టిడిపికి బై కొట్టి బైరెడ్డి కొత్తపార్టీ పెడతారా?
posted on Aug 6, 2012 @ 5:23PM
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేస్తారా? త్వరలో కొత్తపార్టీ ప్రారంభించే ఆలోచనలో ఆయన ఉన్నారా? అన్న ప్రశ్నలు ఆయన పోకడను బట్టి ఉదయిస్తున్నాయి. ఎందుకంటే రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసినప్పటి నుంచి అవసరమైతే తెలుగుదేశం పార్టీని వదిలేస్తాను అంటూ ఒకసారి కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద నోరుజారారు. ఆ తరువాత ప్రత్యేకరాయలసీమ కావాలన్న నినాదంతో హైదరాబాదులోనూ ఇదే మాట అన్నారు. చివరికి 92గంటల నిరవధిక దీక్షలోనూ దీన్ని రిపీట్ చేశారు. అంటే మనస్సులో లేనిది నోటిలో నుంచి జారుతుందా? ఒకవేళ ఆయన సొంతపార్టీకి ప్లాన్ చేసుకున్నారేమో అన్నట్లుంది రాజశేఖరరెడ్డి పోకడ.
తెలుగుదేశం పార్టీ అథ్యక్షుడు చంద్రబాబునాయుడు మద్దతు కోరిన రాజశేఖరరెడ్డి స్వయంగా పిలిస్తే సరిపోయిది కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వటం లేదు. ఆయన అంతరంగాన్ని బయట పెట్టకుండా ప్రత్యేకరాయలసీమ కోసం ఎందరు తన వెనుక నడుస్తారని అంచనాలు వేసుకుంటున్నారు. దీన్ని బట్టి కొత్తపార్టీ ప్రారంభిస్తే వీరందరినీ తన పార్టీలోనే చేర్చుకోవచ్చనే ఆలోచన ఆయనకు ఉందని అర్థమవుతోంది. అంతేకాకుండా సెంటిమెంటుగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తెరాస అథ్యక్షుడు కె చంద్రశేఖరరావు బైరెడ్డికి ఆదర్శం.
ఆయన కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణా ఉద్యమం చేస్తూ పార్టీని డిక్లేర్ చేసిన విషయం రాష్ట్రంలోని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పేరిట పార్టీ పెట్టడానికి అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. అదును కోసమే బైరెడ్డి ఎదురుచూస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే ఇంతవరకూ చంద్రబాబు నాయుడు అదే రాయలసీమలోని చిత్తూరు జిల్లా వాసి అయినా బైరెడ్డి ఉద్యమానికి మద్దతు పలకలేదు. తెలంగాణా ఇచ్చే ఆలోచనే ఉంటే దానితో పాటు రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం ఇవ్వాలని బైరెడ్డి డిమాండు చేస్తున్నారు. కొత్తగా ఈ వ్యవహారంలో చంద్రబాబుపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.
ఎందుకంటే తెలంగాణాకు మద్దతు ప్రకటించాలని టిఆర్‌ఎస్ కోరుతున్న నేపథ్యంలో ఇష్యూను డైవర్ట్ చేసేందుకు బాబే తన పార్టీ నేత అయిన బైరెడ్డిని రెచ్చగొట్టి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. దీనికి మద్దతు ప్రకటిస్తే ఒక ప్రాంతానికి తాను పరిమితమవుతామన్న భయంతోనే బాబు ఈ ఉద్యమం విషయంలో మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. ఏమైనా నిప్పులేనిదే పొగరాదన్న చందంగా ఈ ఇద్దరి వైఖరి భవిష్యత్తులోనే బయటపడాలి.