బిసిలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశారు?
posted on Aug 6, 2012 @ 4:50PM
ఆంథ్రప్రదేశ్‌లోని బిసిలందరూ కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశారు? అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎందుకంటే బిసిల అభ్యున్నతి కోసం తామెన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టామని రాష్ట్రప్రభుత్వం చెప్పుకుంటోంది. అలానే తెలుగుదేశం పార్టీ అయితే బిసిల కోసం ప్రత్యేకమైన డిమాండ్లే చేస్తోంది. ఇటువంటి తరుణంలో బిసిలందరూ గతంలో కాంగ్రెస్‌కు ఓటేసింది ఎందుకంటే ఓన్లీ! ఫీజు రియంబర్స్‌మెంట్ కోసమే అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అథ్యక్షుడు కృష్ణయ్య చెబుతున్నారు. అంటే వైఎస్‌ఆర్ హయాంలోనూ ఈ పథకం అమలు అయిందని ఆయన చెబుతూ కేవలం ఈ పథకం నచ్చే తాము ఓటేశామంటున్నారు.
అంటే కృష్ణయ్య ఎవరికి ఓటేస్తే వారికే యావత్తు రాష్ట్రంలోని బిసిలందరూ ఓటేశారా? లేక ఓటేస్తారని చెబుతున్నారా? వెనుకబడిన తరగతుల వారి చదువు కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటితో పాటు అదనంగానే ఈ ఫీజు రియంబర్స్‌మెంట్‌పథకం అమలు చేశారు. ఆ విషయాన్ని పూర్తిగా గమనించకుండానే బిసిలు ఈ పథకం కోసమే ఓటేశారని చెబుతున్నారు. అసలు ఏకతాటిపై ఉండని వర్గంగా బిసిలకు పేరుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ అందరూ బిసిలు ఏకతాటిపై నిలబడటం జరగదు. దీనికి తాజా ఉదాహరణ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ బిసి ప్రతినిథిగా మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నిలబడితే ఆయనపై తోట త్రిమూర్తులు గెలుపొందారు. ఈ విజయం వెనుక బిసిల నిర్ణయమే కారణమని చెబుతున్నారు. మరి కృష్ణయ్య మాట ఆథారంగా ఎంతమంది ఈ ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు మొగ్గి కాంగ్రెస్‌కు ఓటేశారో ఆయనకే తెలియాలి.