ఆ ఐదుగురిపై వేటుకు రంగం సిద్దం
హైదరాబాద్: వైయస్ జగన్ వెంట ఉంటున్న రైల్వే కోడూరు శానససభ్యుడు శ్రీనివాసులును కాంగ్రెసు నాయకులు బుజ్జగిస్తున్నారు. జగన్‌ను వదిలేసి తిరిగి కాంగ్రెసులోకి రావాలని వారు అడుగుతున్నారు. చాలా రోజులుగా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ మాదిరిగానే తమ వైపు రావాలని వారు శ్రీనివాసులును అడుగుతున్నారు. కాంగ్రెసులోకి తిరిగి రావడానికి నిరాకరిస్తే శ్రీనివాసులపై కూడా అనర్హత వేటుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నాయకులు అనుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత వేటుకు కాంగ్రెసు నాయకత్వం రంగం సిద్ధం చేసింది. కొండా సురేఖ, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. ఆ ఐదుగురు శాసనసభ్యులపై మల్లుభట్టి విక్రమార్క, కొండ్రు మురళి శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు బుధవారం ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్ వారిపై అనర్హత వేటు వేస్తారని అంటున్నారు. వినకపోతే శ్రీనివాసులును కూడా ఆ ఐదుగురి జాబితాలో చేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా, ఇతర జిల్లా శాసనసభ్యులు కడప లోక్ సభ నియోజకవర్గంలోకి ప్రవేశించకుండా కాంగ్రెసు అధిష్టానం కట్టడి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.