సాయి ట్రస్ట్‌లో సంపూర్ణ అధికారం బాబాదే
పుట్టపర్తి: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వ్యవహారాల్లో వ్యవస్థాపక అధ్యక్షులైన భగవాన్ సత్యసాయికే సంపూర్ణ అధికారాలు ఉన్నాయని సెంట్రల్ ట్రస్ట్ స్పష్టం చేసింది. ఈమేరకు తొలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ట్రస్టుపరంగా ఖర్చు చేసే ప్రతి పైసాకూ పక్కాగా లెక్కలు ఉన్నాయని సెంట్రల్ ట్రస్టు ప్రకటన సారాంశాన్ని ట్రస్టు సభ్యుడు, బాబా సోదరుడి కుమారుడు ఆర్‌జె రత్నాకర్ సంతకంతో కూడిన ప్రకటనను సోమవారం రాత్రి పత్రికలకు విడుదల చేశారు. ట్రస్టుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. గత కొంతకాలంగా ట్రస్టు వ్యవహారాలపై మీడియాలో విభిన్న కథనాలు వెలువడుతున్న తరుణంలో, వాటికి ముగింపు పలకాలనే లక్ష్యంతో ట్రస్టు సభ్యులు సోమవారం అత్యవసరంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ట్రస్టు లావాదేవీలు, దాతలు ఇచ్చే విరాళాలకు జవాబుదారీతనం ఎలా ఉంటుందో ఎనిమిది పేరాల్లో వివరిస్తూ సత్యసాయి ఆరోగ్యం కుదుటపడటానికి భక్తులు ప్రార్థనలను చేపట్టాలని కోరారు. ట్రస్టు ద్వారా విరాళాలను నగదు రూపేణా తీసుకునే అవకాశమే లేదని, ట్రస్టుకు అందే చెక్కులు, డ్రాఫ్టులను ట్రస్టు ఆర్థిక అధికారి ప్రతి రోజూ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని ,విదేశాల నుంచి వచ్చే విరాళాలను జమ చేయటానికి ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, 1976 విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద కేంద్ర హోంశాఖ ఆమోదంతో ఖాతాలు నిర్వహిస్తున్నామని రత్నాకర్ తెలిపారు.
ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన అన్ని పనులకు ట్రస్టు వ్యవస్థాపకులు సత్యసాయిబాబా అనుమతి తప్పనిసరి అని, నేరుగా ఎవరికీ నగదు చెల్లింపులు చేసే ప్రసక్తి లేదని చెప్పారు. ట్రస్టు సభ్యుల నియామకాలన్నీ సత్యసాయి బాబా స్వీయ నిర్ణయం మేరకే జరిగాయని, ట్రస్టులో ఉన్న సభ్యులెవరూ ఎలాంటి గౌరవ వేతనం, ఇతర ప్రయోజనాలు పొందటం లేదని, బాబా చేపట్టిన పనులకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించేలా చూడటమే సభ్యుల కర్తవ్యమని స్పష్టం చేశారు. ట్రస్టుకు అందే విరాళాలు.. ఖర్చులకు సంబంధించి లెక్కలను పక్కాగా నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించిన లెక్కలను ఆడిట్ నిర్వహించి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నామని, ప్రతి ఖర్చుకు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని, దీనివల్ల నిధులను మళ్లించటం, లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసే ప్రశ్నకు తావే లేదని చెప్పారు. బాబా అనారోగ్యంగా ఉన్న సమయంలో మీడియాలో వచ్చిన కథనాలు ట్రస్టు సభ్యులను బాధకు గురిచేశాయని రత్నాకర్ పేర్కొన్నారు. బాబా కోలుకున్న తర్వాత వీటన్నింటికీ సరైన సమాధానం వస్తుందన్నారు. సత్యసాయి తనను ప్రపంచ దైవంగా ఎన్నో ఏళ్ల క్రితమే ప్రకటించారన్నారు. బాబా ఆరోగ్య పరిస్థితపైగానీ, ట్రస్టు వ్యవహారాల్లోగానీ వచ్చే వార్తలపై భక్తులు కలత చెందరాదన్నారు.
అందరూ సంయమనం పాటించి బాబా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. సత్యసాయి బాబా సంపూర్ణంగా కోలుకోవడంపైనే తామంతా దృష్టి కేంద్రీకరించినట్టు ఆర్‌జె రత్నాకర్ తెలిపారు. సత్యసాయి కాలేయం పనితీరు కొంత ఆందోళన కలిగిస్తోందని పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ ఎఎస్ సఫాయా వెల్లడించారు. పుట్టపర్తి సత్యసాయి బాబా అనారోగ్యానికి గురికావడానికి మునుపే సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యవర్గంలో సమూల మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక అనుబంధ ట్రస్టులన్నింటినీ రద్దు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆవిర్భావం అనంతరం 9మంది సభ్యులు అందులో ఉన్నారు. దీనికి సత్యసాయి అధ్యక్షులు. దీంతోపాటు మెడికల్ ట్రస్టు, ఎడ్యుకేషనల్ ట్రస్టు, సాధనా ట్రస్టు, బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్టు, ఉమెన్ వెల్ఫేర్ ట్రస్టు ద్వారా పరిపాలన ప్రక్రియలు అమలయ్యేవి. అయితే సత్యసాయి బాబా 85వ జన్మదినానికి ముందు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యనిర్వాహకవర్గంలో సమూల ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్టు సమాచారం.