వివేకానే వైఎస్ కు వారసుడు: డీఎస్

హైదరాబాద్: వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ డి. శ్రీనివాస్ అన్నారు. వైఎస్ వారసుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డియే అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్‌కు అంత పేరు వచ్చిందన్నారు. అందువల్ల పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ ఆశయసాధన కోసం పాటుపడుతున్న వివేకానంద రెడ్డే నిజమైన వారసుడన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో తాను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో కలిసి పాల్గొంటానని చెప్పారు. అలాగే, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మంత్రులు ఉప ఎన్నికలలో పాల్గొని ప్రచారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగిన వారిగా ఆ పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని అన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో తాము వైఎస్ బొమ్మను ఖచ్చితంగా పెట్టుకుంటామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆస్థి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తనకు విభేదాలు లేవన్నారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. జగన్ వర్గంలో చేరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.

నేరపూరిత శక్తుల్లో భయం

హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా సమగ్ర లోక్‌పాల్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, అపఖ్యాతి పాలుచేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, నేరపూరిత శక్తులు యత్నిస్తున్నాయని సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆందోళన వ్యక్తం చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం మొదలైన ఉద్యమంపై సామాన్య ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని గుర్తు చేశారు. దీన్ని చూసి కొన్ని రాజకీయ పార్టీలు, నేరపూరిత శక్తుల్లో భయం పట్టుకుందన్నారు. ఈ ప్రజాఉద్యమంపై అపోహలు, సందిగ్ధం సృష్టించేందుకు, అపఖ్యాతి పాలుచేసేందుకు వారు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజకీయ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలపై హజారే స్పందిస్తూ.. దేశంలోని రాజకీయ నేతలందరూ అవినీతిపరులేనని తానెప్పుడూ వ్యాఖ్యానించలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశంలో నానాటికీ హెచ్చుమీరి పోతున్న అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. తమ పరిధిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా స్పందించని నేతలు ఒకరకంగా అవినీతికి మద్దతు పలుకుతున్నట్లే కదా అని నిలదీశారు. ఎన్నికల్లో నల్లధనం ఏరులై పారుతోందని, అధికారాన్ని చేపట్టేందుకు ఆ సొమ్మును ఎర వేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లు నిజాయితీగా వ్యవహరించటం లేదని, అవినీతిపరులని హజారే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎన్సీపీ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై హజారే స్పందిస్తూ ఓటర్ల వ్యక్తిత్వంపై మచ్చ పడటానికి రాజకీయ నేతలు, పార్టీలే కారణమని దుయ్యబట్టారు.

ఎన్టీఆర్ కే ఎక్కువ?

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడిగా సినీ హీరో, స్వర్గీయ ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సాగుతోందని, నారా లోకేష్‌కూ జూనియర్ ఎన్టీఆర్‌కూ మధ్య పోటీ జరుగుతోందని, ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొందని ప్రచారం జరిగిన నేపథ్యంలో పోల్ నిర్వహించారు. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు అనే ప్రశ్న వేసి జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, బాలకృష్ణ, హరికృష్ణ పేర్లు ఇవ్వడం జరిగింది. వీరిలో చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరో చెప్పాలని పాఠకులను అడిగింది. ఈ పోల్ సర్వేలో విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు రాజకీయ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎన్టీఆర్ అంటూ 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. విచిత్రమేమిటంటే, నందమూరి బాలకృష్ణ మూడో స్థానంలో నిలిచారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రెండో స్థానంలో నిలువడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పేరును సూచిస్తూ 28 శాతం మంది ఓటేశారు. బాలకృష్ణకు 17.2 శాతం ఓట్లు వచ్చాయి. నందమూరి హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు కేవలం 3.8 శాతం ఓట్లే వచ్చాయి.

హూ ఈజ్ వైయస్ఆర్?

కడప: హూ ఈజ్ వైయస్ఆర్ అంటూ వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు డిఎల్ రవీంద్రారెడ్డి మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. కడప జిల్లా ఉప ఎన్నికలలో భాగంగా డిఎల్ రవీంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ లేకుంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఎక్కడ అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ వల్లనే వైయస్ఆర్ వెలుగులోకి వచ్చారని అన్నారు. అదే కాంగ్రెసు పార్టీ వల్ల మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి వచ్చారని అన్నారు. అది ఆయన మరిచిపోతున్నారన్నారు. ధనమదంతో జగన్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారన్నారు. కాగా కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించిన బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మకు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఫోన్ చేశారు.

సాదాసీదాగా జగన్ నామినేషన్

ఇడుపులపాయ: ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయన సతీమణి విజయమ్మ శుక్రవారం కన్నీటి పర్యంతమయ్యారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి, సోదరి షర్మిల వైఎస్‌ఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. నామినేషన్ పత్రాలను ఆమె వైయస్సార్ సమాధిపై ఉంచి ఆ తర్వాత జగన్‌కు అందించారు. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి వైయస్సార్‌కు నివాళులు అర్పించిన తర్వాత వైయస్ జగన్ నామినేషన్ వేసేందుకు కడప బయలుదేరారు. నామినేషన్ సందర్భంగా హంగామా ఉండకూడదని జగన్ భావిస్తున్నారు. దీంతో సాదాసీదాగానే కడప జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు. కడప లోక్ సభ స్థానంలో ఇప్పటికే వైయస్ జగన్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైయస్ విజయమ్మ పులివెందుల శాసనసభ స్థానంలో ఓటర్లను కలుస్తూ తనను గెలిపించాలని అడుగుతున్నారు.

బందీగా ఉన్న సత్యసాయిబాబా?

హైదరాబాద్: పుట్టపర్తి సత్య సాయిబాబాపై ఓ తెలుగు దినపత్రిక సంచలనాత్మక వార్తాకథనాన్ని ప్రచురించింది. సత్య సాయిబాబా బందీ అయ్యారని, సహాయకులు ఆయనను చెర పట్టారని, భగవాన్ మానసిక వేదనతో కృంగిపోతున్నారని వ్యాఖ్యానించింది. సత్యజిత్ అనే సహాయకుడు బాబాను మోసం చేశాడని ఆరోపించింది. ఆరు నెలలుగా బాబా మాట్లాడడం లేదని, ఆప్తులను కూడా బాబా చెంతకు రానివ్వడం లేదని చెప్పింది. ఐసియులో వైద్యం తెలియని వ్యక్తి ఉన్నాడని చెబుతోంది. సత్యసాయిబాబాను గత నెల 28వ తేదీన ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి సత్యజిత్ కనిపించడం లేదని తెలిపింది. సత్య సాయిబాబాకు సత్యజిత్ శౌరి అనే వ్యక్తితో కలిసి గంజిలో నిద్రమాత్రలు వేసి ఎవరికీ తెలియకుండా తాగిస్తూ వచ్చారని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాము సంపాదించినట్లు ఆ పత్రిక చెప్పుకుంది. సత్యజిత్ అనే అల్పజీవి సాక్షాత్తూ సత్యసాయినే గుప్పిట్లోకి తీసుకున్నాడని ఆరోపించింది. సత్య సాయిబాబాను ఎలా మోసం చేశారనే విషయాలను బయట పెట్టిన శ్యాంసుందర్ లేఖను తాము సంపాదించినట్లు తెలిపింది. శ్యాంసుందర్ లేఖలోని అంశాలను కూడా పత్రిక క్రోడీకరించింది. గత ఆరు నెలల నుంచీ స్వామి ముఖం పక్షవాతంతో బాధపడడం చూస్తున్నానని, ఆ విషయంలో ఎవరైనా ఏమైనా చేశారా, దాని గురించి ఎవరూ మాట్లాడరని, వారికి అధికారం లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే సత్యజిత్‌కు భయపడి కావచ్చునని శ్యాంసుందర్ తన లేఖలో రాసినట్లు పత్రిక వివరించింది. సత్య సాయిబాబాకు సత్యజిత్ ఒక్కరొక్కరినే దూరం చేస్తూ వచ్చాడని, పూర్తిగా బాబా తనపైనే ఆధారపడేలా చేసుకున్నాడని, బాబా మాటలను పట్టించుకోకుండా తన ఇష్టప్రకారం సత్యజిత్ చేస్తూ వచ్చాడని, బాబా కార్యకలాపాలను సత్యజిత్ నిర్ణయించేవాడని, భక్తుల దర్శనానికి కూడా సరిగా తీసుకుని వచ్చేవాడు కాదని ఆ పత్రిక ప్రచురించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆరు నెలలుగా బాబా ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారట. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత బాబాను చూడడానికి వెళ్లిన మంత్రి గీతా రెడ్డికి లోపల నడుస్తున్న వ్యవహారమంతా తెలిసిందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

బాబా ఆరోగ్యం కుదుట పడుతుంది

హైదరాబాద్: సత్యసాయి బాబా ఆరోగ్యంపై వైద్యులు శుక్రవారం తాజా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం బాబా ఆరోగ్యం కుదుట పడుతుందని డాక్టర్ సఫాయా తెలిపారు. అయినా సాయి ఆరోగ్యం ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. డయాలసిస్ కొనసాగుతుందని వెంటిలేటర్ ద్వారానే శ్వాస అందిస్తున్నట్లు వెల్లడించారు. సత్యసాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని సఫాయా తెలిపారు. కిడ్నిల పని తీరు మెరుగు పడుతుందని చెప్పారు. బాబా అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని చెప్పారు. వైద్యుల సేవకు బాబా మెల్లిగా స్పందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ బాబా వెంటిలేటర్ పైనే ఉన్నారని చెప్పారు. బాబా ఆరోగ్యం క్రమంగా పుంజుకుంటుందని కాబట్టి భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెబుతున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి పై కిషన్ ఆగ్రహం

హైదరాబాద్: తమ పార్టీ నేత, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కడప పార్లమెంటు లోక్ సభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌ను బలపరచడమే ఆ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో తాము వైయస్ జగన్ అవినీతిపై ఆరోపణలు చేస్తుంటే గాలి జనార్దన్ రెడ్డి మద్దతు పలకడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు సమాచరాం. గాలి జనార్దన్ రెడ్డిపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. వైయస్ జగన్‌తో ఆయనకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని అంటారు. కడప లోక్ సభ స్థానంలో గానీ, పులివెందుల శాసనసభా స్థానంలో గానీ పోటీ చేసే విషయాన్ని బిజెపి ఇప్పటి వరకు తేల్చలేదు. కడపలో పోటీకి దిగాలా, వద్దా అనే విషయంపై రాష్ట్ర పార్టీ నాయకులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పోటీకి దిగి పరువు పోగొట్టుకోవడం కన్నా దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే, గాలి జనార్దన్ రెడ్డికి కళ్లెం వేయడం ఎలా అనే విషయంపై కిషన్ రెడ్డి సీనియర్ నాయకులతో తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికలపై లగడపాటి సర్వే

హైదరాబాద్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానమే దక్కుతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. ఎన్నికల సమయాల్లోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా సర్వేలు నిర్వహిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచే లగడపాటి.. ఇపుడు కడప, పులివెందుల ఉప ఎన్నికలపై సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చేదులాంటి నిజాన్ని వెల్లడించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తేల్చేశారు. పైపెచ్చు.. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితంకాక తప్పదని లగడపాటి సర్వేలో వెల్లడైంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా డీఎల్ రవీంద్రా రెడ్డి, వైఎస్.వివేకానంద రెడ్డిల పేర్లు ఖరారైన తర్వాత ఈ సర్వేను నిర్వహించినట్టు ఆయన తెలిపారు. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి, విజయమ్మలకు భారీ మెజారిటీతో గెలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

చండీయాగంపై విమర్శల వెల్లువ

హైదరాబాద్ : తీవ్ర విమర్శల మధ్య టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఆధ్వర్యంలో శత చండీయాగాన్ని ప్రారంభించారు. తమది సెక్యులర్ పార్టీ అని చెప్పుకొనే టీఆర్ఎస్ చీఫ్ స్వయంగా ఈ యాగాన్ని నిర్వహిస్తుండడం వివాదాస్పదంగా మారింది. యాగాలు నిర్వహించడం టీఆర్ఎస్ చీఫ్‌కు కొత్త కాకపోయినా.. ఉద్యమ ఉద్ధృతి సమయంలోనూ గతంలో మాదిరిగా ఆయన యాగానికి పూనుకోవడాన్ని తెలంగాణ ఉద్యమ శక్తుల్లోని లౌకికవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలకు శుభం కలగాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తూ ఈనెల 14, 15, 16 తేదీల్లో చండీయాగం నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై వివిధ దళిత, బహుజన సంఘాలు ఘాటుగా స్పందించాయి. ప్రత్యేకించి అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ చండీయాగాన్ని ప్రారంభించడాన్ని వేలెత్తిచూపుతున్నాయి.  "చండీయాగం వల్ల కేసీఆర్‌కు మేలు కలుగుతుందో లేదో తెలియదు. కానీ, తెలంగాణ మాత్రం రాదు'' అని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ కుండబద్దలు కొట్టారు. "పోరాటాలతోనే తెలంగాణ సాధ్యం. చండీయాగం పేరిట కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు'' అని తెలంగాణకే చెందిన వివిధ ప్రజా సంఘాలు తీవ్రమైన ఆరోపణలు చేయడమేకాక, గన్‌పార్క్ వద్ద ఆందోళన కూడా నిర్వహించాయి. ఇదే బాటలో టీడీపీ, సీపీఐ నేతలూ ఉన్నారు. "యాగాలతో తెలంగాణ రాదు. మూఢాల్లో యాగాన్ని చేసేవారిని ఈయన్నే చూశాం. దీంతో ఎవరికి మూడుతుందో ఆయనకే తెలియాలి. యాగం చేస్తే తెలంగాణ వస్తుందంటే.. పదేళ్ల క్రితమే చేసేవాళ్లం కదా? సీపీఐ నారాయణ మాట్లాడుతూ "యాగాల వల్ల తెలంగాణ వస్తే టీఆర్ఎస్ ఎందుకు?'' అని ప్రశ్నించారు. యాగాలతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు భూస్థాపితమైతేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. చంద్రశేఖర రావు అగ్నిగుండం నుంచి యాగాల వరకు వచ్చారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని కెసిఆర్ విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు.

మమతకే బెంగాళీల మొగ్గు

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెసు-కాంగ్రెసు కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. రెండు ప్రసిద్ధ సంస్థలు వేరు వేరుగా చేసిన సర్వేలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి అధికారంలోకి వస్తుందని తేలింది. హెడ్ లైన్స్ టుడే ఛానల్ కోసం ఓఆర్‌జి చేసిన సర్వేలో టిఎంసి 182 స్థానాలను, లెఫ్ట్ కూటమి 101 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. స్టార్ ఆనంద ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వేలో టిఎంసి 215, లెఫ్ట్ కూటమి 74 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బుద్దదేవ్ కంటే మమతా బెనర్జీవైపే బెంగాళీలు మొగ్గు చూపుతున్నారని సర్వేలు తేల్చాయి. ముఖ్యమంత్రిగా మమతను 56 శాతం మద్దతు ఇస్తే, బుద్దేవ్‌కు 20 శాతం మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే ఇప్పటి వరకు జ్యోతిబసు మెరుగైన ముఖ్యమంత్రిగా బెంగాళీలు చెబుతున్నారు. టిఎంసి గద్దెనెక్కితే ముప్పయి అయిదేళ్ల లెఫ్ట్ అధికారానికి బెంగాళీలు గండి కొట్టినట్లే. దశాబ్దాల పాటు అధికారం కోసం వేచి చూస్తున్న మమత ఈసారి తనకు అధికారం తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయం నుండే లెఫ్ట్ కూటమి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. భారీగా పార్లమెంటు సీట్లను టిఎంసికి కోల్పోయింది. ఇప్పుడు కూడా సర్వే ఫలితాలు నిజం అయితే 227 స్థానాలున్న లెఫ్ట్ సగానికి పైగా తగ్గుతాయి. మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు.

జగన్ వెళ్ళేది తీహార్ జైలుకే...

హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లేది పార్లమెంటుకు కాదని తీహార్ జైలుకని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్‌కు పార్లమెంట్‌కు వెళ్లే అర్హత లేదని కేవలం తీహార్‌ జైలుకెళ్లే అర్హత మాత్రమే ఉందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తను సీఎం అయితే తొలి సంతకం గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితుల పరిహారం ఫైలుపై పెడతానన్న జగన్‌ వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల్ని జోక్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు. కడప పార్లమెంట్‌కు పోటీ చేస్తూ ముఖ్యమంత్రి ఎలా అవుతావని ఆయన ప్రశ్నించారు. ఆ ఉద్దేశముంటే తన వెంట ఉన్న ఎమ్మెల్యేలందరితోనూ రాజీనామాలు చేయించి ఎన్నికలకు సిద్ధం కావాల్సిందని అన్నారు. టెలికమ్ మాజీ మంత్రి ఎ రాజా జైల్లో జగన్‌ కోసమే ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. అతిత్వరలోనే జగన్‌కు జైలుకెళ్లే పరిస్థితులు వస్తాయన్నారు.

జగన్‌పై ఉండవల్లి నిప్పులు

హైదరాబాద్ : "దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డిని పొగిడితే నీకు ఎందుకంత కోపం? కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్‌ను పొగడకూడదా? నీ పార్టీలో ఉంటేనే వైఎస్‌ను ప్రశంసించాలా? నీ నైజం నాకు అర్థం కావడం లేదు. వైఎస్‌ను తిట్టిన నేతలపై ప్రత్యేక కథనాలు ఉండవు. కానీ.. నేను వైఎస్‌ను ప్రశంసిస్తే మాత్రం.. ఊసరవెల్లి ఉండవల్లి అంటూ నీ 'సాక్షి' మీడియాలో కథనాలు గుప్పిస్తావా? వైఎస్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. నీ కథనాలకు నేను సంజాయిషీ ఇచ్చుకోవడం కాదు.. నా ప్రశ్నలకు నువ్వే సమాధానాలు చెప్పు'' అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డిపై.. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ నిప్పులు చెరిగారు. మంత్రి వట్టి వసంతకుమార్‌తో కలిసి మీడియాతో ఉండవల్లి మాట్లాడారు. 'నా వద్ద నీ అంత ధనం లేకపోవచ్చు. నీలా వ్యాపార సమర్థతా నాకు లేకపోవచ్చు. కాని.. రాజకీయంగా నిన్ను ఎదుర్కొనే సత్తా మాత్రం నాకు ఉంది' అంటూ జగన్‌పై ఉండవల్లి ఫైర్ అయ్యారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికి మంత్రి పదవి వస్తే.. జగన్ భరించలేకపోయారని ఉండవల్లి దుయ్యబట్టారు. 'నువ్వు ముఖ్యమంత్రివి కావడం కోసం.. పాపం అనవసరంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మను రోడ్డెక్కించావు. ఎర్రని ఎండలో ఆమెను తిప్పుతున్నావు. వైఎస్ మృతి అనంతరం ఆయన గుర్తుగా విజయమ్మ శాసనసభలో సభ్యురాలిగా ఉండాలని పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా గెలిపిస్తే.. నువ్వు ఆమె చేత కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేలా చేశావు. నీకు ఒక కోరిక ఉండొచ్చు. అందుకోసం.. నువ్వు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వరకు సరే. కాని మధ్యలో నీ తల్లి విజయమ్మను ఎందుకు ఈ విధంగా రొడ్డెక్కించాలి?' అని జగన్‌పై విరుచుకుపడ్డారు. వైఎస్ లాంటి మహా నేత అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైతే సహజంగా నాలాంటి అభిమానికి.. నిజంగానే ప్రమాదం జరిగిందా? లేక ఏదైనా కుట్ర ఉందా? అనే సందేహాలు వస్తాయి. అయితే.. దీనిపై తరచి విశ్లేషిస్తే ప్రమాదకరమైన క్యుములోనింబస్ మేఘాల కారణంగా హెలికాప్టర్ కుప్పకూలిందని గ్రహించాను. దానితో సంతృప్తి చెందాను. కానీ.. వైఎస్ కుమారుడిగా.. ఒక ఎంపీగా నువ్వెందుకు ఒక్కనాడు కూడా దీనిపై లోక్‌సభలో ప్రస్తావించలేదు? ప్రమాదంపై సందేహాలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఎందుకు కోరలేదు? కుమారుడిగా వైఎస్ మరణంపై సందేహాలు వ్యక్తం చేయాల్సిన బాధ్యత నీకు లేదా?' అని జగన్‌ను ఉండవల్లి ప్రశ్నించారు.

వైఎస్సార్ గతే కేసీఆర్ కు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఫినిష్ అన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసునని టిడిపిని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావుకు కూడా అదే గతి పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపిని ఇబ్బందులకు గురి చేస్తే కెసిఆర్ ఆస్తులు కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చినందునే కెసిఆర్ టిడిపిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసిఆర్ తన కుటుంబం కోసమే యాగాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమాలు ఎలా చెయ్యాలో అన్నాహజారేను చూసి కెసిఆర్ తెలుసుకోవాలని సూచించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు నేత అహ్మద్ పటేల్ టిఆర్ఎస్ కాంగ్రెసులో విలీనం అవుతుందని చెప్పిన మాటలు నిజం కాదా అని మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. జితెందర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏమవుతుందో అందరికీ తెలుసునని అన్నారు. కెసిఆర్ తన కుటుంబం కోసమే తెలంగాణ ఉద్యమం అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అన్న కాంగ్రెసును ఏమనకుండా టిడిపిని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. మనసులో దురాలోచనలు పెట్టుకొని కెసిఆర్ యాగాలు చేస్తే కోరికలు ఎలా నెరవేరుతాయని నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 177 చట్టం తీసుకు వచ్చి ఉద్యోగులపై ప్రభుత్వం యుద్దం ప్రకటించిందని ఆరోపించారు. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. లేదంటే మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సంభానికి పీసీసీ?

హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) అధ్యక్ష పదవికి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసింది. కడప, పులివెందుల ఉపన్నికల అనంతరం కొత్త పిసిసి అధ్యక్షుడిని అధిష్ఠానం ప్రకటించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ పదవీకాలం పూర్తైనప్పటికీ కొత్త అధ్యక్షుడి నియామకానికి కొంత సమయం పడుతుందన్న ఉద్దేశంతో ఆయన్నే కొంతకాలం కొనసాగించనున్నట్టు అధిష్ఠానం ఇటీవల ప్రకటించింది. ఒకపక్క తెలంగాణ ఉద్యమం, మరోపక్క కాంగ్రెస్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు జగన్మోహన్‌రెడ్డి బయటికి వెళ్ళడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో నిస్తేజం ఆవహించింది. జయంతులు, వర్థంతులకే గాంధీభవన్ కొంతకాలంగా పరిమితమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళనతో అధిష్ఠానం ఉంది. వీలైనంత తొందర్లో పిసిసికి కొత్త అధ్యక్షుడిని నియమించి కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలని అధిష్ఠానం భావిస్తోంది. పిసిసి అధ్యక్షుని నియామకానికి ఎప్పటికప్పుడు ఏదోక ఆటంకం ఎదురవుతోంది. ఇక ఉప ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ పిసిసికి కొత్త అధ్యక్షుడిని నియమించాలన్న అభిప్రాయానికి అధిష్ఠానం వచ్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు పిసిసి అధ్యక్షుని నియామకం అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డిఎస్ తెలంగాణ ప్రాంతానికే చెందిన వారు కావడం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందినవారు కావడంతో పిసిసి అధ్యక్షునిగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారినే నియమించాలని అధిష్ఠానం భావిస్తోంది. పిసిసి అధ్యక్ష పదవికి పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ, చివరకు సంభాని చంద్రశేఖర్ పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. సంభానికి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నట్టు తెలిసింది. పిసిసి పదవికి ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపి మల్లు రవి, మంత్రి దామోదర్ రాజనర్సింహ తదితరుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం.

మీడియాకు తెలిసేటట్లు రజనీ వోటు

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండాకులకు ఓటేశారు. మీడియా కెమెరాల ఫ్లాష్‌లో ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవియం) మీట నొక్కుతూ పట్టుబడ్డారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఆయన బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రహస్యంగా ఓటు వేయాల్సిన స్థితిలో కూడా ఆయనను పెద్ద యెత్తున మీడియా చుట్టుముట్టింది. ఆయన వోటేస్తున్నప్పుడు ఒక్కసారిగా కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఆ వెలుగులో ఆయన పట్టుబడ్డారు. తాను ఎవరికి ఓటేశారో ఫొటోలకు చిక్కిన విషయం తెలియని రజనీకాంత్ నవ్వుతూ - ధరల పెరుగుదల సమస్య అని, ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని , ఇవి కీలకమైన ఎన్నికలని ఆయన అన్నారు.

పరిటాల రవి హత్య కేసును తిరగతోడండి

గుంటూరు: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పరిటాల రవి హత్య కేసును మళ్లీ విచారణ జరిపించాలని టిడిపి మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గురువారం గుంటూరులో డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని చెప్పడం ద్వారా తమ అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పారు. పరిటాల రవి హత్యలో జగన్ హస్తం కోణంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు, శాసనసభ్యులు అందరూ కడప, పులివెందుల ఉప ఎన్నికల కోసం ఒకే జిల్లాలో తిష్ట వేయడం వలన రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. ప్రజల గురించి పట్టించుకోవాల్సిన మంత్రులు ఒకే జిల్లాకు పరిమితం అయి పోయారన్నారు. వైయస్ జగన్ తన అవినీతి సొమ్ముతో ఉప ఎన్నికలలో గెలుపొందాలని భావిస్తున్నారన్నారు.