మంత్రుల రాజీనామాకు అధిష్టానం నో?
న్యూఢిల్లీ: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్ళిన సిఎం బుధవారం బిజీబిజీగా గడిపారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌లతో భేటీ అయ్యారు. సోనియాగాంధీ, అహ్మద్‌పటేల్‌తో జరిగిన చర్చల్లో కడప ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలోకి జారిపోకుండా చూసుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం కిరణ్‌కుమార్ రెడ్డికి సూచించినట్లు తెలిసింది. మంత్రి పదవికి వివేకానందారెడ్డి చేసిన రాజీనామాను ఆమోదించాలని చేసిన విజ్ఞప్తిని అధిష్టానం ఒప్పుకోలేదని తెలిసింది. వివేకా రాజీనామా ఆమోదిస్తే డీఎల్ రాజీనామాను కూడా ఆమోదించాల్సి ఉంటుందని అన్నట్లు తెలిసింది. రాజీనామాలు చేశాక ఇద్దరూ ఓడితే మళ్లీ వారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం మంచి పద్ధతి కాదని, రాజీనామా చేయకుండా ఉంటే ఎన్నికలైన తర్వాత కూడా పదవుల్లో కొనసాగుతారని అధిష్టానం సిఎంకు నచ్చచెప్పినట్లు తెలిసింది. సోనియా గాంధీతో సమావేశమైనప్పుడు రెండు ఉపఎన్నికల్లో పార్టీ అనుసరిస్తున్న వ్యూహం గురించి వివరించారు.
రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులందరిని కలుపుకుని పని చేయాలని సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రికి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్‌మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్న కడప జిల్లా కాంగ్రెస్ శాసన సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. శాసన సభ్యుడు ఆదినారాయణ రెడ్డి కడపలో జగన్‌మోహన్ రెడ్డికి బాహాటంగా మద్దతు ఇవ్వటంపై ఫిర్యాదులు వచ్చాయి. కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో భేటీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. సోనియాతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లా బలమైందని, ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని అన్నారు. ఏ ఎన్నికలనైనా సీరియస్‌గానే తీసుకుంటున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉప ఎన్నికల్లో మంత్రులు ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. డిఎస్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, మీడియా రాసుకుంటే తానేమీ చేయలేనని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని, ఆయనను తమ పార్టీ నేతగానే ప్రచారం చేసుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపించబోవన్నారు.