జగన్ మోసం చేశారు

హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్‌లో చూపించిన ఆస్తుల విలువపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు సంధిస్తున్నారు. దేశ రాజకీయ నాయకుల్లోనే అత్యంత ధనికుడిగా ముందుకు వచ్చిన ఆయన ఆస్తులను ఉప ఎన్నికల్లో ప్రచారాస్త్రం చేసుకుంటున్నారు. కడప ఉప ఎన్నికల్లో తప్పుడు ఆస్తి వివరాలతో నామినేషన్‌ వేసిన జగన్‌పై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. అఫిడవిట్‌ ద్వారా జగన్‌ తన నల్లధనాన్ని లెక్కల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్లు, స్థలాల వంటి స్థిరాస్థుల్ని మార్కెట్‌ విలువ ప్రకారం చూపించకుండా ఎన్నికల సంఘాన్ని, ప్రజల్నీ మోసం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని వైయస్ జగన్ ఇంటి విలువ 18 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాగే భారతి సిమెంట్స్ విలువ 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని, జగన్ తన ఆస్తులపై విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు.

బాబా ఆరోగ్యంపై తాజా బులెటిన్

పుట్టపర్తి: అమెరికా నుంచి వచ్చిన వైద్యులు బాబా ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డా. సఫాయా తెలిపారు. ఆయన ఈరోజు ఉదయం బాబా ఆరోగ్యం పరిస్థితిపై  తాజా బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలిపారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడిందని పేర్కొన్నారు. డయాలసిస్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా, సత్యసాయి బాబాకు 20 రోజుల నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితిని మంత్రి గీతారెడ్డి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ డమ్మీ ఎత్తుగడ

హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను దెబ్బతీసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తోంది. జగన్‌పై విజయం సాధించలేక పోయినా కనీసం గట్టి పోటీ ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ఉంది. అందకే  కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుగురు మంత్రులను ఇన్‌ఛార్జులుగా ప్రయోగించింది. వీరితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవాహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిలు ప్రచారానికి వెళ్లనున్నారు. ఇదిలావుండగా, ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు మరో ఎత్తుగడ వేసింది. జగన్, విజయమ్మల పేరుతో ఉన్న అభ్యర్థులను డమ్మీ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దించుతోంది. ఇందులో భాగంగా కడప లోక్‌స్థానానికి జగన్ పేరు మీద ఉన్న ఐదుగురు అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించింది. అలాగే, విజయమ్మ పేర్లున్న ముగ్గురుని పులివెందుల శాసనసభా స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ రాకపోవడంతో వైయస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి డమ్మీల చేత నామినేషన్లు వేయించడం ద్వారా కొంత మేరకు లబ్ధి పొందవచ్చునని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో రెండు రోజుల గడువు మిగిలి ఉండటంతో మరికొంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓటర్లను తికమక పెట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసిందని జగన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఎత్తుగడలు ఎన్ని వేసినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారని వారు జోస్యం చెప్పారు.

