ఆప్ కు మరో ఎదురుదెబ్బ.... ఎమ్మెల్యే అరెస్ట్

  ఆప్ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు వరుసపెట్టి అరెస్ట్ అవుతున్నరు. ఇప్పటివరకూ చాలా మంది ఎమ్మెల్యేలు పలు కేసుల్లో అరెస్ట్ అవ్వగా.. ఇప్పుడు తాజాగా గులాబ్‌సింగ్‌ కూడా ఆ జాబితాలో చేరారు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఎమ్మె ల్యే, గుజరాత్ ఇన్‌చార్జీ గులాబ్‌సింగ్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్ వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం సూరత్ కమిషనర్ సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఉమ్రా పోలీస్ స్టేషన్ సమీపంలో ఎమ్మెల్యే గులాబ్‌సింగ్‌తో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఢిల్లీ పోలీసులు సూరత్ వచ్చి అరెస్ట్ చేసినట్లు కమిషనర్ సతీష్‌కుమార్ తెలిపారు.

ట్రంప్ ఆఫీస్ పై బాంబు దాడి..

  ఇప్పటికే అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వం వస్తున్న ఆరోపణలు పెద్ద దుమారం రేపుతుంటే..ఇప్పుడు ఆయన కార్యాలయంపై బాంబు దాడి జరగడంతో కలకలం ఏర్పడింది.  ఉత్తర కరోలినా ప్రాంతంలో ఉన్న ట్రంప్ కార్యాలయంలో గుర్తు తెలియని కొంతమంది దుండగులు బాంబు దాడి జరిపారు. కార్యాలయం కిటికీ గుండా లోపలకు బాంబులు విసిరారని.. ఈ పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నిచర్ తో పాటు, ఎన్నికల ప్రచార సామాగ్రి కూడా కాలిబూడిదైందని  పోలీసులు తెలిపారు. ఇక దీనిపై స్పందించిన పార్టీ నేతలు... కరోలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని.. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందనే అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని... ఈ ఘటనను తాము ఎన్నటికీ మరిచిపోమని తెలిపింది. దీనికి 'రాజకీయ ఉగ్రవాదంగా' అభివర్ణించింది. కాగా మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఘటన జరగడం అమెరికాలో కలకలం రేపింది.

కాంగ్రెస్ కు మరో షాక్...

  ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నసంగతి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది పార్టీ ఫిరాయింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం యూపీ పీసీసీ అధ్యక్షుడు నిర్మల్ ఖాత్రి తన పదవికి రాజీనామా చేసి షాకివ్వగా.. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత రీటా బహుగుణ జోషి పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయన త్వరలోనే బీజేపీ పార్టీలో చేరుతున్న్టట్టు సమాచారం. ముందు ఆమె  సమాజ్వాదీ పార్టీలో చేరతారన్న వార్తలు వచ్చాయి. అయితే ఆమె మాత్రం బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా రీటా బహుగుణ గతంలో  యూపీసీసీ చీఫ్గా పని చేశారు. ప్రస్తుతం రీటా బహుగుణ లక్నో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తమిళనాట రైలు రోకో.. వెంటనే కావేరి నీరు విడుదల చేయండి..

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి నీటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళనాడుకు కావేరి నీటిని ఇప్పుడప్పుడే విడుదల చేసేది లేదని కర్ణాటక ప్రభుత్వం చెప్పినా.. దానికి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆఖరికి నీటిని విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి ఈ నీటి వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడుకు కావేరి జలాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ డీఎంకే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైలురోకో చేపట్టింది. డీఎంకే విపక్ష నేత స్టాలిన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో పట్టాలపైకి చేరి రైళ్లను అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వాటిని ధిక్కరిస్తున్న కర్ణాటక ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించిన స్టాలిన్, వెంటనే నీటిని విడుదల చేసి తమిళవాసుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. దాదాపు 200 వరకూ రైల్వే స్టేషన్లను డీఎంకే కార్యకర్తలు ముట్టడించినట్టు తెలుస్తోంది. 48 గంటల రైల్ రోకో తమిళనాడులో ప్రారంభం కావడంతో, ఈ ఉదయం పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఈ రైలు రోకోకి  ప్రతిపక్షం డీఎంకేతో పాటు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, డీఎండీకేలతో పాటు వర్తక, వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ఉరీ దాడి.. ఉగ్రవాదులు ఎలా వచ్చారంటే..?

పాకిస్థాన్ ఉగ్రవాదులు ఉరీ సెక్టారులో దాడి జరిపి పలువురు సైనికులను హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అసలు దాడి జరపడానికి ముష్కరులు అంత ఈజీగా ఎలా ప్రవేశించారన్నది ఆర్మీ విచారణలో తెలిసింది. ఉగ్రవాదులు నిచ్చెన సహాయంతో భారత్ లోకి ప్రవేశించారట. ఎలా అంటే.. పీవోకేలోని సలామాబాద్ నియంత్రణ రేఖ వద్ద కంచె తెగిపోయి చిన్న సందు ఉంది. అక్కడకు నలుగురు ఉగ్రవాదులకు తోడు ఇద్దరు మార్గదర్శకులు రెండు నిచ్చెనలతో అక్కడికి చేరుకున్నారు. అందులో ఓ ఉగ్రవాది ముందుగా ఆ సందుగుండా లోపలికి ప్రవేశించి కంచెకు ఈవలివైపు ఒక నిచ్చెన వేశాడు. అటువైపున ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు మరో నిచ్చెనను కంచెకు ఆనించి వంతెనలా మార్చారు. ఇక అలా వారు భారత్ భూభాగంలోకి ప్రవేశించగానే వారి వెంట వచ్చిన ఇద్దరు నిచ్చెనలను తీసుకెళ్లిపోయారని సైన్యం అంతర్గత నివేదికలో పేర్కొంది. అంతేకాదు వీరు సరిహద్దుల నుంచి గొహల్లన్ లేదా జబ్లా గ్రామాలకు వీరు సెప్టెంబర్ 16 లేదా 17న చేరుకుని ఉంటారని.. ఒక రోజు ఆశ్రయం పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ మరసటి రోజు అదనుచూసి సైనికులపై దాడి చేశారని తెలిపారు. కాగా కాశ్మీర్‌లోని ఉరిలో సెప్టెంబరు 18న ఉగ్రవాదులు దాడికి పాల్పడి 19మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసందే.

సిరియా వైమానిక దాడుల్లో 31 మంది మృతి

సిరియాలో ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా సహకారంతో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు సిరియా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో రోజూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో ఎప్పుడూ ఏదో ఒక దాడులతో సిరియా అట్టుడుకుతోంది. తాజాగా సిరియాలో తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు జరిపారు.  సిరియాలోని అలెప్పోలోని తిరుగుబాటుదారులు అధికంగా ఉన్న ప్రాంతాలు ఖ్వాటెర్జీ, సుక్కరీ, బాబ్ ఆల్-నాజర్ లో వైమానిక దాడులు జరపగా.. ఈ దాడుల్లో  31 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ వెల్లడించింది.

కష్టాల్లో కివీస్... భారత్ ముందు స్వల్ప లక్ష్యం..

  భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్ సిరీస్లో ఓడిపోయిన కివీస్ జట్టు ఇప్పుడు గెలవడానికి బాగానే కష్టపడుతోంది. అయితే న్యూజిలాండ్ జట్టుకు భారత సిరీస్ అస్సలు కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. ప్రతి జట్టును మట్టికరిపించడంలో కివీస్ ఆటగాళ్లను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి కివీస్ జట్టు భారత్ తో సిరీస్ ప్రారంభం నుంచి ఏమాత్రం ఆటరానట్టు ఆడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ పెవిలియన్ కు చేరకుంటున్నారు.  టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. న్యూజిలాండ్ 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఓపెనర్ టామ్ లాధమ్(79 నాటౌట్;98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. కివీస్ వికెట్లు పడుతున్నా ఓపెనర్ గా వచ్చిన లాధమ్ మాత్రం పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇక 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన టిమ్ సౌతీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు ఊపిరులూదాడు.  టామ్ లాధమ్ తో కలిసి 71 పరుగులు భాగస్వామ్యాన్ని అందించాడు. మొత్తానికి 43.5 ఓవర్లలో 190 పరుగులు చేసి కివీస్ టీమ్ ఆలౌటైంది. కేవలం 191 పరుగులతో స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.

ఢిల్లీపై పెను దాడి కుట్ర భగ్నం...9 మంది నక్సలైట్లు అరెస్ట్

  భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో ఎప్పుడు పాక్ ఎప్పుడు ఉగ్రదాడి జరుపుతుందా అని దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఢిల్లీపై పెను దాడి జరిపి విధ్వంసం సృష్టించాలన్న కుట్రను భగ్నం చేశారు. యూపీకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, తమకున్న సమాచారంతో ఢిల్లీపై దాడి జరిపి 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇది ఉగ్రవాదులు పన్నిక కుట్ర కాదు... నక్సలైట్లు పన్నిన కుట్ర. నోయిడాలోని రెసిడెన్షియల్ ప్రాంతంగా నిత్యమూ బిజీగా ఉండే హిండాన్ విహార్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాగున్న నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్నామని, వీరిలో పీపుల్స్ వార్ గ్రూప్ కమాండర్ ప్రదీప్ కుమార్ సింగ్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 6 పిస్టల్స్, 50 క్యాట్రిడ్జ్ లు, 45 జిలిటన్ స్టిక్స్, 125 డిటోనేటర్లు, 13 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్...ఇప్పుడేం చేద్దాం..

