కాంగ్రెస్ డమ్మీ ఎత్తుగడ
posted on Apr 17, 2011 @ 9:46AM
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను దెబ్బతీసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తోంది. జగన్‌పై విజయం సాధించలేక పోయినా కనీసం గట్టి పోటీ ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ఉంది. అందకే కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుగురు మంత్రులను ఇన్‌ఛార్జులుగా ప్రయోగించింది. వీరితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవాహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిలు ప్రచారానికి వెళ్లనున్నారు. ఇదిలావుండగా, ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు మరో ఎత్తుగడ వేసింది. జగన్, విజయమ్మల పేరుతో ఉన్న అభ్యర్థులను డమ్మీ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దించుతోంది. ఇందులో భాగంగా కడప లోక్‌స్థానానికి జగన్ పేరు మీద ఉన్న ఐదుగురు అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించింది. అలాగే, విజయమ్మ పేర్లున్న ముగ్గురుని పులివెందుల శాసనసభా స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ రాకపోవడంతో వైయస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి డమ్మీల చేత నామినేషన్లు వేయించడం ద్వారా కొంత మేరకు లబ్ధి పొందవచ్చునని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో రెండు రోజుల గడువు మిగిలి ఉండటంతో మరికొంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓటర్లను తికమక పెట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసిందని జగన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఎత్తుగడలు ఎన్ని వేసినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారని వారు జోస్యం చెప్పారు.