'జన లోక్‌పాల్' కు శ్రీకారం
posted on Apr 17, 2011 @ 9:42AM
న్యూఢిల్లీ: లోక్‌పాల్ ముసాయిదా బిల్లు రూపకల్పనకు శ్రీకారం చుట్టుకుంది. ప్రభుత్వ, పౌర ప్రతినిధులతో కూడిన సంయుక్త కమిటీ తొలిసారిగా శనివారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ల అధ్యక్షతన ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశం జరిగింది. అవినీతి నిరోధమే ధ్యేయంగా కొత్త లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను సమర్పించారు. ప్రశాంతంగా, సజావుగా జరిగిన ఈ సమావేశంలో బిల్లు ముసాయిదాపై ప్రతినిధులు విస్తృతస్థాయిలో చర్చించారు. "సమావేశం సజావుగా సాగింది'' అని ఆ తర్వాత హజారే తెలిపారు. సమావేశ వివరాలను 'ఆడియో రికార్డ్' చేశామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వెల్లడించారు. సంయుక్త కమిటీ తదుపరి సమావేశం మే రెండో తేదీన జరగనుంది. తొలుత, పౌర ప్రతినిధులు రూపొందించిన బిల్లును ప్రశాంత్ భూషణ్ సమావేశంలో ప్రవేశపెట్టారు. దానిలోని అంశాలను శాంతి భూషణ్ వివరించారు. ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్ బిల్లును మంత్రులు ప్రవేశపెట్టారు. తుది బిల్లును రూపొందించే క్రమంలో ప్రజలతోనూ సంప్రదింపులు జరపాలని, సలహా సూచనలు తీసుకోవాలని, ముఖ్యమైన వాటిని ముసాయిదాలో పేర్కొనాలని ప్రశాంత్ భూషణ్ సూచించారు.
అయితే, ఆ సంప్రదింపులు ఎలా ఉండాలన్న విషయమై తదుపరి సమావేశంలో నిర్ణయించనున్నారు. సమావేశాలను వీడియో చిత్రీకరణ జరపాలని పౌర ప్రతినిధులు కోరగా.. ప్రభుత్వం ఇందుకు ససేమిరా అంది. ఆడియో రికార్డింగ్‌కు మాత్రం ప్రభుత్వం అంగీకరించింది. ఇక, న్యాయ వ్యవస్థకు సంబంధించి కమిటీ సహాధ్యక్షుడు శాంతి భూషణ్, సమాజ్‌వాదీ పార్టీ నేతల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివాదాస్పద సీడీపై మీడియా పతాక శీర్షికల్లో ప్రచురించినా.. దానికి సంబంధించిన చర్చ ఏదీ సమావేశంలో జరగలేదు. పౌర ప్రతినిధులు తొలుత రూపొందించిన ముసాయిదా బిల్లులో ఒకే ఒక మార్పు చేశామని, అది కూడా లోక్‌పాల్‌ను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ, దాని సభ్యులకు సంబంధించినదేనని పౌర ప్రతినిధుల్లో ఒకరైన ప్రశాంతి భూషణ్ తెలిపారు. తాజా ప్రతిపాదనలో రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌ల స్థానంలో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలను పేర్కొన్నారు. కానీ, తాజా బిల్లులో కేబినెట్ మంత్రులు, న్యాయమూర్తుల సస్పెన్షన్ ప్రస్తావనను తొలగించారు. లోక్‌పాల్‌కు నియామక, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారానికి సంబంధించిన ప్రస్తావనను కూడా తీసివేశారు. ఇక, న్యాయ వ్యవస్థలోని అత్యున్నత వర్గాలు, మంత్రులు, అధికారులపై చర్యలకు సంబంధించి తాజా ముసాయిదాలో ఎటువంటి ప్రస్తావన లేదని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. బిల్లు రూపకల్పనకు విధించిన తుది గడువు జూన్ 30వ తేదీకల్లా కొత్త బిల్లు సిద్ధమవుతుందని ఇరువర్గాలూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. జులైలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లోనే కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఇరు వర్గాలూ చిత్తశుద్ధితో ఉన్నాయని మంత్రి కపిల్ సిబల్ తెలిపారు.