ఉక్కు మహిళ షర్మీళ కొత్త పార్టీ వచ్చేసింది..

  సైనిక దళాల ప్రత్యేక అధికారాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇరోమ్ షర్మిల 16 సంవత్సరాలుగా ఆమరణ నిరాహారదీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాల నుండి దీక్ష చేస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇటీవలే ఆమె దీక్ష విరమించిన సంగతి కూడా విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని.. వచ్చే ఏడాది ఎన్నికల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దానిపేరు 'పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్'. వచ్చే సంవత్సరం మణిపూర్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఈ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా ఒక మార్పును తీసుకొస్తామని, ఏఎఫ్ఎస్‌పీఏ లాంటి చట్టాలు ఇకమీదట సామాన్యులను ఇబ్బంది పెట్టలేవని పార్టీ ప్రకటన సందర్భంగా ఆమె అన్నారు. మరి ఆమె ఎంతవరకూ విజయం సాధిస్తారో చూద్దాం..

మళ్లీ తెరపైకి దానం... కాంగ్రెస్ లోనే

  తెలంగాణ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ గతంలో పార్టీ మార్పుపై పలు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న దానం మరోసారి తెరపైకి వచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలనే సంయమనం పాటిస్తున్నామని దానం వ్యాఖ్యానించారు. తనకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని ఆయన చెప్పుకొచ్చారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

హిమాచల్ ప్రదేశ్‌లో మోదీ పర్యటన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక చాపర్‌లో హిమాచల్ ప్రదేశ్‌ లోని మండి జిల్లా చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మూడు పవర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. కొల్డామ్‌, పార్వతీ రెండో దశ ప్రాజెక్టు, రాంపూర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ మూడు విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఆయన మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. కాగా  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు... అది ఖాయం...

  వివాదాస్పద వాఖ్యలు చేయడంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ దిట్ట అని మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన ఎన్నికలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రత్యర్థిపార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడనున్నాయని.. రిగ్గింగ్ వ్యవహారంలో వైట్ హౌస్ కు కూడా ప్రమేయం ఉందని.. ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని..  ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి కుత్సిత చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. అంతేకాదు మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలపై స్పందిస్తూ.. ఎన్నికల ముందు వీడియోలు బయటపెట్టి తనకు దక్కాల్సిన మహిళా ఓట్లను దక్కకుండా చేశాయని ట్రంప్ వాపోయారు. మరి మన దేశంలో రిగ్గింగ్ లు జరిగే అవకాశం ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా రిగ్గింగులు జరుగుతాయంటే ఆశ్చర్యపడాల్సిన విషయమే. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..

దీపా కర్మాకర్ కోసం రోడ్లు..

  రియో ఒలింపిక్స్ లో జిమ్మాస్టిక్స్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన దీపా కర్మాకర్ కు క్రికెట్ లెజెండ్ చేతులు మీదగా బీఎండబ్యూ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈకారును ఆమె వెనక్కి ఇచ్చేద్దామని అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈవార్తలకు స్పందించిన దీపా.. ఎట్టి పరిస్థితిలో సచిన్ ఇచ్చిన కారు వెనక్కి ఇచ్చేది లేదని.. అయితే అగర్తలలో రోడ్లు సరిగా లేవని... వీటిపై ఇంత ఖ‌రీదైన కారును న‌డ‌ప‌టం సాధ్యం కాదంటూ చెప్పింది. దీంతో ఇది త‌మ రాష్ట్రానికి మ‌చ్చ తెచ్చే ప‌ని అని భావించిన అక్క‌డి ప్ర‌భుత్వం వెంట‌నే రంగంలోకి దిగింది. దీపా క‌ర్మాక‌ర్ ఇంటి ద‌గ్గ‌ర‌, స‌మీపంలోని కొన్ని రోడ్లును బాగుచేస్తున్నామ‌ని పబ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్ సోమేష్ చంద్రదాస్ వెల్ల‌డించారు. మరికొంతమంది మంత్రులు, సీపీఎం నేత‌లు మాత్రం దీపా కర్మాకర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ‌ర్త‌ల‌లోని రోడ్ల గురించి మాట్లాడి రాష్ట్రానికి చెడ్డ‌పేరు తెచ్చార‌ని వాళ్లు విమ‌ర్శించారు. త్రిపుర‌లో ఎన్నో ఖ‌రీదైన కార్లు తిరుగుతున్నాయ‌ని, దీపా కుటుంబం మాత్రం కారును వెనక్కి ఇచ్చేయాల‌న్న నిర్ణ‌యం ఎందుకు తీసుకుందో అర్థం కావ‌డం లేద‌ని రాష్ట్ర రోడ్లు, ర‌వాణా శాఖ మంత్రి బాద‌ల్ చౌద‌రి అన్నారు.

పార్లమెంట్లో రేప్.. ఎంపీ తరపు వ్యక్తి..

  మహిళలపై అత్యాచారాలు జరగడం.. వారిని చంపండం వంటి ఘటనలు వింటూనే ఉంటాం. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లోనే మహిళను అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. అయితే ఇది మన దేశంలో కాదులెండి.. బ్రిటన్ పార్లమెంట్లో. బ్రిటన్ పార్లమెంటులో ఓ మహిళపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్సువల్ అఫెన్సెస్ డిటెక్టివ్ లు, అత్యాచార నిరోధక అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అతనికి బెయిల్ లభించింది. కోర్టులో తదుపరి విచారణ 2017 జనవరిలో జరుగనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కాదని... కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ ఎంపీ తరపున అతను పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా జరిగిన ఘటనపై విచారణకు సంబంధించి పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని పార్లమెంట్ స్పోక్స్ పర్సన్ తెలిపారు.

అమ్మ నోరు తెరిచింది.. డాక్టర్లందరికీ థ్యాంక్స్..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని గత కొద్ది రోజుగా అంటూనే ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం గురించి బులిటెన్లు ఏం విడుదల చేయకపోయినా ఆరోగ్యం పరిస్థితి పై అప్పుడప్పుడు వైద్యులు కాని.. పార్టీ నేతలు కానీ చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి మరికొన్ని అప్ డేట్స్ చెబుతున్నారు. ఆమె మంచినీరు తాగుతున్నారని, ఉడకబెట్టిన యాపిల్ పళ్లు తింటున్నారని వైద్యులు వివరించారు. అంతేకాదు తనకు ఇంతకాలం పాటు చికిత్సను అందించిన వైద్యులకు ఆమె పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారని డాక్టర్లు వివరించారు. లండన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బీలే నిన్న సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు ఆమె వద్దే ఉండి, కోలుకుంటున్న తీరును పరిశీలించారని.. సింగపూర్ వైద్య నిపుణులు ఆమెకు ఫిజియో థెరపీ చేయిస్తున్నారని తెలిపారు.

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన..

  పాక్ ఇప్పటికి అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమించింది. ఓ వైపు భారత్ దీనిపై ఆరోపిస్తున్నా.. పాక్ మాత్రం ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి భారత సైనిక స్థావరాలపై పాక్ కాల్పులకు తెగబడింది. రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలపై పాక్ ఆర్మీ సోమవారం రాత్రి కాల్పులు జరిపింది. రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైన కాల్పులు అర్ధరాత్రి 1:30 గంటల వరకు కొనసాగినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 82 ఎంఎం మోర్టార్లు, ఆటోమెటిక్స్ ఉపయోగించి పాక్ దళాలు కాల్పులు జరిపినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.... 23 మంది సజీవదహనం

  ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్పొరేట్ ఆస్పత్రి లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం..ఒడిశా రాజధాని అయిన భువనేశ్లర్లోని అతిపెద్ద ఆస్పత్రి అయిన ఎస్‌యూఎంలోని మంటలు చెలరేగాయి. తొలుత డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగగా.. అవి వెంటనే ఐసీయూకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో  23 మంది సజీవ దహనమవ్వగా.. వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  సమాచారం అందుకున్న వెంటనే వందమంది అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఆస్పత్రిలోని ఇతర వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. బ్రోంటో స్కైలిఫ్ట్‌లను ఉపయోగించి పై అంతస్తుల్లో ద్వారాలు, కిటికీలు బద్దలుగొట్టి అక్కడ చిక్కుకుపోయిన రోగులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పాక్ కు ధీటైన సమాధానం చెబుతోంది...

  భారత్ సరిహద్దులో పాక్ పదే పదే కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన  రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నా.. వాళ్లకు భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోందని అన్నారు. గత ఐదారేళ్లుగా వందల సంఖ్యలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయితే.. ఇప్పుడు వాళ్లు ఎన్నిసర్లు వచ్చినా మళ్లీ అన్నిసార్లు మనం గట్టి జవాబు ఇస్తున్నామని ఆయన అన్నారు. కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరీ సెక్టార్‌లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన సుదీష్ కుమార్ (24) అనే సిపాయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందిచారు.

బీసీసీఐకి కోర్టులో ఊరట...

  లోథా కమిటీ సిఫార్సులను బీసీసీఐ పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు ఇప్పటివరకూ పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాస్త బీసీసీఐకి కోర్టులో ఊరట లభించినట్టు కనిపిస్తోంది. లోథా ప్యానెల్ సిఫారసుల అమలుపై కోర్టులో వాదనలు జరగగా.. లోధా ప్యానెల్ సిఫార‌సుల‌ను అమ‌లు చేయ‌డానికి త‌మ‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని.. వీటి అమ‌లుకు త‌మ రాష్ట్ర సంఘాల‌న్నింటినీ ఒప్పించ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని బోర్డు కోరింది. దీనికి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మ‌న్నించి.. ప్ర‌స్తుతానికి కోర్టు త‌మ‌ తీర్పు వెలువ‌రించ‌లేదు. అయితే కాంట్రాక్టులు, టెండ‌ర్లు వంటి ఆర్థిక విష‌యాల్లో బోర్డు అధికారాల‌కు క‌త్తెర వేయాల‌ని మాత్రం కోర్టు భావిస్తోంది. కాగా అక్టోబ‌ర్ 7న చివ‌రిసారి దీనిపై వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. సిఫార‌సులు అమలు చేయ‌నంత వ‌ర‌కు రాష్ట్ర సంఘాల‌కు నిధులు విడుద‌ల చేయొద్ద‌ని బీసీసీఐని ఆదేశించిన విష‌యం తెలిసిందే.

పాకిస్థాన్ ను మరోసారి వెనకేసుకొచ్చిన చైనా..పాక్ త్యాగాలను గుర్తించాలి..

  మన పొరుగు దేశమైన పాకిస్థాన్ మనం తిట్టడం కామన్.. దానికి చైనా వెనకేసుకురావడం ఇంకా కామన్. ఇప్పటి వరకూ పలు సందర్భాలల్లో ఇది నిజమని తేలింది. ఇప్పుడు మరోసారి అది నిజం చేసింది చైనా.. గోవాలో బ్రిక్స్ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో మోడీ ప్రధాని పాకిస్థాన్ ఉగ్రవాదంపై విమర్శలు చేశారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదానికి త‌ల్లిలాంటిద‌ని అన్నారు. దీనిపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి హువా చున్యింగ్‌.. ఏదో ఒక దేశాన్ని లేదా మ‌తాన్ని ఉగ్ర‌వాదంతో ముడిపెట్ట‌డాన్ని తాము వ్య‌తిరేకిస్తామ‌ని.. కౌంట‌ర్ టెర్ర‌రిజంలోనూ చైనా వైఖ‌రి మార‌లేద‌ని ఆమె స్ప‌ష్టంచేశారు. ఏ రూపంలోని ఉగ్ర‌వాదాన్నైనా మేం వ్య‌తిరేకిస్తాం. అన్ని దేశాల్లో సుస్థిర‌త‌, భ‌ద్ర‌త కోసం అంత‌ర్జాతీయ స‌మాజం క‌లిసి ప‌నిచేయాలి అని చున్యింగ్ అన్నారు. అంతేనా పాకిస్థాన్ చేసిన త్యాగాల‌ను ప్ర‌పంచం గుర్తించాల‌ని నీతులు కూడా బోధిస్తోంది. పాకిస్థాన్‌తో త‌మది ఏ ప‌రిస్థితుల్లోనూ విడిపోని బంధ‌మ‌ని మ‌రోసారి ఆమె తేల్చిచెప్పారు.

ఆర్నబ్ గోస్వామికి 'వై' భద్రత... ఉగ్రవాదుల ముప్పు...

  ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామికి భద్రత కల్పించారు. పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందన్న నిఘా వర్గాల సమాచారం రావడంతో కేంద్ర ప్రభుత్వం  'వై' కేటగిరి భద్రత కల్పించింది. టైమ్స్ నౌ చానల్ లో పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నార'ని అందుకే ఆర్నబ్ గోస్వామికి 24 గంటల పాటు 20 మంది భద్రతా కల్పిస్తున్నామని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు. కాగా ఉరీ దాడి అనంతరం..తీవ్రవాద సంస్థలు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలంగా గళం వినిపించారు. ఆర్నబ్ తో పాటు జీ న్యూస్ కు చెందిన సుధీర్ చౌధరీ(ఎక్స్ కేటగిరి), సమాచార్ ప్లస్ కు చెందిన ఉమేశ్ కుమార్(వై కేటగిరి), అశ్విని కుమార్ చోప్రా(జడ్ ప్లస్ కేటగిరి)లకు కేంద్రం భద్రత కల్పించింది.

ములాయం కు అఖిలేష్ టీం వార్నింగ్... చరిత్ర ఎవరినీ క్షమించదు..

  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ములాయం కుటుంబంలో ఉన్న రాజకీయ విబేధాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటికే ములాయం.. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా అఖిలేష్ ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ములాయం చెప్పిన వెంటనే అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. సమాజ్ వాదీ పార్టీ తిరిగి విజయం సాధిస్తే, సీఎం పదవికి అఖిలేష్ పేరును తాను స్వయంగా ప్రతిపాదిస్తానని తెలిపారు. ఇప్పుడు దానికి ఆజ్యం పోస్తున్నట్టు  అఖిలేష్ వర్గం ములాయంకు ఓ లేఖ రాసింది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలవలేకుంటే, ఓటమి బాధ్యత ములాయం, ఆయన సోదరుడు రాంగోపాల్ యాదవ్ లదేనని హెచ్చరించింది. అక్కడితో ఆగకుండా.. క్రూరులుగా మిగలవద్దని, భవిష్యత్తులో క్షమించలేని తప్పు చేయవద్దని, చరిత్ర ఎవరినీ క్షమించబోదని ఆ లేఖలో పేర్కొన్నారు. మరి దీనికి ములాయం ఎలా స్పందిస్తారో చూద్దాం..

దారుణం.. నడిరోడ్డుపైనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య...

  కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్) కార్యకర్తను పొడిచి చంపిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. రుద్రేష్‌ అనే వ్యక్తి ఓ సమావేశంలో పాల్గొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుడంగా ఇద్దరు వ్యక్తులు కత్తులతో అతనిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం దుండగులు పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌ను గురించి తెలుసుకున్న తాము ఘటనా స్థలానికి చేరుకొని రుద్రేష్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా దారిలోనే అతను మృతి చెందాడని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తెలిపారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పో్లీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.