జగన్ మోసం చేశారు
posted on Apr 17, 2011 @ 9:55AM
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన అఫిడవిట్‌లో చూపించిన ఆస్తుల విలువపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు సంధిస్తున్నారు. దేశ రాజకీయ నాయకుల్లోనే అత్యంత ధనికుడిగా ముందుకు వచ్చిన ఆయన ఆస్తులను ఉప ఎన్నికల్లో ప్రచారాస్త్రం చేసుకుంటున్నారు. కడప ఉప ఎన్నికల్లో తప్పుడు ఆస్తి వివరాలతో నామినేషన్ వేసిన జగన్‌పై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. అఫిడవిట్ ద్వారా జగన్ తన నల్లధనాన్ని లెక్కల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్లు, స్థలాల వంటి స్థిరాస్థుల్ని మార్కెట్ విలువ ప్రకారం చూపించకుండా ఎన్నికల సంఘాన్ని, ప్రజల్నీ మోసం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని వైయస్ జగన్ ఇంటి విలువ 18 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాగే భారతి సిమెంట్స్ విలువ 2 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నానని, జగన్ తన ఆస్తులపై విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు.