పార్లమెంటరీ ఎంపీలకు సర్జికల్ దాడుల వివరాలు.. మరోసారి కూడా
posted on Oct 15, 2016 @ 10:56AM
భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి సర్జికల్ దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల గురించి పాక్ స్పందిస్తూ అసలు మా దేశంలో అలాంటి దాడులే జరగలేదని చెప్పుకొచ్చింది. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాక్ తో పాటు మన దేశ నాయకులు కూడా ఈ దాడుల గురించి సాక్ష్యాలు బయటపెట్టమని చెప్పడం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు. వారితో పాటు ఇంకా పలువురు నేతలు కూడా సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని ఎంపీలకు.. తొలిసారిగా కమాండో ఆపరేషన్ వివరాలు తెలిపారు. ఆపరేషన్ జరిగిన తీరు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలకు జరిగిన నష్టం తదితర వివరాలను క్షుణ్ణంగా తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం దాడులకు దిగినట్టు వివరించారు. అవసరమైతే మరోసారి కూడా సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగుతామని భారత డీజీఎంవో పాకిస్థాన్ డీజీఎంవోకు స్పష్టం చేసినట్టు రావత్ తెలిపారు. కాగా రావత్ చెప్పిన విషయాలతో పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని చాలామంది సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.