నాగంపై చంద్రబాబు యాక్షన్ ప్లాన్
posted on Apr 16, 2011 @ 2:12PM
హైదరాబాద్: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ తెలంగాణ శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చర్యలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై ఆయన శనివారం పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు. అత్యంత అవినీతిపరుడైన వైయస్ జగన్‌తో నాగం జనార్దన్ రెడ్డి తనను పోల్చడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో నాగం జనార్దన్ రెడ్డి తప్పులు చేసినా ఉపేక్షించామని, ఇప్పుడు నాగం తీరు పరాకాష్టకు చేరుకుందని చంద్రబాబు సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నట్లు చంద్రబాబు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ స్థితిలో నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. కాగా, జగన్‌తో తాను చంద్రబాబును పోల్చలేదని నాగం జనార్దన్ రెడ్డి శనివారం ఉదయం చెప్పారు.