'బిసి'లోకి మరో ఐదు కులాలు
posted on Apr 17, 2011 9:25AM
హైదరాబాద్: వెనుకబడిన కులాల జాబితాలో మరో ఐదు కులాలను చేరుస్తూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. బీసీ కమిషన్ సిఫార్సులను ఆమోదిస్తూ శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నిర్ణయించింది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. బుడుబుంజాల కులాన్ని బి గ్రూపులో, కుర్మిని డి గ్రూపులో, అసాదుల, క్యూటా కులాలను ఎ గ్రూపులో, గుడియాను బి గ్రూపులో చేరుస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ ఉపాథి హామీ పథకంలో 5600 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టాలని నిర్ణయించారు. వేసవిలో ప్రజలకు ఉపాథి కల్పించేందుకు కనీసం 65 రోజుల పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. పని లేక ఎవరూ గ్రామాల నుంచి వలస పోకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో భూమి అభివృద్ధి, వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తాగునీటి పధకాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, రాష్ట్రంలోని 40వేల పాఠశాలల్లో టాయిలెట్లు, డ్రెయినేజి, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్న కేంద్ర, రాష్ట్రాల నిధులను సకాలంలో ఖర్చు చేసేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల శాసనసభ అనుమతి పొందిన సాగు రైతుల (కౌలు రైతులు) బిల్లుపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఇలాఉండగా, విశాఖపట్నం, కరీంనగర్ జిల్లాల్లో కొత్తగా రెండు ఎపిఎస్‌పి బెటాలియన్లను ఏర్పాటు చేయాలని, ఆ రెండు చోట్లా 932మంది చొప్పున పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.