కేసీఆర్ కు చరమగీతం పాడితేనే సాధ్యం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర్ రావును హుస్సేన్ సాగర్‌లో పడేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్ కస్తూరి జయప్రకాష్ అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే.. తెరాసను రద్దు చేసి, కేసీఆర్‌ను, ఆయన కుటుంబ నాయకత్వానికి చరమగీతం పాడితేనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమన్నారు. దీనిపై జయప్రకాష్ మాట్లాడుతూ తెరాస పదేళ్ళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, వారి రాజకీయ ప్రాతినిథ్యం కోసం ఏనాడు ఉద్యమించలేదన్నారు. ఆయన నాయకత్వంలో ఈ వర్గాలకు అన్యాయమే జరిగిందని దీనికి నిదర్శనం తెలంగాణ ఎమ్మెల్యేపై దాడి అని గుర్తు చేశారు. ఇకపోతే.. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 177 జీవో ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అందువల్ల దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.