  పశ్చిమ గోదావరి జిల్లాలో  మెగా ఆక్వాఫుడ్‌ ఫ్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన పవన్ కూడా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించాలని.. ఇంత జరుగుతున్నా నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు వ్యవహారం పవన్ వరకూ వెళ్లడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. అందుబాటులోని మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ ఈ సమావేశానికి రాగా, వివాదాస్పదమైన ఆక్వా ఫుడ్ పార్క్ వాస్తవ పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ ఏం చెప్పాడని అడిగి తెలుసుకున్న సీఎం, మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, భూములు కోల్పోయే రైతులకు ఆకర్షణీయమైన ప్యాకేజీని తయారు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.

పాక్ కు యుద్ద విమానాలు అందించడం లేదు.. రష్యా

  పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని అగ్రదేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదపై ఉక్కుపాదం మోపాలని.. ఉగ్రవాద సంస్థల్ని నిర్మూలించాలని ఎన్నిసార్లు చెప్పినా పాక్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో రష్యా ఓ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ మిలటరీ అవసరాలను తీర్చేలా ఏ విధమైన విమానాలను, చాపర్లను అందించడం లేదని రష్యా స్పష్టం చేసింది. ఇటీవల తాము కుదుర్చుకున్న డీల్ లో భాగంగా, రవాణా అవసరాలను మాత్రమే తీర్చేందుకు హెలికాప్టర్లను పాక్ కు అందించనున్నట్టు రోజ్ టెక్ కార్పొరేషన్ సీఈఓ సెర్గి చిమెజోవ్ వెల్లడించారు. సైన్యం అవసరాలకు వినియోగించుకునే ఏ విధమైన డీల్స్ పై రష్యా ఇంతవరకూ సంతకాలు పెట్టలేదని అన్నారు.

హిల్లరీ పై ట్రంప్ విమర్శలు... ఆమె డ్రగ్స్ వాడిందేమో...

   అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లిక్‌న పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ పై విమర్సలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. పలువురు మహిళలు ఆయనపై పలు ఆరోపణలు చేశారు. వారితో పాటు హిల్లరీ కూడా ట్రంప్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను కూడా ట్రంప్ బాధితురాలినే అని చెప్పింది. అయితే ఇప్పుడు హిల్లరీ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు జరిగే ప్రెసిడెన్షియల్ డిబేట్ లో హిల్లరీ మంచి మార్కులు సంపాదించిన సంగతి తెలిసిందే. దీనిపైనే ట్రంప్ స్పందిస్తూ.. బిగ్‌డిబేట్‌-2 సమయంలో అత్యుత్సాహంగా ఉండటాన్ని తప్పుట్టారు. తాను డిబేట్ ముందు డ్రగ్స్ వాడిందేమో అంటూ విమర్శించారు. బిగ్‌డిబేట్‌-3కు ముందు తామిద్దరికీ మాదకద్రవ్యాల పరీక్ష నిర్వహించాలని.. డిమాండ్‌ చేశారు. అంతేకాదు ఈసారి అధ్యక్ష ఎన్నికలు రిగ్గింగ్‌ వ్యవహారాన్ని తలపిస్తున్నాయని పేర్కొన్నారు.

అఖిలేష్ కు తండ్రి షాక్.. బాబాయి మద్దతు

  వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ కసరత్తు చేస్తుంటే మరోపక్క ములాయం సింగ్ కుటుంబ రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గత కొద్ది కాలంగా వీరి కుటుంబంలో రాజకీయ విభేధాలు ఏర్పడ్డ సంగతి తెలసిందే. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, సీఎం అయిన అఖిలేష్ యాదవ్ కు, అతని బాబాయి కి మధ్య ఏర్పడిన విభేధాల వల్ల ఇప్పుడు ములాయంకు, అఖిలేష్ కు మధ్య దూరం పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ములాయం మరో సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. సమాజ్ వాదీ పార్టీ తిరిగి విజయం సాధిస్తే, సీఎం పదవికి అఖిలేష్ పేరును తాను స్వయంగా ప్రతిపాదిస్తానని తెలిపారు. తండ్రి ఇచ్చిన షాక్ లో ఉన్న అఖిలేష్ కు శివపాల్ మద్దతు పలకడం గమనార్హం.

మేం రెడీగా ఉన్నాం.. భారత్ రెడీగా ఉందా.. పాక్ ప్రధాని

  భారత్-పాక్ మధ్య చర్చలు జరిగే సమయం దగ్గరపడుతున్నాయి అనుకున్న నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులు పఠాన్ కోట్ పై దాడి జరిపారు. దీంతో చర్చలు కాస్త వాయిదా పడ్డాయి. అప్పటి నుండి చర్చలు జరగనేలేదు. ఇక ఇప్పుడు వాటికి తోడు ఉరీ దాడి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ దాడులు. ఈ నేపథ్యంలో ఇకపై భవిష్యత్తులో కూడా ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్, బాకులో ఉన్న పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడాతూ.. భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నాం.. భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని షరీష్ తెలిపారు. కశ్మీర్లో కొనసాగుతున్న హింస, ఇతర ముఖ్య సమస్యలపై చర్చించాలని పాక్ పలు పర్యాయాలు భారత్ కు ఆహ్వానం పంపినా ప్రయోజనం లేకపోయిందన్నారు.

ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పవన్ ను కలిసిన రైతులు.. నేతలు ఏం చేస్తున్నారు.

  పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ  పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన పలువురు రైతులు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుంతేరు కాలువపై ఆధారపడి 2 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని..ఆక్వాఫుడ్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని వారు ఆరోపించారు. రైతుల సంతకాల ఫోర్జరీ చేసి, పరిశ్రమకు గ్రామీణులు అనుకూలమని ప్రభుత్వం ప్రకటించిందని వారు విమర్శించారు. ఆ తరువాత తాము అభ్యంతరం చెప్పడంతో యువకులపై పెద్దపెద్ద సెక్షన్లతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, రైతులు అన్ని పార్టీల నేతల వద్దకు తిరిగినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.   ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్నం పెట్టేది ఉభయ గోదావరి జిల్లాలే.. సమస్యలు చెప్పుకునే అవకాశం బాధితులకు ఇవ్వాలి..ఇంత గొడవ జరుగుతున్నా నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. పార్క్ ఏర్పాటుపై యాజమాన్యం మరోసారి ఆలోచించాలి.. నేను పారిశ్రామికి ప్రగతికి అనుకూలమే.. కానీ పంటలకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో మాత్రమే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.. పార్క్ వల్ల జీవనదులు కలుషితమవుతున్నాయి అని అన్నారు. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడే కులపోరాటాలే మొదలవుతాయి..  ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే  ఇదో నందిగ్రామ్ అవుతుంది..ఒక చిన్న ఊరిలో 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు.

మరోసారి పాక్ కు అమెరికా హెచ్చరిక..

  ఉగ్రవాదాన్ని అరికట్టాలని పాకిస్ఠాన్ ను అగ్రరాజ్యం అమెరికా గత కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి అమెరికా, పాక్ ను హెచ్చరిస్తుంది. అమెరికా విదేశాంగ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్‌ టోనర్‌ పాకిస్థాన్ ఉగ్రవాదంపై మాట్లాడుతూ.. తన భూభాగాన్ని స్వర్గధామంగా మార్చుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులందరినీ ఏరిపారేయాల్సిందేనని.. ఉగ్రవాద గ్రూపులన్నింటినీ అక్రమమైనవిగా గుర్తించి.. నిర్మూలించాలని సూచించారు. 'పాకిస్థాన్‌ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నింటిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని మేం ఆ దేశాన్ని కోరుతూనే ఉన్నాం' అని తెలిపారు. ఉగ్రవాదులు, హింసాత్మక అతివాదుల కారణంగా పాకిస్థానే ఎక్కువగా నష్టపోయిందని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాద ముప్పుపై పోరాటంలో పాకిస్థాన్‌కు తాము సాయం అందిస్తామని అన్నారు.

ర‌ష్యా, భార‌త్‌ మధ్య 10 కీల‌క ఒప్పందాలు..

  గోవా వేదికగా జరిగే బ్రిక్స్ సమావైశాల భాగంగా భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో వీరిద్దరూ ర‌ష్యా, భార‌త్‌ ద్వైపాక్షిక అంశాల‌పై చర్చలు జ‌రిపారు. ఈ చర్చలో రెండు దేశాల మధ్య 10 కీల‌క ఒప్పందాలు కుదిరినట్టు తెలుస్తోంది. 10 కీల‌క ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. అంతేకాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, రష్యా మధ్య కూడా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. ఏపీలో ర‌వాణా, నౌక నిర్మాణ రంగాల‌పై అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది. ఏపీ త‌ర‌ఫున ర‌ష్యాతో అవ‌గాహ‌న ఒప్పందంపై ఏపీ అధికారి జాస్తి కృష్ణ సంత‌కం చేశారు.  నాగ‌పూర్- సికింద్రాబాద్ మ‌ధ్య హై స్పీడ్ రైళ్ల‌పై ర‌ష్యాతో ఒప్పందం కుదిరింది. భారత్ లో ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల అభివృద్ధిలో ర‌ష్యా స‌హ‌కారం అందించనుంది.