'జన లోక్‌పాల్' కు శ్రీకారం

న్యూఢిల్లీ: లోక్‌పాల్ ముసాయిదా బిల్లు రూపకల్పనకు శ్రీకారం చుట్టుకుంది. ప్రభుత్వ, పౌర ప్రతినిధులతో కూడిన సంయుక్త కమిటీ తొలిసారిగా శనివారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ల అధ్యక్షతన ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశం జరిగింది. అవినీతి నిరోధమే ధ్యేయంగా కొత్త లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను సమర్పించారు. ప్రశాంతంగా, సజావుగా జరిగిన ఈ సమావేశంలో బిల్లు ముసాయిదాపై ప్రతినిధులు విస్తృతస్థాయిలో చర్చించారు. "సమావేశం సజావుగా సాగింది'' అని ఆ తర్వాత హజారే తెలిపారు. సమావేశ వివరాలను 'ఆడియో రికార్డ్' చేశామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. సంయుక్త కమిటీ తదుపరి సమావేశం మే రెండో తేదీన జరగనుంది. తొలుత, పౌర ప్రతినిధులు రూపొందించిన బిల్లును ప్రశాంత్ భూషణ్ సమావేశంలో ప్రవేశపెట్టారు. దానిలోని అంశాలను శాంతి భూషణ్ వివరించారు. ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్ బిల్లును మంత్రులు ప్రవేశపెట్టారు. తుది బిల్లును రూపొందించే క్రమంలో ప్రజలతోనూ సంప్రదింపులు జరపాలని, సలహా సూచనలు తీసుకోవాలని, ముఖ్యమైన వాటిని ముసాయిదాలో పేర్కొనాలని ప్రశాంత్ భూషణ్ సూచించారు. అయితే, ఆ సంప్రదింపులు ఎలా ఉండాలన్న విషయమై తదుపరి సమావేశంలో నిర్ణయించనున్నారు. సమావేశాలను వీడియో చిత్రీకరణ జరపాలని పౌర ప్రతినిధులు కోరగా.. ప్రభుత్వం ఇందుకు ససేమిరా అంది. ఆడియో రికార్డింగ్‌కు మాత్రం ప్రభుత్వం అంగీకరించింది. ఇక, న్యాయ వ్యవస్థకు సంబంధించి కమిటీ సహాధ్యక్షుడు శాంతి భూషణ్, సమాజ్‌వాదీ పార్టీ నేతల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివాదాస్పద సీడీపై మీడియా పతాక శీర్షికల్లో ప్రచురించినా.. దానికి సంబంధించిన చర్చ ఏదీ సమావేశంలో జరగలేదు. పౌర ప్రతినిధులు తొలుత రూపొందించిన ముసాయిదా బిల్లులో ఒకే ఒక మార్పు చేశామని, అది కూడా లోక్‌పాల్‌ను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ, దాని సభ్యులకు సంబంధించినదేనని పౌర ప్రతినిధుల్లో ఒకరైన ప్రశాంతి భూషణ్ తెలిపారు. తాజా ప్రతిపాదనలో రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌ల స్థానంలో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలను పేర్కొన్నారు. కానీ, తాజా బిల్లులో కేబినెట్ మంత్రులు, న్యాయమూర్తుల సస్పెన్షన్ ప్రస్తావనను తొలగించారు. లోక్‌పాల్‌కు నియామక, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారానికి సంబంధించిన ప్రస్తావనను కూడా తీసివేశారు. ఇక, న్యాయ వ్యవస్థలోని అత్యున్నత వర్గాలు, మంత్రులు, అధికారులపై చర్యలకు సంబంధించి తాజా ముసాయిదాలో ఎటువంటి ప్రస్తావన లేదని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. బిల్లు రూపకల్పనకు విధించిన తుది గడువు జూన్ 30వ తేదీకల్లా కొత్త బిల్లు సిద్ధమవుతుందని ఇరువర్గాలూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. జులైలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లోనే కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఇరు వర్గాలూ చిత్తశుద్ధితో ఉన్నాయని మంత్రి కపిల్ సిబల్ తెలిపారు.

బాబా విషయంలో ఎవరి మీదా ఫిర్యాదు చేయలా

అనంతపురం‌: సత్య సాయిబాబా విషయంలో తాను ఎవరి మీద కూడా ఫిర్యాదు చేయలేదని సత్య సాయిబాబా భక్తుడు శ్యాంసుందర్ స్పష్టం చేశారు. సాయిబాబా విషయంలో తాను ఇంతకు ముందు ఏ విధమైన లేఖ రాయలేదని కూడా ఆయన చెప్పారు. సత్యజిత్ అనే వ్యక్తిగత సహాయకుడు సత్య సాయిబాబాను మోసం చేస్తున్నాడని, సత్య సాయిబాబాకు చికిత్స కూడా చేయించలేదని శ్యాంసుందర్ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్యాంసుందర్ ఆ ప్రకటన చేశారు. తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని చెబుతూ శ్యాంసుందర్ తమ కార్యాలయానికి లేఖను సాయి యజుర్మందిర్ నుంచి ఫ్యాక్స్ చేశారని తెలుగు టీవీ చానెల్ చెప్పుకుంది. తనను వివాదాల్లోకి లాగేందుకు ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని గుర్తించాల్సి ఉందని శ్యాంసుందర్ అన్నారు. సాయే తమ దేవుడని, సాయి కోసమే తాము జీవిస్తామని ఆయన చెప్పారు. సాయి యజుర్మిందర్‌లో భక్తులమంతా కలిసే ఉన్నామని ఆయన అన్నారు.

