'ఉప ఎన్నికల్లో ఎవరు ఓడినా ఒకటే'
posted on Apr 16, 2011 @ 11:36AM
విజయవాడ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కడప ఉప ఎన్నికలలో జయాపజయాలను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వతహాగా క్రికెటర్ అయిన సీఎం ఎన్నికల ఫలితాలను కూడా అదేవిధంగా తీసుకోవాలన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు ఓడినా ఒకటేనన్నారు. జిల్లాలో మంత్రివర్గాన్ని మోహరింప చేసి ప్రభుత్వాన్ని స్తంభింపచేయటం విడ్డూరంగా ఉందని నారాయణ వ్యాఖ్యానించారు. అవసరం అనుకుంటే కడపలో టీడీపీ తరపున ప్రచారం చేస్తామన్నారు. సత్యసాయి బాబా ఆస్తులను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే చాలా దారుణాలు జరుగుతాయన్నారు. కళ్లు మూసి తెరిచే లోగా జగన్ వందల కోట్ల రూపాయలు సంపాదించారని, ఇదంతా రాజకీయ అవినీతి మంత్రంతోనే సాధ్యమైందని నారాయణ అన్నారు. భూ ఆక్రమణ కేసులో నారాయణ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. కేసును కోర్టు కొట్టేసింది. భూపోరాటాల సందర్భంగా నారాయణపై ఈ కేసు నమోదైంది. తనపై కేసును కొట్టేసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరిన్ని భూపోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు.