మీడియా వక్రీకరించింది
posted on Apr 16, 2011 @ 3:02PM
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా ఓ పత్రిక పని కట్టుకుని రాతలు రాస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను చెప్పిన మాటలను రాయకుండా వేరే మాటలు రాసి మీడియా తనను దెబ్బ తీయాలని చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మారదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తన జన్మహక్కు అని, దానిపై తన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మీడియా రాతలు తెలంగాణను అడ్డుకోలేవని ఆయన అన్నారు. అందరినీ కలుపుకునే తెలంగాణ ఉద్యమం సాగిస్తానని తాను చెప్పానని ఆయన స్పష్టం చేశారు. తాను తెలంగాణ కోసం ఒంటరిగానైనా పోరాడుతానని ఆయన చెప్పారు. తమ పార్టీలో చిల్లర నాయకులున్నారు, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తాను అన్నానని ఆయన అంగీకరించారు. తాను ఐదేళ్ల పాటు వైయస్ రాజశేఖర రెడ్డిపై పోరాటం చేశానని, ఇప్పుడు రాజీ పడతానని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీ, వైయస్ జగన్ పార్టీ స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందని, తెలంగాణపై వైఖరి చెప్పకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని ఆయన అన్నారు.