కేంద్రానికి తెలంగాణ ఉద్యమ సెగ

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మే టెన్షన్ ప్రారంభమైంది. మే నెలకు మరో పది రోజులే ఉండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ , సీమాంధ్ర ప్రభావం ఉండకుండా నిరోధించడానికి కేంద్ర బలగాలను మళ్లీ దింపనున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి మే 10వ తేది వరకే తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్టీ ఎంపీలు సమయం ఇచ్చారు. అంతలో కాక పోయినా మే చివరలోగా తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని సొంత పార్టీ ఎంపీలే కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. మే ఆఖరి వరకు తెలంగాణపై తేల్చడమా లేకుంటే రాజీనామా చేసి సాధారణ కార్యకర్తలుగా మిగలడమా అంటూ వారు కేంద్రానికి తేల్చి చెప్పారు. తెలంగాణ ఇవ్వకుంటే తాము రాజీనామా చేయడం మినహా మరేమీ చేయలేమని చేతులెత్తేశారు. రాజీనామా చేసి సొంత ప్రభుత్వంపైనే యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. అటు సొంత పార్టీ ఎంపీల హెచ్చరికకు తోడుగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మే 10 వరకు సైలెంట్‌గా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కేంద్రం ఉందని అందుకే మే వరకు ఆగాలని టిఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మే ఆఖరి వరకు కేంద్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టిఆర్ఎస్ హెచ్చరిస్తోంది. ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ టిడిపి వంటి పార్టీలు తమను విమర్శించినప్పటికీ సైలెంట్‌గా ఉండిపోతుంది. దీంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మే తర్వాత టిఆర్ఎస్ సైలెంట్‌గా ఉంటే ఇతర పార్టీలు విమర్శించడం మాట అటుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయకుంటే ప్రజలే వారిని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. అందుకే టిఆర్ఎస్ మే తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటించకుంటే ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలనే యోచనలో పడినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్రులు ఊరుకునే అవకాశం ఏమాత్రం లేదు. వారు ఉద్యమాన్ని లేవదీయడం, ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి కావడం తథ్యం. ఈ నేపథ్యంలో ఇటు టిఆర్ఎస్, తెలంగాణవాదులు అటు సొంత పార్టీ ఎంపీల ఆల్టిమేటం, మరోవైపు సీమాంధ్రులు ఏం చేస్తారో అన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఏ విధంగా చూసినా మొత్తానికి ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల తర్వాత ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించాల్సిందే. అలా ప్రకటించకుంటే ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వెలువడే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఎటు తేల్చుకోవాలో పాలుపోని పరిస్థితులో ఉన్న కేంద్రం మళ్లీ పరిస్థితులను చక్క దిద్దడానికి మళ్లీ కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

జగన్ గెలిచినా ప్రజల్లో ఉండరు: కన్నా

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా గెలిచినా చేసేది ఏమీ లేదని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆయన గెలిచినా ప్రజలలో ఉండరని, ఆయన వ్యాపారాలే చూసుకుంటారని అలాంటి వ్యక్తి వల్ల ప్రజలకు వచ్చే లాభమేమీ లేదని కన్నా అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏ చిన్న ఆరోపణలకైనా విచారణ జరిపించే వారని అన్నారు. ఆయన దారిలోనే తాము నడుస్తున్నామని కన్నా చెప్పారు. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయడంలో తప్పు లేదని అన్నారు. కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు ఒకే వేదిక పైకి రావాలని సూచించారు.

జగన్‌ను ఎదుర్కొనడానికి చిరంజీవిని రంగంలోకి

హైదరాబాద్: కడప ఉపఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం తేది దాదాపుగా ఖరారు అయినట్లుగా కనిపిస్తోంది. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి అయిన జగన్‌ను ఎదుర్కొనేందుకు చిరంజీవిని రంగంలోకి దించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ఎన్నికలలో ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు కడప ఉప ఎన్నికలలో చిరంజీవిచే ప్రచారం చేయించి కాంగ్రెసును మరింత ప్రభావవంతంగా చేయాలని యోచిస్తోంది. ఈ నెల 28వ తేది నుండి 30 తేది వరకు చిరంజీవి కడప జిల్లాలో పర్యటిస్తారు. అయితే చిరంజీవి ప్రభావం కాంగ్రెసుకు ఏ మేర ఉపయోగపడుతుందో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. ఇక చిరు పర్యటన తర్వాత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా పర్యటించనున్నారు. మొత్తానికి జగన్‌ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ  అష్టకష్టాలు పడుతోంది.

దమ్ముంటే చర్యలు తీసుకోండి

హైదరాబాద్: పార్టీ ధిక్కరణ చర్యల పేరుతో తమపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ అధినాయకత్వం చేస్తున్న తాటాకు చప్పుళ్ళకు బెదిరే ప్రసక్తే లేదని జగన్ వర్గానికి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి నొక్కివక్కాణించారు. దమ్ముంటే.. మాటలు కట్టిపట్టి చర్య తీసుకోవాలని ఆయన సవాల్ విసిరారు. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలో కొందరిపై అనర్హత వేటు వేసే విషయంపై డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్యలు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేసి అభ్యర్థిని గెలిపించుకోవడంలో విఫలమైన ఎమ్మెల్యేలపై చర్యతీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఓడిన వారిపై చర్యలు తీసుకోకుండా గెలిచిన వారిపై అనర్హత వేటు వేయడమా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, అసెంబ్లీ బయట వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు.

తన ప్రతిష్ట దిగజార్చడానికే: ప్రశాంత్‌భూషణ్

న్యూఢిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే నేతృత్వంలోని లోక్‌పాల్ బిల్లు ముసాయిదా కమిటీలోని పౌరసమాజ ప్రతినిధులపై ఆరోపణలు పెరుగుతున్నాయి. తాజాగా కమిటీ కో చైర్మన్, న్యాయశాఖ మాజీమంత్రి శాంతిభూషణ్ తన కుమారుడు ప్రశాంత్‌భూషణ్ కోసం పైరవీ చేశారంటూ ఓ సీడీ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తమవైపు తిప్పుకోవడానికి తన కొడుకు సహకరిస్తాడని, అందుకు రూ.4 కోట్లు ఇవ్వాలంటూ సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్‌తో శాంతిభూషణ్ మాట్లాడినట్లుగా సంభాషణలున్నాయి. 2009లో జరిగినట్లుగా చెబుతున్న ఈ సంభాషణను తొలుత అప్పటి సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్ ప్రారంభిస్తారు. తనతో పాటు శాంతిభూషణ్ ఉన్నారని, ఆయన కుమారుడు ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాది అని ములాయంసింగ్‌తో చెబుతారు. సుప్రీంకోర్టులో ఆయన పిల్ వేస్తారని, ఆంధ్రాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు జడ్జిని తమ వైపు తిప్పుకోవడంలో ప్రశాంత్ భూషణ్ సహకరిస్తారని ఆయన అంటారు. అనంతరం శాంతి భూషణ్‌తో నేరుగా మాట్లాడాలని చెబుతారు. తర్వాత సంభాషణ ములాయం, శాంతి భూషణ్‌ల మధ్య జరుగుతుంది. తన కుమారుడు ప్రశాంత్ భూషణ్ ఈ పని చేయగలడని ఆయన చెబుతారు. సుప్రీంలో పిల్‌కు ఎక్కువ డబ్బు అవసరం లేదని రూ.4 కోట్లు ఇస్తే సరిపోతుందని చెబుతారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత కర్ణాటక గవర్నర్, నాటి కేంద్ర న్యాయశాఖ మంత్రి భరద్వాజ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా వ్యాఖ్యానిస్తారు. అయితే సిడిపై ప్రశాంత్ భూషణ్ ఖండించారు. తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేంద్ర ప్రభుత్వమే సీడీలను సృష్టించిందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ములాయం సింగ్, అమర్‌సింగ్‌లతో తన తండ్రి శాంతిభూషణ్ మాట్లాడినట్లు చెబుతున్న సీడీ కల్పితమని చెప్పారు. దేశంలోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ట్రూత్‌ల్యాబ్‌లో దీన్ని పరీక్షించామని, సీడీ బూటకమని ల్యాబ్ డైరెక్టర్ ఎస్ఆర్ సింగ్ కూడా ద్రువీకరించారని చెప్పారు. ఈ సంభాషణలు అతుకుల బొంత అని ప్రపంచంలో నిపుణుడుగా పేరొందిన జార్జ్ పాప్‌కన్ కూడా వీటిని పరీక్షించి చెప్పారని అంటున్నారు. వివిధ సందర్భాల్లో ములాయం, అమర్‌సింగ్, శాంతి భూషణ్‌లు మాట్లాడిన వీటిని అతికించి 1.55 నిమిషాల సీడీని తయారు చేశారని చెప్పారు. అయితే సీడీ వ్యవహారంపై శాంతిభూషణ్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఐపీసీ 469 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శాంతి భూషణ్‌కు అన్నాహజారే మద్దతు లోక్‌పాల్ బిల్లు ముసాయిదా కమిటీ సహ చైర్మన్ శాంతిభూషణ్‌పై వచ్చిన ఆరోపణలను అన్నా హజారే తీవ్రంగా ఖండించారు. ఆయనకు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు, అమర్ సింగ్‌కు మధ్య జరిగాయని చెబుతున్న సంభాషణల సీడీ కల్పితమే తప్ప అసలుది కాదని ఆయన అన్నారు.

నాగంను కట్టడిచేసే పనిలో టీడీపీ

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి వ్యవహారం మితిమీరుతున్నందున తెలంగాణలో నాగం చేపడుతున్న పాదయాత్రకు చెక్ చెప్పేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్టుగా సమాచారం. పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలతో ఇబ్బందులు సృష్టిస్తున్న నాగంను కట్టడి చేసేందుకు తెలుగుదేశం అధిష్ఠానం వ్యూహం రచించింది. టీడీపీ తెలంగాణ ఫోరం స్థానంలో ఒక ఉమ్మడి కమిటీని నియమించాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ జెండా కిందే తెలంగాణ ఉద్యమాన్ని స్వతంత్రంగా నడుపుకొనేందుకు ఈ ప్రాంత నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 9వ తేదీ నుంచి నాగం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే నాగంకు ధీటుగా తెలంగాణ ప్రజాప్రతినిధులను రంగంలోకి చంద్రబాబు దించనున్నట్టుగా తెలుస్తోంది. 2008లో చేసిన తీర్మానం, 2009లో పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు పార్టీ కట్టుబడే ఉందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బాబు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు సూచించినట్లుగా తెలుస్తోంది. యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తదితదితరులతో తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

‘రచ్చబండ’కే దిక్కులేదు.. మళ్లీ ప్రజాపథమా?

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించకుండానే ప్రజాపథం నిర్వహించడం ఎందుకని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రచ్చబండలో కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటినన్నింటిని మూలనబెట్టిన సర్కారు మళ్లీ కొన్ని కోట్ల ఖర్చుతో ప్రజాపథం నిర్వహించడం ఎవర్ని వంచించడానికని నిలదీశారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే.. మరోవైపు ఈ తూతూ మంత్రం ప్రచార కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగమేమీ ఉండబోదని అన్నారు. గ్రామాల్లో మంచినీటి కొరత, కరెంటు కోతలు, గిరిజన, దళిత ఆవాసాల దుస్థితి, కనీస వేతనాలకోసం కార్మికుల అగచాట్లు, రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు వంటి సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, వాటినన్నింటిని పరిష్కరించి ప్రజాపథానికి వెళ్లాలని జూలకంటి సూచించారు. గతంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండానే మళ్లీ 'ప్రజాపథాన్ని' ఏ ముఖం పెట్టుకుని ప్రారంభిస్తారంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బండారు దత్తాత్రేయ సీఎంను ప్రశ్నించారు. ఆదివారం ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి 18వ బహిరంగ లేఖ రాశారు.

మా నాన్న వేసిన భిక్షే సోనియాకు అధికారం

కడప: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దేశంలో అధికారాన్ని చెలాయిస్తున్నారంటే అది మా నాన్న వేసిన భిక్షేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో వైఎస్ఆర్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర పుణ్యమే కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మహానేత వైఎస్‌ఆర్ పాదయాత్ర పుణ్యంతోనే సోనియాగాంధీ రెండు పర్యాయాలు ఢిల్లీ గద్దెనెక్కి రాజ్యమేలుతున్నారన్నారు. ఆ విశ్వాసాన్ని మరిచిపోయిన కాంగ్రెస్ నేతలు దివంగత మహానేతను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వైఎస్ మంత్రివర్గం సమక్షంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలపై హౌస్ కమిటీ వేయడం కేవలం ఆయనపై బురదజల్లే ప్రయత్నమేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే మొత్తం రాష్ట్ర మంత్రివర్గంపైనా హౌస్ కమిటీ వేయాలని జగన్ డిమాండ్ చేశారు.

రీసోర్స్‌శాట్-2కు కౌంట్‌డౌన్ ప్రారంభం

శ్రీహరికోట : శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగశాల నుంచి కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రీసోర్స్‌శాట్-2 ప్రయోగానికి సోమవారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభం అయ్యింది. రిసోర్స్ శాట్‌తో పాటు మరో రెండు చిన్న స్పేస్ క్రాప్ట్‌లతో కూడా పీఎస్‌ఎల్‌వీ సీ-16 రాకెట్‌ను ఈనెల 20వ తేదీన ఉదయం 10.12 గంటలకు అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇస్రో తయారు చేసిన 1,206 కిలోల బరువు గల ఇరసోర్స్ శాట్-2 సహజ వనరులపై అధ్యయనం, నిర్వహణ కోసం ఉద్ధేశించినది. దీనితోపాటు నక్షత్రాలు, వాతావరణ పరిశోధనల నిమిత్తం భారత్-రష్యాలు రూపొందించిన 98 కిలోల యూత్‌శాట్, సింగపూర్‌కు చెందిన నాన్‌యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ తయారుచేసిన ఇమేజింగ్ అప్లికేషన్స్ కోసం 106 కిలోల ఎక్స్-శాట్‌ను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంటే సుప్రీం: హజారే

