కెసిఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసింది
posted on Apr 16, 2011 @ 3:07PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన కుమారుడు, శాసనసభ్యుడు కెటి రామారావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు దుమ్మెత్తిపోశారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కెసిఆర్ కోట్లు సంపాదించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. హైదరాబాదు చుట్టుపక్కల వేయి ఎకరాలు సంపాదించారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ కుటుంబం ఏం త్యాగాలు చేసిందని ఆయన అడిగారు. కెసిఆర్ విద్యార్థులను రెచ్చగట్టే ప్రసంగాలు చేశారని ఆయన అన్నారు. కెసిఆర్ కూతురు కవిత, కుమారుడు కెటి రామారావు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ నాయకుడు చంద్రబాబు జైలుకు వెళ్లారని, కెసిఆర్ ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లలేదని, పోలీసు దెబ్బ తినలేదని ఆయన అన్నారు. త్యాగాలు చేసినవారిని విస్మరించి ఏ త్యాగాలు చేశారని కెటి రామారావుకు సిరిసిల్ల టికెట్ ఇచ్చారని ఆయన అడిగారు.