పాకిస్థాన్ కు సమాచారం అందించిన డీఎస్పీ సస్పెండ్..
posted on Oct 14, 2016 @ 10:55AM
పాకిస్థాన్ కు సమాచారం అందజేస్తున్నారన్న కారణంగా ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు. తన్వీర్ అహ్మద్ అనే డీఎస్‌పీ తన వాట్సప్ ద్వారా పాకిస్థాన్ ఇంటలిజెన్స్‌కు భద్రతా సమాచారం చేరవేస్తున్నాడన్న కారణంతో డీఎస్‌పీని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇక దీనిపై తన్వీర్ అహ్మద్ స్పందిస్తూ.. నెలక్రితం కంట్రోల్ రూం ఫోన్ నుంచి ఆర్మీ కమాండర్‌గా చెబుతూ తనకు ఓ కాల్ వచ్చిందని.. ఫోన్‌చేసిన వ్యక్తి కశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసు, పారా మిలటరీ సిబ్బంది వివరాలను తెలపాల్సిందిగా ఆదేశించాడు. అందుకే సమాచారం చెప్పానని.. ఈ వివరాలు అతనితో చెప్పేముందు ఎస్పీ అనుమతి సైతం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలకు ఇంటలిజెన్సీ అధికారులు స్పందిస్తూ.. తిరుగుబాటు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులకు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తులు సాధారణంగా ఇతర సెక్యూరీటీ ఏజెన్సీకి చెందిన అధికారులుగా పేర్కొంటూ భద్రతా సమాచారం అడుగుతుంటారు. ఏదేమైనప్పటికీ విధుల్లో ఉన్న అధికారులు అటువంటి సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. కానీ అహ్మద్ మాత్రం సమాచారం అందించారు అని తెలిపారు. అందుకే ఆయన్ని విధుల నుండి సస్పెండ్ చేశాం.. ఇకముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపారు.