జేఎన్యూ దసరా సంబరాలు... మోడీ దిష్టిబొమ్మ దహనం....
posted on Oct 14, 2016 @ 4:19PM
గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న జేఎన్యూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ బొమ్మనే దహనం చేసి పెద్ద దుమారానికే తెర తీసింది. జేఎన్యూ లోని కొంత మంది విద్యార్ధులు దసరా ఉత్సవాల సందర్భంగా రావణ దహనం చేశారు. అయితే అసలు సమస్య ఏంటంటే.. దహనం కోసం సిద్ధం చేసిన దిష్టిబొమ్మకు మోదీ, అమిత్ షా ఫొటోలను అతికించి తగులబెట్టారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై వీసీ విచారణకు ఆదేశించారు. కొందరు విద్యార్థులు రావణ బొమ్మకు మోదీ, అమిత్ షాతోపాటు మోగా గురువు రాందేవ్ బాబా, సాధ్వి ప్రగ్యా, నాథురామ్ గాడ్సే, అసరాం బాపు, జేఎన్‌యూ వీసీ జగదీశ్ కుమార్ ఫొటోలను అతికించి దహనం చేశారు. దీనిపై ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు సన్నీ దిమాన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను, దేశంలోని విద్యా సంస్థలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలోను కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని, అందుకే ఈ ఘటనకు పాల్పడ్డామని చెప్పారు. అంతేకాదు విద్యార్థులపై చర్యలు తీసుకుంటే దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.