న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తన వైఖరిని కాస్త సడలించుకున్నారు. పార్లమెంటే సుప్రీం అని, లోక్‌పాల్ బిల్లును తిరస్కరిస్తే దాని నిర్ణయాన్ని అంగీకరిస్తానని వ్యాఖ్యానించారు. 'ఆగస్టు 15 డెడ్‌లైన్'పైనా మెత్తబడ్డారు. ప్రభుత్వం సరైన దిశలో ఉందని భావిస్తే దాన్ని పెంచడానికి తాను సుముఖమేనని చెప్పారు. ఎంపిక చేసిన మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. నెల రోజుల్లోనే బిల్లుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన ఉద్యమ విధివిధానాలు 'ఉగ్రవాదాన్ని' పోలి ఉన్నాయన్న వ్యాఖ్యను ఆయన అంగీకరించారు. లోక్‌పాల్ బిల్లుపై రాజకీయ పార్టీల అధినేతలతో చర్చించేందుకు సిద్ధమేనని చెప్పారు. లోక్‌పాల్ బిల్లుతో అవినీతి అంతమైపోదని, కొంతమేరకు నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని వివరించారు. ఆర్ఎస్ఎస్‌తో తనకు సంబంధాలు ఉన్నాయన్న విమర్శలను హజారే కొట్టిపారేశారు. అవినీతి వ్యతిరేక ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో తాను పర్యటించనున్నానని వెల్లడించారు. రాజకీయ పార్టీని స్థాపించే యోచన గానీ, పోటీ చేసే యోచన గానీ లేవని కుండబద్దలు కొట్టారు. కాగా, తాను కుళ్లిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కృషి చేస్తున్నట్టు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హజారే స్వాగతించారు. దేశాభివృద్ధి కోసం అలాంటి యువత ముందుకు రావాలని కోరారు.

జగన్ పై 'జగన్నాయకుడు' సినిమా

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం త్వరలో రానుందని సమాచారం. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం కాంగ్రెసులో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, అనంతరం ఆయన పార్టీ వీడటం, ఆ తర్వాత పార్టీ పెట్టడం తదితర విషయాలు పొందు పరుస్తూ శ్రీరామ్ అనే దర్శకుడు చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి జగన్నాయకుడు అనే పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీరామ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి మంచి అభిమాని. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు మరింత ఆకర్షితుడయ్యాడంట. ఆయనను వైయస్ మృతి తీవ్రంగా కలిచి వేసింది. అయితే వైయస్ మృతి తర్వాత జగన్‌ను ఆయన బాగా ఆరాధించాడు. అయితే అలాంటి జగన్ ఎంపీగా కాంగ్రెసు పార్టీని విభేదించి బయటకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని పెట్టాడు. ఇడుపుల పాయ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టిన ఓదార్పు, తండ్రి ఆశయాలు సాధించే వ్యక్తిగా ఇలా ఈ సంవత్సరంన్నరగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన జగన్నాయకుడులో పొందు పర్చనున్నారని సమాచారం.

బాబాకు ఇంకా మూడు వారాలు చికిత్స

అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు చికిత్స మరో మూడు వారాలు ఉంటుందని డాక్టర్లు రవిరాజ్, సఫయాలు ఆదివారం విలేకరుల ముందు స్పష్టం చేశారు. బాబా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. నిలకడగా ఉన్నప్పటికీ ఆందోళనగా లేదని మాత్రం చెప్పలేమని అన్నారు. బాబాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పారు. వెంటిలేషన్‌పై బాబాకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ముగ్గురు అమెరికన్ వైద్యుల ప్రత్యేక బృందం బాబాను పరిశీలిస్తున్నారని చెప్పారు. బాబా శరీరంలో ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ తగ్గిందన్నారు. బాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నిపుణులతో సమీక్షిస్తున్నామని అన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని చెప్పారు.

పురందేశ్వరి గట్టి నమ్మకం

విజయనగరం: కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని కేంద్రమంత్రి పురందేశ్వరి ఆదివారం విజయనగరం జిల్లాలో మాట్లాడుతూ చెప్పారు. ప్రజలు కాంగ్రెసు పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని గౌరవిస్తున్నారని అన్నారు. వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని చెప్పారు. కాగా కడపలో ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెసు ఖచ్చితంగా గెలుస్తుందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జగన్‌ మెజార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. జగన్‌కు రెండు లక్షల మెజార్టీ వస్తుందని తాను చెప్పిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని వారు రెండు లక్షల మెజార్టీ వస్తుందంటే దానిపై తాను సవాల్ చేశానని, కానీ జగన్ గెలుస్తాడని చెప్పలేదన్నారు. మంత్రి డిఎల్ ఖచ్చితంగా గెలుపొందుతారని అన్నారు.