భారత్ కజక్‌ల మధ్య ఏడు ఒప్పందాలు
న్యూఢిల్లీ: తన హయాంలో పాకిస్థాన్-భారత్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తే తాను చాలా సంతోషిస్తానని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రెండు రోజుల కజకిస్థాన్ పర్యటనను ముగించుకుని ఆయన స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌తో భారత్ సంబంధాలను మామూలు స్థాయికి తీసుకురావడంలో విజయం సాధిస్తే తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించినట్లుగా భావిస్తానని చెప్పారు. సరిహద్దుల నిర్వహణపై నూతన ద్వైపాక్షిక విధానం ఏర్పాటుకు చైనాతో కలిసి తీసుకున్న నిర్ణయం సమీప భవిష్యత్తులో సత్ఫలితాలిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. జీ20, డబ్ల్యూటీవో, ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికలపై పరస్పరం సహకరించుకునే విషయమై కూడా చైనా అధ్యక్షుడు జింటావోతో కూడా చర్చించినట్టు తెలిపారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అవినీతిపై పోరాటం చేసిన అన్నా హజారే అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. అవినీతిపై పోరాటంలో భాగంగా హజారే ఇటీవల ఆమరణ దీక్ష చేయడం, అందుకు ప్రజామద్దతు వెల్లువెత్తడం గురించి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు.
కాగా, ప్రధాని కజకిస్థాన్ పర్యటనలో ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సంకల్పించాయి. ఇందులో భాగంగా పౌర అణు సహకార ఒప్పందం సహా ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. కజక్ రాజధాని అస్తానాలో ఆ దేశాధ్యక్షుడు నజర్‌బయేవ్‌తో చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య కుదరిన ఒప్పందాల్లో అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు వాడుకోవడానికి వీలుగా ఇరు దేశాలు ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అణు ఇంధన సరఫరా, అణు విద్యుత్కేంద్రాల నిర్మాణం - నిర్వహణ, పరిశోధనల సమాచారం బదిలీలకు ఇది దోహదపడేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాల్లో భాగంగా భారత్‌కు 2014 నాటికి 2,100 టన్నుల యురేనియాన్ని సరఫరా చేస్తామని కజక్ అధ్యక్షుడు నజర్‌బయేవ్ హామీ ఇచ్చారు. హైడ్రోకార్బన్ రంగంలో రూ.1,773 కోట్ల విలువగల మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి కింద భారత ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌కు కాస్పియన్ సముద్రంలోని సప్తాయెవ్ చమురుక్షేత్రంలో 25 శాతం వాటా దక్కుతుంది.