కావేరి జలాలపై తీర్పు రిజర్వ్ లో పెట్టిన సుప్రీం..

  త‌మిళ‌నాడు-క‌ర్ణాట‌క రాష్ట్రాల మ‌ధ్య కావేరి నీటి జలాల వివాదం జరుగుతూనే ఉంది. దీనిపై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా కర్ణాటక ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. తమిళనాడుకు రోజుకు 2 వేల క్యూసెక్కులు చొప్పున కావేరీ జ‌లాల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు.  2007లో ట్రిబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అప్పీల్‌పై ఈ రోజు విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అంతేకాదు తాము చెప్పినట్టు రోజుకు 2 వేల క్యూసెక్కులు చొప్పున కావేరీ జ‌లాల‌ను విడుద‌ల చేయాల‌ని మరోసారి చెప్పింది. మ‌రోవైపు కేంద్రం, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా త‌మిళ‌నాడులో ఈ రోజు కూడా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

ఆందోళన కారులపైనే పోలీసుల వ్యాన్..

  ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆందోళనకారులపైనే వాహనాలు ఎక్కించేశారు పోలీసులు. వివరాల ప్రకారం.. చైనాతో సరిహద్దు భద్రత సమస్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ కు మద్దతుగా అమెరికా దళాలు ఆ దేశంలో సేవలందిస్తున్నాయి. అయితే అమెరికా దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, వాహనాలపై వచ్చి ఆందోళన కారులపైకి వాహనాలు ఎక్కించేశారు. దీంతో ఎంతో మంది గాయాలపాలయ్యారు. ఇంకేముంది ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఆందోళనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరో రికార్డ్ సొంతం చేసుకున్న సానియామీర్జా...

    హైద‌రాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ లో ఇప్పటికే రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ సొంతం చేసుకుంది సానియా మీర్జా. అదేంటంటే... వుమెన్స్ డ‌బుల్ ర్యాంకింగ్స్‌లో వ‌ర‌స‌గా 80వ వారం కూడా సానియా నంబ‌ర్‌వ‌న్‌గా కొన‌సాగుతోంది. ఈ విష‌యాన్ని సానియానే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.  కాగా  సానియా కంటే ముందు ముగ్గురు వుమెన్ ప్లేయ‌ర్స్ మాత్ర‌మే ఈ ఘ‌న‌త‌ను సాధించారు. వారిలో మార్టినా న‌వ్ర‌తిలోవా (181 వారాలు) తొలిస్థానంలో ఉండ‌గా.. కారా బ్లాక్ (145 వారాలు), లీజెల్ హ్యూబెర్ (134 వారాలు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.  

అప్పుడు ట్రంప్.. ఇప్పుడు హిల్లరీ..

  గతంలో అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ న‌గ్న‌విగ్ర‌హాన్ని న్యూయార్క్ వీధుల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిల్లరీ విగ్రహాన్ని కూడా పెట్టారు. మాన్‌హ‌ట‌న్‌లోని స‌బ్‌వే స్టేష‌న్ బ‌య‌ట హిల్ల‌రీ టాప్‌లెస్ విగ్ర‌హాన్ని ఎవ‌రో ఉంచారు. దీంతో ఈ నగ్న విగ్రహం వివాదానికి కారణమైంది. దీనిని చూడ‌గానే ఓ మ‌హిళ దానిని కింద ప‌డేసి..  ఇలా చేయ‌డం స‌రికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మ‌ళ్లీ ఎవ‌రూ దానిని అక్క‌డ పెట్టకుండా దానిపై ఎక్కి కూర్చుంది. అయితే అప్పుడు ట్రంప్ విగ్రహాన్ని తామే త‌యారుచేసిన‌ట్లు ఇన్‌డిక్లైన్ సంస్థ ప్ర‌క‌టించింగా.. ఇప్పుడు మాత్రం హిల్ల‌రీ విగ్ర‌హంతో మాత్రం త‌మ‌కు సంబంధం లేద‌ని తేల్చిచెప్పింది. ట్రంప్ విగ్రహం పెట్టినప్పుడు ఎలాంటి వివాదం జరగలేదు కానీ...హిల్ల‌రీ విష‌యంలో మాత్రం అది వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులు కూడా విగ్ర‌హాన్ని వెంట‌నే అక్క‌డి నుంచి తొల‌గించేశారు. అయితే విగ్రహాన్ని పెట్టింది ఎవరనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు.  

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్ట్..

  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నిర్మలా దేవి  బార్కగావ్‌లో ఎన్టీపీసీ కోల్‌ బ్లాక్‌ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళ‌న‌కు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను జార్ఖండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎన్టీపీసీ కోసం ప్ర‌జ‌ల నుంచి భూసేకరణ చేస్తోన్న ప్ర‌భుత్వం వారికి పరిహారం చెల్లింపులో నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని కొన్ని రోజుల నుంచి నిర్మలాదేవి తన భర్త మాజీ మంత్రి కాంగ్రెస్‌ నేత యోగేంద్ర సౌతో క‌లిసి ఆందోళ‌న తెలుపుతున్నారు. దీంతో ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అవ్వడంతో.. పోలీసు ఆమె అరెస్టు చేశారు. ఆమెతో పాటు నిర‌స‌న‌లో పాల్గొన్న ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాకుమారుడికే మరణశిక్ష...

  ఓ హత్య కేసులో సౌదీ రాకుమారుడికి ఏకంగా ఉరిశిక్ష పడింది. సౌదీలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో, వాటిని ఎంత కఠినంగా అమలు చేస్తారో తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే రాజు కొడుకు అని కూడా చూడకుండా శిక్ష అమలు చేశారు. వివరాల ప్రకారం.. 2012లో రియాద్ శివారులో ఓ క్యాంప్‌లో జరిగిన ఘర్షణ సౌదీ రాకుమారుడు టుర్కీ బిన్ సౌద్ అల్ కబిర్.. అదెల్ అల్ మహెమిద్ అనే వ్యక్తిని తుపాకితో కాల్చి చంపాడు. దీనిపై విచారణ జరుపగా.. 2014లో అదెల్‌ను కబీర్ హత్య చేసినట్టు రుజువవ్వడంతో మరణ శిక్ష విధించింది. దీంతో ఈరోజు అతనికి మరణ శిక్ష అమలు చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ హోంశాఖ స్వయంగా వెల్లడించింది. మొత్తానికి తప్పు చేసినవారు ఎంతటి వారైనా.. శిక్ష తప్పదని రుజువు చేశాయి ఆ దేశ చట్టాలు.

నారా లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలు..

  నారా లోకేశ్ వరుసగా ఆరో ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఆస్తుల వివరాలు ప్రకటించదు అని అన్నారు. 1992లో హరిటేజ్ ప్రారంభించాం.. చిత్తూరు జిల్లా రైతుల కోసమే హరిటేజ్ ప్రారంభం.. దీని ద్వారా 20వేల మందికి ఉపాధి కల్సిస్తున్నాం..హరిటేజ్ ప్రస్తుత టర్నోవర్ రూ. 2500 కోట్లు అని వివరించారు. ఇంకా లోకేశ్ చెప్పిన ఆస్తుల వివరాలు...   * సీఎం చంద్రబాబు ఆస్తులు రూ.3.73 కోట్లు  అప్పులు రూ. 3.06 కోట్లు. మిగులు 64.04 లక్షలు * నారా భువనేశ్వరి ఆస్తులు రూ. 38.66 కోట్లు అప్పులు 13.82 కోట్లు మిగులు24.84 * నారా లోకేశ్ ఆస్తులు రూ. 14.5 కోట్లు అప్పులు 6.35 కోట్లు మిగులు 8.15 కోట్లు * బ్రహ్మణి ఆస్తులు రూ. 12.75 అప్పులు 65 లక్షలు  మిగులు 12.33 కోట్లు * నారా దేవాన్ష్ ఆస్తులు రూ. 11.32 కోట్లు

మరోసారి సాయిబాబాపై స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు

  షిర్డీ సాయిపై ద్వరకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాస్త్ర ప్రమాణాలు లేకుండా సాయిబాబాను ఎలా పూజిస్తారు..? కృష్ణుని స్థానంలో పిల్లనగ్రోవిని పట్టుకున్న సాయిని ఎలా కొలుస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సాయి విగ్రహాలు, ఫొటోలు పెట్టి హిందువులు ఆరాధిస్తున్నారు..సాయిని దేవునిగా పూజించడ శోచనీయం.. సనాతన హిందూ దర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. బావుద్దీన్ కొడుకు అయిన సాయి అసలు పేరు చాంద్ మియా.. సాయి బతికి ఉండగా అతను ఎవరో చాలా మందికి తెలియదు.. చనిపోయిన తరువాత ఆయన్నే దేవునిగా పూజిస్తున్నారు.. ప్రజలు విష్ణుమూర్తిని పూజించవచ్చు కానీ సాయిబాబాను కాదు అని చనిపోయిన వ్యక్తిని పూజించాడన్ని రామ్ చరిత్ మానస్ లో తప్పుబట్టారు. హిందూ బాలలకు పాఠశాలల్లో రామాయణం, గీత గురించి చెప్పాలి.. అప్పుడే మహిళలపై దాడులు తగ్గుతాయి..మమ్మల్ని విభేధించేవారు చర్చించవచ్చు కానీ.. మాతో గొడవలెందుకు అని అన్నారు. కాగా గతంలో ఆయన సాయిబాబాపై ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో సాయి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఆయ‌నపై విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

అమెరికా అధ్యక్ష బరిలో మూడో వ్యక్తి... క్లంప్..

అమెరికా అధ్యక్ష బరిలో ఇప్పటి వరకూ రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ మాత్రమే ఉన్నారని తెలుసు. అయితే ఇప్పుడు ఈ రేసులో మరో వ్యక్తి కూడా వచ్చి చేరారు. ఆ వ్యక్తి పేరు క్లంప్. అదేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ క్లంప్ ను సృష్టించింది వివాదాల వర్మ రాంగోపాల్ వర్మ. వచ్చే నెలలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీని గెలిపించాలా, లేక ట్రంప్‌ను గద్దె ఎక్కించాలా అన్న కన్ఫ్యూజన్ లో అమెరికన్లు ఉన్నారు.. వీరిద్దరికీ కాకుండా క్లంప్ కు ఓటేయ్యండి అంటూ ఆయన ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇంతకీ క్లంప్ ఎవరనుకుంటున్నారా.. ట్రంప్‌, హిల్లరీ ఫొటోలను కలిపి రూపొందించిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఎవరికి ఓటెయ్యాలా అని కంఫ్యూజ్‌ అవుతున్న అమెరికన్ల కోసం ట్విట్టరూన్‌ మరో అభ్యర్ధిని రూపొందించింది. అతనే క్లంప్‌. అంటే క్లింటన్‌, ట్రంప్‌ అన్నమాట’’ అంటూ ట్వీట్‌ చేశారు వర్మ.

నేషల్ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య..

  నేషల్ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ రోహిత్ భార్య లలిత నిన్న రాత్రి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే లలిత ఉరేసుకొనే ముందు రాసిన సూసైడ్ నోట్, రెండు గంటల వీడియోను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. క‌ట్నం కోసం రోహిత్ కుటుంబం త‌న‌ను వేధిస్తోంద‌ని, రోహిత్ త‌న‌ను విడిచి వెళ్లాల‌ని అన్నాడ‌ని ఆ వీడియోలో ల‌లిత చెప్పింది. త‌న భ‌ర్త ఢిల్లీలో లేని స‌మ‌యంలో త‌న‌ను ఒంటరిగా ఉండాల‌ని అత్త‌మామ‌లు ఒత్తిడి తెచ్చేవార‌ని.. రోహిత్ కూడా త‌న‌ను వ‌దిలి వెళ్లిపొమ్మ‌ని చెప్పాడ‌ని.. త‌న సంతోషం కోస‌మే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పింది. కాగా రోహిత్ ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో బెంగ‌ళూరు బుల్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వ‌హించేవాడు. 2009లో నేవీలో చేరిన రోహిత్‌.. అప్ప‌టి నుంచీ ముంబైలో ఉంటున్నాడు. మార్చిలో ల‌లిత‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ త‌ల్లిదండ్రులు పరారీలో ఉన్నారు.

కృష్ణా జలలాపై ట్ర్రిబ్యునల్ కీలక తీర్పు..

  కృష్ణా జలలాపై బ్రిజేష్ ట్ర్రిబ్యునల్ కీలక తీర్పు నిచ్చింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈరోజు విచార‌ణ జ‌రిపిన ట్ర్రిబ్యునల్ కృష్ణా న‌దీ నీటి పంప‌కాల‌పై  తీర్పును వెల్ల‌డించింది. ట్రిబ్యునల్ పరిథి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణ వరకే అని.. మహారాష్ట్ర, కర్ణాటకకు చోటు లేదని స్ఫష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలు ఇరు రాష్ట్రాలమధ్య పంపిణీ జరగాలని.. ప్రాజెక్టులు వారిగా కేటాయింపులు రెండు తెలుగు రాష్ట్రాలకే ఉండాలని సూచించింది. నాలుగు వారాల్లోపు ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, వాదనలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ డిసెంబరు 14 కు వాయిదా వేసింది.

విద్యార్ధులే లక్ష్యంగా అమెరికాలో కాల్పులు...

అమెరికాలో ఈమధ్య తరచూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి పలుమార్లు కాల్పులు జరిపిన దుండగులు ఇప్పుడు తాజాగా మరోసారి కాల్పులకు తెగబడ్డారు. విద్యార్దులే లక్ష్యంగా ఈదాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. అమెరికలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో... వేర్వేరు చోట్ల గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విచక్షణారహితంగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో కాల్పుల నుంచి కొంద‌రు విద్యార్థులు తప్పించుకున్నా.. నలుగురు విద్యార్థులకు తీవ్ర‌గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు సమాచారం. ఈ ఘ‌ట‌నపై అక్క‌డి అధికారులు మాట్లాడుతూ... ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట దుండ‌గులు ఈ చ‌ర్య‌లు పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. న‌ల్లటి ముసుగులు వేసుకొని ఉన్న‌ నలుగురు స్కూల్ విద్యార్థుల‌పై కాల్పులు జ‌రిపి, అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయిన‌ట్లు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు.

సల్మాన్ ను వీడని కష్టాలు.. కృష్ణజింకల కేసు సుప్రీంకోర్టుకు

  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు కృష్ణ జింక‌ను వేటాడిన కేసు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. అప్ప‌టి నుంచి స‌ల్మాన్ ఈ కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఈ కేసుపై రాజస్థాన్ హైకోర్టు ఆయనను నిర్దోషిగా చెబుతూ తీర్పు నిచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఆ ఘటన జరిగిన తరువాత కనిపించకుండా పోయిన సల్మాన్ జీపు డ్రైవర్ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చాడు. దీంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఈ కేసులో మ‌రోసారి స్పందించింది. ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స‌వాలు చేసింది. మరి ఇప్పుడు ఎన్నిసార్లు కోర్టు చుట్టూ తిరగాలో.

గిప్టులంటేనే భయపడుతున్న సిద్ధరామయ్య..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ఈ మధ్య బహుమతులు తీసుకోవడానికి తెగ భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే... గతంలో ఆయన పెట్టుకున్న రిస్ట్ వాచ్ వల్ల వివాదం అంతా ఇంతా కాదు. బీజేపీ నేతలైతే ఏకంగా దీనిని పెద్ద ఇష్యూనే చేశారు. అంతేకాదు ఈ విషయం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం వరకు వెళ్లింది. అయితే  ఏసీబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన దాన్నుంచి బయటపడ్డారు. పాపం ఆ అనుభవం వల్లనో ఏమో కానీ ఇప్పుడు సిద్దూ బహుమతులు తీసుకోవాలంటేనే కాస్త భయపడుతున్నారు.  ఆ తరువాతం వెండి విగ్రహం బహుమతిగా ఇస్తానన్నా వద్దన్నారు. ఇప్పుడు తాజాగా తన మంత్రివర్గ సహచరుడు, పశుసంవర్ధక మంత్రి ఏ.మంజు విధానసౌధలో సిద్ధరామయ్యకు గిఫ్ట్ ఇవ్వబోయారు.ఆయన మాత్రం ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా వద్దని చెప్పేశారు. గిఫ్ట్ బాక్స్ లో కేవలం సిల్క్ జుబ్బాలు మాత్రమే ఉన్నాయని మంజు చెప్పినప్పటికీ... అలాంటివి తాను ధరించనంటూ సున్నితంగా తిరస్కరించారు. పాపం మొత్తానికి సిద్దూ గిఫ్ట్స్ విషయంలో బాగానే భయపడ్డారు.

నా కూతురితో డేట్ చేసే వాడిని...

  ఇప్పటికే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ పై పలువురు మహిళలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇబ్బందుల్లో పడగా.. ఇప్పుడు మరో వివాదం ఆయన మెడకు చుట్టుకుంది. ఆదేంటంటే.. ట్రంప్ తన కూతురితో డేటింగ్ చేస్తానని చెప్పడం.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇవి.. అసలు సంగతేంటంటే.. "నేను మరో 20 ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే... నా కూతురితో కచ్చితంగా డేటింగ్ చేసేవాడిని" అంటూ 2008లో ట్రంప్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు బయటపడింది. ఇంకేముంది ఇంకా ట్రంప్ పై ఒకటే విమర్శల వర్షం. ఇక దీనిపై స్పందించిన ట్రంప్ కూతురు ఇవాంకా.. బాధ్యత గల మీడియా తండ్రీకూతుళ్ల గురించి అలా ప్రచారం చేయవచ్చా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తండ్రి అలా మాట్లాడం తప్పేనని, ఆ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ఇవాంక తెలిపింది. అయితే, ఆ వీడియో బయటకు వచ్చిన వెంటనే కుటుంబానికి, అమెరికన్లకు ఆయన క్షమాపణలు చెప్పారని, తన తండ్రి గురించి మీడియా కంటే తనకే ఎక్కువ తెలుసని, అందుకే తన తండ్రిని తాను అర్థం చేసుకోగలనని ఆమె అన్నారు.

దేనికైనా మేం సిద్దంగా ఉన్నాం..

  పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన నేపథ్యంలో పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగ బడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కాల్పులకు తెగబడిన నేపథ్యంలో దీనిపై స్పందించిన జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెప్టినెంట్‌ జనరల్‌ సతీష్‌ దువా పాకిస్థాన్‌ సైన్యం, ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యకు ఒడిగట్టినా.. దానిని ఎదుర్కోవడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాదు.. ఇది నిత్యం ఎదురయ్యేదైనా, వేరే తరహాదైనా ఎదుర్కొంటాం’ఎల్‌వోసీ మీదుగా భారీగా చొరబాటు ప్రయత్నాలు జరగుతున్నాయని, వాటిని చాలావరకు ఆర్మీ భగ్నం చేస్తున్నదని, ఎల్‌వోసీ మీదుగా తరచూ జరుగుతున్న ఎన్‌కౌంటర్లే ఇందుకు నిదర్శనం అని ఆయన చెప్పారు. చొరబాటు యత్నాలను భగ్నం చేస్తూ ఆర్మీ పలువురు మిలిటెంట్లను హతమార్చిందని, ఇది ఆర్మీ సన్నద్ధతను చాటుతోందని ఆయన చెప్పారు.

కావేరి నీరు.. మళ్లీ మొట్టికాయలు తిన్న కర్ణాటక

తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి నీటి వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మళ్లీ కర్ణాటక ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాల్సిందేనని మరోసారి ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రోజుకు రెండు క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కావేరి అంశంపై ఇరు రాష్ర్టాలు శాంతి, సామరస్యం నెలకొనేలా చూడాలని ఆదేశించింది. కాగా, కావేరీకి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రెండో రోజు కూడా తమిళనాడులో ప్రతిపక్షాలు రైలు రోకో కార్యక్రమం చేపట్టాయి. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ.. కోర్టులో ఊరట..

  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై నకిలీ డిగ్రీ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు ఈ వ్యవహారంలో కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి బిఎ డిగ్రీని పూర్తి చేసిన‌ట్లు స్మృతి ఇరానీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని.. డిగ్రీ చ‌ద‌వ‌కుండానే త‌ప్పుడు అఫిడ‌విట్ దాఖ‌లు చేశార‌ని ప్ర‌తిప‌క్షాలు విమర్శలు చేయడమే కాదు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిపై ఈ రోజు న్యూఢిల్లీలోని ప‌టియాలా హౌజ్ కోర్టు విచారించింది. ఈ కేసులో ఆమెకు సమన్లు జారీ చేసేందుకు నిరాకరించింది.