177 జీవో నెంబర్ నిలిపివేత
posted on Apr 16, 2011 @ 3:07PM
హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైన జీఓ 177ను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్య విశేషాలను ఆయన మీడియాకు వివరించారు. జీవోపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, తెలంగాణకు వ్యతిరేకంగానే ఈ జీవో జారీ చేసే అభిప్రాయం వ్యక్తమవుతోందని, అందువల్ల జీవోను రద్దు చేయాలని తెలంగాణకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, శ్రీధర్ బాబు ముఖ్యమంత్రితో గట్టిగా వాదించినట్లు తెలుస్తోంది. దాదాపు అర గంటపాటు వారు తమ వాదనను మంత్రివర్గ సమావేశంలో వినిపించినట్లు సమాచారం.
జీవో 177ను తాత్కాలికంగా నిలిపేయాలనే నిర్ణయాన్ని సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకించారని చెబుతున్నారు. అయితే జీవోను తాత్కాలికంగా నిలిపేస్తూ దానిపై ముగ్గురు మంత్రులతో ముఖ్యమంత్రి ఓ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ట్రెజరీ శాఖలో అదనంగ 433 ఉద్యోగాలు కల్పించాలని, కాలుష్యనివారణ మండలిలో అదనంగా 90 ఉద్యోగాలు కల్పించాలని విశాఖ, కరీంనగర్ లో రెండు ఏపీఎస్సీ బెటాలియన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయశాఖ బాధ్యతలను తాత్కాలికంగా మంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించాలని నిర్ణయించారన్నారు. ప్రజపధం కార్యక్రమ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశామని, ఈ కార్యక్రమంలో సాగునీరు, పారిశుధ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. బీసీ జాబితాలో అదనంగా 5 కులాలను చేర్చాలని నిర్ణయించామన్నారు.