మూడు రాష్ట్రాల్లో నేడే పోలింగ్
న్యూఢిల్లి: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం పోలింగ్ జరగనుంది. కేరళలో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ పోటీ పడుతుండగా తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె కూటములు ఎన్నికల బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలోని 2జి సెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, ఆదర్శ్ వంటి కుంభకోణాలతోపాటు పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కరుణానిధి కుటుంబ అవినీతి పాలన వంటి అంశాలపై అన్నాడిఎంకె కూటమి ఎన్నికల ప్రచారం చేసింది. ఈ మూడు రాష్ల్రాల్లోనూ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే విషయం తెలియాలంటే మరో నెల రోజులు వేచి ఉండాలి. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్నికలు ముగిసిన అనంతరం మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. డీఎంకే కూటమిలో డీఎంకే 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 63, పీఎంకే 30, కొంగునాడు మున్నేట్ర కళగం ఏడు, విడుదలై చిరుతైగల్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇంకా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మూడు, మూవేందర్ మున్నేట్ర కళగం, పెరుందలైవర్ మక్కల్ కట్టి ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీల అభ్యర్థులు డీఎంకే గుర్తుపైనే ఎన్నికల బరిలోకి దిగారు. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 162 స్థానాల్లో పోటీ చేస్తుండగా, డీఎండీకే 41, సీపీఎం 12, సీపీఐ పది, మనిదనేయ మక్కల్ కట్చి మూడు, సమత్తువ మక్కల్ కట్చి రెండు, ఫార్వర్డు బ్లాక్, ఆలిండియా మూవేందర్ మున్నేట్ర కళగం, ఆర్‌పీఐ, కొంగు ఇలైంజర్ పేరవై ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి.
కేరళ శాసనసభలో 140 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ముమ్మరంగా సాగిన ప్రచారం ప్రతిపక్ష యుడిఎఫ్ సాగించిన చెదురుమదురు హింసాత్మక సంఘటనలతో సోమవారం ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పోలింగ్‌లో మొత్తం 2,31,47,871 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 20,758 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేస్తున్న ప్రవాస కేరళీయులు ఓటేసే హక్కును పొందిన తొలి ఎన్నికలు ఇవి. దీని కోసం 8,862 దరఖాస్తులను ఆమోదించారు. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు గానూ 187 మంది పోటీలో ఉన్నారు. అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8.1 లక్షలు. 867 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ 17, డీఎంకే 10, ఆల్‌ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ 17, ఏఐఏడీఎంకే 10 స్థానాల్లో బరిలో ఉన్నాయి. పోటీలో ఉన్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వైతిలింగం, ఆయన మంత్రివర్గ సహచరులు, అసెంబ్లీ స్పీకర్ ఆర్ రాధాకృష్ణన్, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి.. తదితరులున్నారు.