బ్రాహ్మణ కులం మధ్య కేసీఆర్ కొత్త చిచ్చు

హైదరాబాద్: కేసీఆర్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బ్రాహ్మణులకు ఆర్భాటాలు ఎక్కువనీ, తెలంగాణా ప్రాంతానికి చెందిన బ్రాహ్మణులు నిష్టగా పూజలు చేస్తారని బ్రాహ్మణ కులం మధ్య కొత్త చిచ్చు పెట్టారు. దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం పెరిగిందనీ, తెలంగాణా వచ్చిన వెంటనే ఆ ఆధిపత్యానికి తెరదించి బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తామని వెల్లడించారు. వేద పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ యువజన సంఘానికి చెందిన ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు... దేశంలో ఉన్న బ్రాహ్మణులందరూ ఒకే ధర్మాన్ని పాటిస్తారన్నారు. అంతేతప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నారు. ఏ ప్రాంత బ్రాహ్మణులైనా సర్వేజన సుఖినోభవంతు అంటారు తప్ప వారివారి ప్రాంత సుఖినోభవంతు అనరని చెప్పారు. రాజకీయ ప్రాధాన్యతను పెంచుకునేందుకు కొంతమంది నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇతర బ్రాహ్మణ వర్గాలు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకుల వల్లనే వైషమ్యాలు పెరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

'బిసి'లోకి మరో ఐదు కులాలు

హైదరాబాద్: వెనుకబడిన కులాల జాబితాలో మరో ఐదు కులాలను చేరుస్తూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. బీసీ కమిషన్ సిఫార్సులను ఆమోదిస్తూ శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నిర్ణయించింది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. బుడుబుంజాల కులాన్ని బి గ్రూపులో, కుర్మిని డి గ్రూపులో, అసాదుల, క్యూటా కులాలను ఎ గ్రూపులో, గుడియాను బి గ్రూపులో చేరుస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ ఉపాథి హామీ పథకంలో 5600 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టాలని నిర్ణయించారు. వేసవిలో ప్రజలకు ఉపాథి కల్పించేందుకు కనీసం 65 రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. పని లేక ఎవరూ గ్రామాల నుంచి వలస పోకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో భూమి అభివృద్ధి, వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తాగునీటి పధకాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, రాష్ట్రంలోని 40వేల పాఠశాలల్లో టాయిలెట్లు, డ్రెయినేజి, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర, రాష్ట్రాల నిధులను సకాలంలో ఖర్చు చేసేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల శాసనసభ అనుమతి పొందిన సాగు రైతుల (కౌలు రైతులు) బిల్లుపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఇలాఉండగా, విశాఖపట్నం, కరీంనగర్ జిల్లాల్లో కొత్తగా రెండు ఎపిఎస్‌పి బెటాలియన్లను ఏర్పాటు చేయాలని, ఆ రెండు చోట్లా 932మంది చొప్పున పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

కెసిఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసింది

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు కెటి రామారావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు దుమ్మెత్తిపోశారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కెసిఆర్ కోట్లు సంపాదించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. హైదరాబాదు చుట్టుపక్కల వేయి ఎకరాలు సంపాదించారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసిందని ఆయన అడిగారు. కెసిఆర్ విద్యార్థులను రెచ్చగట్టే ప్రసంగాలు చేశారని ఆయన అన్నారు. కెసిఆర్ కూతురు కవిత, కుమారుడు కెటి రామారావు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు.  బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ నాయకుడు చంద్రబాబు జైలుకు వెళ్లారని, కెసిఆర్ ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లలేదని, పోలీసు దెబ్బ తినలేదని ఆయన అన్నారు. త్యాగాలు చేసినవారిని విస్మరించి ఏ త్యాగాలు చేశారని కెటి రామారావుకు సిరిసిల్ల టికెట్ ఇచ్చారని ఆయన అడిగారు.

177 జీవో నెంబర్ నిలిపివేత

హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన జీఓ 177ను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్య విశేషాలను ఆయన మీడియాకు వివరించారు. జీవోపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, తెలంగాణకు వ్యతిరేకంగానే ఈ జీవో జారీ చేసే అభిప్రాయం వ్యక్తమవుతోందని, అందువల్ల జీవోను రద్దు చేయాలని తెలంగాణకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, శ్రీధర్ బాబు ముఖ్యమంత్రితో గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. దాదాపు అర గంటపాటు వారు తమ వాదనను మంత్రివర్గ సమావేశంలో వినిపించినట్లు సమాచారం. జీవో 177ను తాత్కాలికంగా నిలిపేయాలనే నిర్ణయాన్ని సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకించారని చెబుతున్నారు. అయితే జీవోను తాత్కాలికంగా నిలిపేస్తూ దానిపై ముగ్గురు మంత్రులతో ముఖ్యమంత్రి ఓ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ట్రెజరీ శాఖలో అదనంగ 433 ఉద్యోగాలు కల్పించాలని, కాలుష్యనివారణ మండలిలో అదనంగా 90 ఉద్యోగాలు కల్పించాలని విశాఖ, కరీంనగర్ లో రెండు ఏపీఎస్సీ బెటాలియన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయశాఖ బాధ్యతలను తాత్కాలికంగా మంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించాలని నిర్ణయించారన్నారు. ప్రజపధం కార్యక్రమ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశామని, ఈ కార్యక్రమంలో సాగునీరు, పారిశుధ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. బీసీ జాబితాలో అదనంగా 5 కులాలను చేర్చాలని నిర్ణయించామన్నారు.

మీడియా వక్రీకరించింది

హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా ఓ పత్రిక పని కట్టుకుని రాతలు రాస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను చెప్పిన మాటలను రాయకుండా వేరే మాటలు రాసి మీడియా తనను దెబ్బ తీయాలని చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మారదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తన జన్మహక్కు అని, దానిపై తన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీడియా రాతలు తెలంగాణను అడ్డుకోలేవని ఆయన అన్నారు. అందరినీ కలుపుకునే తెలంగాణ ఉద్యమం సాగిస్తానని తాను చెప్పానని ఆయన స్పష్టం చేశారు. తాను తెలంగాణ కోసం ఒంటరిగానైనా పోరాడుతానని ఆయన చెప్పారు. తమ పార్టీలో చిల్లర నాయకులున్నారు, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తాను అన్నానని ఆయన అంగీకరించారు. తాను ఐదేళ్ల పాటు వైయస్ రాజశేఖర రెడ్డిపై పోరాటం చేశానని, ఇప్పుడు రాజీ పడతానని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీ, వైయస్ జగన్ పార్టీ స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందని, తెలంగాణపై వైఖరి చెప్పకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని ఆయన అన్నారు.

నాగంపై చంద్రబాబు యాక్షన్ ప్లాన్

హైదరాబాద్‌: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ తెలంగాణ శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చర్యలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై ఆయన శనివారం పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు. అత్యంత అవినీతిపరుడైన వైయస్ జగన్‌తో నాగం జనార్దన్ రెడ్డి తనను పోల్చడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో నాగం జనార్దన్ రెడ్డి తప్పులు చేసినా ఉపేక్షించామని, ఇప్పుడు నాగం తీరు పరాకాష్టకు చేరుకుందని చంద్రబాబు సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నట్లు చంద్రబాబు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ స్థితిలో నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. కాగా, జగన్‌తో తాను చంద్రబాబును పోల్చలేదని నాగం జనార్దన్ రెడ్డి శనివారం ఉదయం చెప్పారు.

విజయమ్మ, డీఎల్ నామినేషన్ దాఖలు

పులివెందుల: పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తాసీల్దార్ కార్యాలయంలో ఆమె రెండు సెట్ల నామినేషను పత్రాలను ఆర్డీవోకు అందచేశారు. విజయమ్మతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఇంటి వద్ద నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరిన వీరితో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చారు. కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదుల్లా, కేంద్రమంత్రి సాయిప్రతాప్ తదితరులు హాజరయ్యారు.

'ఉప ఎన్నికల్లో ఎవరు ఓడినా ఒకటే'

విజయవాడ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కడప ఉప ఎన్నికలలో జయాపజయాలను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వతహాగా క్రికెటర్ అయిన సీఎం ఎన్నికల ఫలితాలను కూడా అదేవిధంగా తీసుకోవాలన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు ఓడినా ఒకటేనన్నారు. జిల్లాలో మంత్రివర్గాన్ని మోహరింప చేసి ప్రభుత్వాన్ని స్తంభింపచేయటం విడ్డూరంగా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. అవసరం అనుకుంటే కడపలో టీడీపీ తరపున ప్రచారం చేస్తామన్నారు. సత్యసాయి బాబా ఆస్తులను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే చాలా దారుణాలు జరుగుతాయన్నారు. కళ్లు మూసి తెరిచే లోగా జగన్ వందల కోట్ల రూపాయలు సంపాదించారని, ఇదంతా రాజకీయ అవినీతి మంత్రంతోనే సాధ్యమైందని నారాయణ అన్నారు. భూ ఆక్రమణ కేసులో నారాయణ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. కేసును కోర్టు కొట్టేసింది. భూపోరాటాల సందర్భంగా నారాయణపై ఈ కేసు నమోదైంది. తనపై కేసును కొట్టేసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరిన్ని భూపోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు.

అందుకే పట్టుబట్టా

కడప‌: ఎమ్మెల్సీగా ఎన్నికై తిరిగి మంత్రిగా కొసాగుతారనే తప్పుడు సంకేతాలు తనపై వెళ్తున్నాయని, దానివల్ల పులివెందులలో వివేకాను ఓడించినా ఫరవా లేదనే ప్రచారం జరుగుతోందని, అందువల్లనే రాజీనామా ఆమోదానికి పట్టుబట్టానని పులివెందుల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. నామినేటెడ్ పదవులను తాను కోరుకోవడం లేదని, పులివెందుల ప్రజలు గెలిపిస్తేనే మంత్రి పదవి చేపడతానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో సెంటిమెంటుకు తావు లేదని ఆయన చెప్పారు. కాగా, పులివెందుల నియోజకవర్గంలో తన వదిన వైయస్ విజయమ్మ గెలిస్తే ప్రతిపక్షంలోనే ఉంటారని, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉండాల్సిన అవసరం లేదని, ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అభివృద్ధిని అందించాల్సిన అవసరం ఉందని  ఆయన చెప్పారు. మంత్రి పదవికి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.

హజారే బ్యాంకు బ్యాలెన్స్ 68 వేలే

హైదరాబాద్: లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పన కమిటీలో పౌర సమాజం నుంచి సభ్యులుగా ఎంపికైన వారు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ కమిటీలో ఒక సభ్యుడు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బ్యాంకు బ్యాలెన్స్ 68 వేల రూపాయలుగా పేర్కొన్నాడు. బిల్లు రూపకల్పన కోసం కమిటీ వచ్చే వారంలో భేటీకానున్న నేపథ్యంలో పౌర సమాజం సభ్యులు తమ పారదర్శకతను చూపేందుకు ఈ చర్య తీసుకున్నారు. అయితే వీరిలో హజారే మినహా ఇతర సభ్యుల ఆస్తులు భారీగా ఉండటం గమనార్హం. తన వద్ద రూ.68,688 బ్యాంకు నిల్వతో పాటు మహారాష్ట్రంలోని రాలెగావ్ సిద్ధీలో 0.17 ఎకరం, 4.9 ఎకరాలు, పింపియానెర్‌లో 1.13 ఎకరాల భూమి ఉందని హజారే వెల్లడించారు. రాలెగావ్ సిద్ధీలో పొందిన భూమి సైన్యం నుంచి, పింపియానెర్‌లోని భూమి ఓ గ్రామస్తుడి నుంచి విరాళంగా వచ్చిందని, మిగిలిన భూమి కుటుంబం నుంచి అందుకున్నదని చెప్పారు. ఇదిలావుండగా, లోక్‌పాల్ బిల్లు ముసాయిదా కమిటీ సహ ఛైర్మన్‌గా ఉన్న సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ తన చరాస్తులను రూ.111 కోట్లుగా చూపారు. ముఖ్యంగా గత పదేళ్లలో మొత్తం రూ.136.71 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ప్రకటించారు. అలాగే, కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తనకు బెంగళూరులో రూ.కోటిన్నర విలువజేసే భవనం, బ్యాంకు ఖాతాలో రూ.32 లక్షలు, భార్య పేరిట రూ.లక్షన్నర నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. మెగసెసె అవార్డు గ్రహీత అరవింద్ క్రజేరివాల్ తనకు రూ.55 లక్షల విలువజేసే ఫ్లాట్, రూ.1.35 లక్షల బ్యాంకు నిల్వ ఉందన్నారు.

కేంద్ర మంత్రి కార్యాలయంపై దాడి

కడప‌: కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. కడపలోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ కార్యాలయం ఉంది. దాడి చేసిన దుండగులు కార్యాలయంలోని ఫర్నీచర్‌ను, రికార్డులను ధ్వంసం చేశారు. దాడి ఎవరు చేశారనేది తెలియడం లేదు. పోలీసుల విచారణలో నిజాలు తెలుస్తాయని మంత్రి సాయి ప్రతాప్ అంటున్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరని ఆయన చెప్పారు. దాడికి రాజకీయ కారణాలు లేకపోవచ్చునని ఆయన అన్నారు. పోలీసులు కూడా దాడిపై ఏమీ చెప్పలేకపోతున్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల విషయంలో సాయి ప్రతాప్ అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఇటు కాంగ్రెసు పార్టీకి గానీ, అటు వైయస్ జగన్‌కు గానీ ఆయన మద్దతు ప్రకటించడం లేదు. కాంగ్రెసులో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సాయి ప్రతాప్ ఉప ఎన్నికలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు.