందాల్కో, ఐడియా సెల్యులర్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, టాటామోటార్స్‌(డి), టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్... చంద్రబాబు ఉండగానే..

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  సీఎం చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘర్షణ జరగగా ఓ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పర్యటకు వెళ్లిన చంద్రబాబు అక్కడ సబ్బవరంలో పెట్రోల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లిన టీడీపీ నేత గండి బాబ్జిని మరో నేత బండారు సత్యనారాయణ మూర్తి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో గండి బాబ్జి, బండారు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు చంద్రబాబు సమక్షంలోనే  గండి బాబ్జిని అరెస్ట్ చేశారు.

నవాజ్ షరీఫ్ కు సుప్రీంకోర్టు నోటీసులు...

  పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పొరుగు దేశ ప్రధానికి మన సుప్రీం నోటీసులు జారీ చేయడం ఏంటనుకుంటున్నారా..? మన సుప్రీం కోర్టు కాదులెండి పాకిస్థాన్ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ కు నోటీసులు జారీ చేసింది. కొన్ని నెలల క్రితం పనామా పేపర్స్ లో వెల్లడించిన ప్రపంచ ప్రముఖుల అక్రమ ఆస్తుల వివరాల్లో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్ పేరు కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై పాక్‌కు చెందిన తెహ్రిక్‌-ఎ-ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగస్ట్ 28 న త‌మ దేశ ప్ర‌ధానిపై కేసు వేశారు. దీంతో పాక్ ప్ర‌ధానితో పాటు పలువురికి ఆ దేశ అత్యున్నత న్యాయ‌స్థానం నోటీసులు జారీచేసింది.

బీజేపీలో చేరిన రీటా బ‌హుగుణ జోషి..

  యూపీ కాంగ్రెస్ కీల‌క మ‌హిళా నేత రీటా బ‌హుగుణ జోషి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె బీజేపీలో చేరుతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ ఆమె బీజేపీ పార్టీలో చేరిపోయారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స‌మ‌క్షంలో ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో రీటా బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. అమిత్ షా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా రీటా బ‌హుగుణ మాట్లాడుతూ.. 24 ఏళ్లు కాంగ్రెస్‌లో సేవ‌లందించాన‌ని అన్నారు. దేశ ప్ర‌యోజ‌నాల కోసమే తాను బీజేపీలో చేరిన‌ట్లు వ్యాఖ్యానించారు.

శివకాశిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

  శివకాశిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి దగ్గర పడుతోంది. ఇక దీపావళి టపాసుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో భారీగా బాణాసంచా తయారీ చేస్తుంటారు. ఈనేపథ్యంలోనే బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా..మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 8 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ గోడౌన్ పక్కనే ఒక ప్రైవేటు ఆస్పత్రి కూడా ఉంది. గోడౌన్ నుండి మంటలు వ్యాపించడంతో రోగులను వేరేచోటుకు తరలించారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు.   కాగా  శివకాశిలో దాదాపు ప్రతియేటా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.  సంవత్సరం పొడవునా తయారుచేసిన టపాసులను శివారు ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వచేస్తుంటారు. దీపావళి సమీపిస్తుండటంతో విక్రయాలు భారీఎత్తున కొనసాగుతుంటాయి. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు కూడా టపాసులు సరఫరా చేస్తుంటారు.

జేఎన్‌యూ లో స్టూడెంట్ మిస్సింగ్.. విద్యార్ధుల ఆందోళన

  జేఎన్‌యూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వివాదాలకు అడ్డాగా మారిన జెఎన్యూలో మరో దుమారం రేగుతుంది. వర్శిటీలో నజీబ్ అహ్మద్ అనే విద్యార్థి తప్పిపోయిన విషయం తెలిసిందే. నిన్నటి నుండి నజీబ్ అహ్మద్ అనే కనిపించకపోవడంతో జేఎన్‌యూలో వీసీ కార్యాలయం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారని.. కనీసం తమను అన్నం కూడా తిననీయకుండా ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల భార్యలు తినుభండారాలు తీసుకొచ్చిన లోనికి అనుమతించడంలేదని వివరించారు. తాము ఈ విషయమై పోలీసులతో మాట్లాడామని అయినా విద్యార్థులు వినడంలేదని పేర్కొన్నారు. విద్యార్థులు అనవసరంగా ఆందోళన చేస్తున్నారని వెంటనే ఆందోళన విరమించాలని వీసీ కోరారు.

రెండో వన్డే.. బోణి కొట్టేందుకు కివీస్..

  భారత్ టాస్ లు గెలవడంతో పాటు వరుసగా మ్యాచ్ లు కూడా గెలుస్తూ న్యూజిలాండ్ కు చుక్కలు చూపిస్తుంది. కివీస్, భారత్ కు మధ్య జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లలో భారత్ ఘన విజయం సాధించగా.. ఇప్పుడు వన్డే మ్యాచుల్లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. మొన్న జరిగిన వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే మరో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే టాస్ గెలిచిన టీ మిండియా.. తొలుత ఫీల్డింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపింది. కాగా ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ జట్టు మూడు మార్పులు చేసింది. గత మ్యాచ్ లో ఆడిన నీషమ్,  బ్రాస్ వెల్, సోధీలకు విశ్రాంతి నిచ్చి, వారి స్థానంలో బౌల్ట్, హెన్రీ, డెవిచిచ్ లను తుది జట్టులోకి తీసుకుంది. మొత్తం న్యూజిలాండ్-ఇండియా మధ్య ఐదు వన్డే సిరీస్ లు జరగనున్నాయి.

రంగంలోకి దిగనా... ములాయం కు అఖిలేశ్

  వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అవి దగ్గర పడేకొద్ది ములాయం కుటుంబంలో కూడా విబేధాలు ముదురుతున్నాయి. ఇప్పటికే ములాయం వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా అఖిలేష్ ఉండడని చెప్పడం.. దానికి పార్టీ నేతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లేఖ రాసి అందులో విమర్శించడం జరిగింది.. తరువాత మళ్లీ ములాయం సీఎం అభ్యర్ధిగా అఖిలేషే ఉంటాడని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అఖిలేష్ కూడా తన తండ్రి ములాయం కు ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ములాయం రెండు సార్లు రెండు మాటలు చెప్పిన నేపథ్యంలో ప్రజలు అయోమయంలో పడి ఉంటారన్న కారణంగా.. తాను ప్రచారం ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాశారట. నవంబర్ 3 నుంచి ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్న అఖిలేష్, రెండో దఫా సీఎం అభ్యర్థిగా తన పేరును ఖరారు చేస్తేనే, ప్రచారంలో దూసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే తాను రంగంలోకి దిగేముందు తండ్రి అనుమతి తీసుకోవాలని భావించి ఈ లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు.. డేంజర్ జోన్ లో

  దాదాపు 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు డేంజర్లో ఉన్నాయని.. డెబిట్ కార్డుల వివరాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయానని చెబుతున్నాయి బ్యాంకు వర్గాలు. అందుకే ప్రతి ఒక్కరూ ఏటిఎం పిన్ నెంబరు మార్చుకోవాలని.. లేక కొత్త కార్డు తీసుకోవాలని సూచించాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ కార్డులకు ముప్పు పొంచి ఉన్నట్టు..యస్ బ్యాంకుకు చెందిన ఖాతాదారుల్లో అత్యధికుల వివరాలు బయటకు పొక్కిన తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తాము ఆరున్నర లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేశామని.. వారికి కొత్త కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. మిగ‌తా బ్యాంకులు మాత్రం దీనిపై స్పందించ‌లేదు. దేశ‌వ్యాప్తంగా 69.7 కోట్ల డెబిట్ కార్డులు ఉన్న‌ట్లు సెంట్ర‌ల్ బ్యాంక్ గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ముప్పు పొంచి ఉన్న కార్డుల్లో 26 ల‌క్ష‌లు వీసా, మాస్ట‌ర్‌కార్డ్‌కు చెందిన‌వి కాగా.. 6 ల‌క్ష‌లు రూపేకి చెందిన‌విగా బ్యాంకు వ‌ర్గాలు తెలిపాయి.

జీఎస్టీపై కుదరని ఏకాభిప్రాయం.. మళ్లీ సమావేశాలు

  వచ్చే ఏడాది నుండి జీఎస్టీ బిల్లును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తో పాటు పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మాత్రం జీఎస్టీ ఖరారుపై ఏకాభిప్రాయం కుదురనట్టే కనిపిస్తోంది. పన్ను రేటు, విధివిధానాలపై పలు రాష్ర్టాలు పలు అభ్యంతరాలను, అనుమానాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో దీనిపై మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ..  భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈరోజు జరగాల్సిన సమావేశం రద్దు చేశామని... అయితే నవంబర్ 3, 4 తేదీల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.   పన్ను శ్లాబులను 6, 12, 18, 26 శాతాలుగా ప్రతిపాదించారు. నిత్యావసర సరుకులపై అత్యల్పంగా; విలాసవంత వస్తువులపై, పొగాకు, సిగరెట్లు, ఆల్కహాల్ వంటి హానికర పదార్థాలపై అత్యధికంగా పన్ను రేటు విధించాలని భావించారు. అయితే విలాస వస్తువులు, హానికర పదార్థాలపై అత్యధిక పన్ను కాకుండా అదనపు సెస్ విధింపుపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమయిందని తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఐదేండ్లపాటు (2017 ఏప్రిల్ 1 మొదలుకుని) రాష్ర్టాలు నష్టపోయే రెవెన్యూ పరిహారానికి ఈ అదనపు సెస్‌ను వినియోగిస్తారని అన్నారు. ప్రస్తుతం 3 నుంచి 9 శాతం పన్ను వసూలు చేస్తున్న వస్తువులపై ఆరుశాతం పన్ను విధిస్తామని తెలిపారు. వచ్చే 3, 4 తేదీల్లో జరిగే సమావేశంలో పన్ను స్వరూపాన్ని ఖరారు చేస్తామన్నారు.

సిద్దూకి కాంగ్రెస్ బంపరాఫర్...

  బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తానే సొంతగా 'ఆవాజ్ ఏ పంజాబ్' పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సిద్దూకి కాంగ్రెస్ పార్టీ ఓ భారీ ఆఫరే ఇచ్చినట్టు తెలుస్తోంది. పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపితే, సిద్దూకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చిందట. పంజాబ్ లో సిద్దూకి మంచి క్రేజ్ ఉండటంతో.. దీనికితోడు, ఉత్తరప్రదేశ్ తో పోల్చితే పంజాబ్ లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో... సిద్దూ మద్దతు కోసం కాంగ్రెస్ బాగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఆఫర్ తలుపుతట్టింది. మరి ఈ ఆఫర్ కు సిద్దూ ఓకే అంటారో లేదో చూద్దాం..

హిల్లరీ, ట్రంప్.. ఎడమొహం, పెడమొహం..

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్..డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ ల మధ్య ఇప్పటివరకూ రెండు డిబేట్లు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఇద్దరి మధ్య ఫైనల్ డిబేట్ జరిగింది అయితే గత రెండు డిబేట్లో ఇద్దురూ డిబేట్ ప్రారంభమయ్యేముందు కరచాలనంతో పలకరించుకుని డిబేట్లను ప్రారంభించారు. అయితే ఈసారి మాత్రం అలాంటి పలకరింపులు ఏం జరగలేదు ఇద్దరి మధ్య. ఎందుకంటే రెండో డిబేట్ తరువాత ఇద్దరి మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరిన సంగతి విదితమే.. అందుకే డిబేట్ ముందు పలకరించుకోవడం కాదు కదా... ఒకర్ని ఒకరు అస్సలు పట్టించుకోనేలేదు. ఏదో డిబేట్ లో భాగంగా ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానం ఇచ్చినప్పుడు తప్ప ఒకరినొకరు కనీసం చూసుకోనుకూడా లేదు. ఈ డిబేట్లో జాతీయ రుణాలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీం కోర్టు, ఫిలాసఫీలు, ప్రెసిడెంట్‌ గా ఫిట్‌ నెస్‌ వంటి అంశాలపై మోడరేటర్‌ (సంధానకర్త) క్రిస్‌ వాలెస్‌ ప్రశ్నలడగ్గా, హిల్లరీ, ట్రంప్ సూటిగా సమాధానం ఇచ్చారు. కాగా  నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మూడో డిబేట్ అనంతరం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని చెబుతున్నాయి పలు సంస్థలు. చివరి బిగ్ డిబేట్ ముగిసిన తరువాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా.. హిల్లరీకి 92 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని, ట్రంప్ కన్నా క్లింటన్ 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని బ్లూమ్ బర్గ్ ప్రకటించింది.

12 మంది అధికారులపై వేటు... జాతి వ్యతిరేక కార్యకలాపాలు

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది అధికారులపై వేటు పడింది. ఈ ఘటన జమ్మూకాశ్మీర్లో చోటుచేసుకుంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో కశ్మీర్‌ యూనివర్శిటీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సహా.. విద్యాశాఖ, రెవెన్యూ, వైద్యారోగ్య, ఇంజినీరింగ్‌, పౌర సరఫరాల శాఖల్లోని 12 మంది అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో జరిగిన అల్లర్ల సమయంలో ఈ 12 మంది అధికారులు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలిందని.. దీనికి సంబంధించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పోలీసులు అందించారని వెల్లడించారు. నివేదికలను పరిశీలించిన అనంతరం.. ఉద్యోగులను తొలగించాలంటూ సదరు శాఖలకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు.